ఆజ్ఞా చక్ర సాధనానుభవాలు - 4
మూలం : కపాల మోక్షం అనే మోక్ష సాధనా గ్రంథం
కాపాలిక సాధన :
కాపాలిక సాధన వలన మన యందు త్రిగుణాలు అనగా సత్వ రజో తమో గుణాలు తారతమ్యాలు వలన మనకి స్త్రీ పురుష బేధాలు, ద్వంద్వ ప్రవృత్తి భావాలు అనగా ప్రతిదానిలోనూ రెండు భావాలు అంటే కష్టము సుఖము, మంచి చెడు, పాపము పుణ్యము, చీకటి వెలుతురు ఇలా ద్వంద్వ భావాలు పోయి అన్నిటి యందు ఏకత్వ భావము కలగటానికి కాపాలిక సాధన ఉపయోగపడుతుంది.
అఘోర సాధన :
అలాగే అఘోర సాధన వలన మనం చేసే త్రి కర్మలు అనగా స్థూల సూక్ష్మ కారణ కర్మల వలన ఏర్పడే పాపాలు క్షయము చెందుతాయి. అనగా వివిధ రకాల పదార్థాలు మాయలు తొలగిపోయి ఏక పదార్థ జ్ఞానము అనగా ఉన్నది ఏక బ్రహ్మ పదార్థం అని జ్ఞానము కలుగుతుంది. దానితో వీరికి మలము,ఆహారము ఒకేరకంగా అనుభూతి కలుగుతుంది.
భైరవ సాధన :
భైరవ సాధన వలన స్త్రీ పురుషులు నగ్నత్వమునకు బదులుగా దిగంబర తత్వం అలవడుతుంది. కామ తత్వం నుండి దైవ తత్వం అలవడుతుంది.
నాగ సాధువులు సాధన :
ఇక నాగ సాధువులు సాధన వలన మృత్యు భయం నుండి విముక్తి చెంది కావలసినప్పుడు కావలసిన విధంగా మహా మృత్యువును తమ అగ్ని సాధన ద్వారా సంపాదించుకుంటారు. ఇలా ఈ సాధనలు గూర్చి రాయటం చాలా తేలిక. చేసే సరికి మనకి చుక్కలు కనిపిస్తాయి. పైగా వీటికి అధిష్టాన దైవంగా శ్రీదత్తుడు ఉంటాడు. ఈయన తన పరీక్ష మాయలు పెడతాడు. మనల్ని మూడు చెరువుల నీళ్ళు తాగిస్తారు అని గ్రహించండి. ఈ విషయ జ్ఞానం అంతా కూడా నా దగ్గరకు వచ్చిన శ్రీ దత్త స్వామి విగ్రహ మూర్తి ఆరాధన వలన తెలిసినది.అక్కడనుండి నా గుండెకాయ దబా దబా కొట్టుకోవటం ప్రారంభమైనది. ఎందుకంటే తాంత్రిక సాధన అంటే ఆషామాషీ కాదు అని గ్రహించండి. అసాధ్యం కాదు కానీ, అంత సాధ్యం కాదని గ్రహించండి. ఎన్నో మాయలు, మర్మాలు ,మాయ దేవతలు, మంత్ర దేవతలను దాటాలి. ఒక్కొక్క చక్రంలో దాటడానికి మనకి కనీసం 12 నుండి 48 సంవత్సరాలు పడితే ఈ తాంత్రిక విధానంలో ఆరు నెలల నుండి 2 సంవత్సరాలు పడుతుంది. 24 కోట్ల గాయత్రి శక్తిని (48 సంవత్సరాలు పడితే) వీరికి ఈ తాంత్రిక యోగులకు కేవలం నలభై ఒక్క రోజులలో సంపాదించగలరు. అందుకే తాంత్రిక విధి విధానము ప్రఖ్యాతి చెందినది. కానీ దీనిని ఆచరించాలంటే ఎంతో గుండె ధైర్యము, మనోనిబ్బరం, ఆశ లేకుండా, భయమూ లేకుండా, స్పందించకుండా ఉండాలి.తాంత్రిక సాధన అంతా అర్ధరాత్రి పూట స్మశానాలలో 12 నుండి 4 గంటల మధ్యనే జరుగుతోంది. ఏకాకిగా నగ్నముగా ఒంటరిగా ఈ సాధనలు చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ తాంత్రిక సాధనను చాలామంది మరుగు పరిచారు. కానీ ఈ సాధన చేయకపోతే ఆజ్ఞా చక్రము నుండి సహస్ర చక్రాల మధ్య ఉండే నాలుగు ఉప చక్రాలు అనగా గుణ, కర్మ,కాల, బ్రహ్మ చక్రాలు శుద్ధి కావు. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. గృహస్తులు ఈ తాంత్రిక సాధన చేయరాదు. పోనీ తెగించి చేసిన వాటి సాధన మాయలు తట్టుకోవాలి. లేదంటే మతి భ్రమణం చెంది పిచ్చి వాడు కావడం ఖాయం.ఇలా కాపాలికులు శ్రీశైలము నందు, అఘోరాలు కాశీ నందు,భైరవులు ఉజ్జయిని నందు, నాగా సాధువులు హిమాలయ పరిసర ప్రాంతాలలో తమ నిర్దేశిత సాధనలు చేస్తూ కనిపిస్తారు. ఇప్పుడుఈ చక్రాల సాధన గూర్చి తర్వాత వివరిస్తాను. ప్రస్తుతానికి ఆజ్ఞా చక్ర సాధన విషయాలు తెలుసుకోండి.
--- మీ జ్ఞాన భిక్షువు
పవనానంద సరస్వతి.
No comments:
Post a Comment