Vedantha panchadasi:
ఇదంత్వరూప్యతే భిన్నే సత్వాహన్తే తథేష్యతామ్ ౹
సామాన్యం చ విశేషశ్చ ఉభయత్రాపి గమ్యతే ౹౹38౹౹
38. "ఇది" "రజితము" అనే భావనలు రెండు విభిన్న భావనలు.అట్లే స్వత్వము అహంత అనునవి రెండు భిన్నములైన భావములని తెలియుము.
ఇది, స్వత్వము అనునవి రెండును సామాన్యాంశములు.రజితము అహంత అనునవి విశేష భావములు.
దేవదత్తః స్వయం గచ్ఛేత్త్వం వీక్షస్వ స్వయం తథా ౹
అహం స్వయం న శక్నోమీత్యేవం లోకే ప్రయుజ్యతే ౹౹39౹౹
39. దేవదత్తుడు స్వయముగ పోవుగాక,నీవు స్వయముగ చూడుము,నేను స్వయముగ చేయజాలను,ఇట్లు లోకమున ప్రయోగమున్నది గదా.
(స్వయం శబ్దపు సామాన్యత్వము చూపబడినది.)
ఇదం రూప్య మిదం వస్త్రమితి యద్వదిదం తథా ౹
అసౌత్వ మహమిత్యేషు స్వయమి త్యభిమన్యతే ౹౹40౹౹
40. ఇది వెండి,ఇది వస్త్రము మొదలగు వానిలో "ఇది" సామాన్యమైనట్లే
ప్రథమ మథ్యమ ఉత్తమ పురుషులు మూడును స్వయమని అభిమానించును.
అహంత్వద్భిద్యతాం స్వత్వం కూటస్థే తేన కిం తవ ౹
స్వయం శబ్దార్థ ఏవైష కూటస్థ ఇతి మే భవేత్ ౹౹41౹౹
41. (ఆక్షేపము)స్వత్వము అహంత కంటె భిన్నమగు గాక.దాని వలన కూటస్థమున కేమి లాభము? (సమాధానము)స్వయం శబ్దమునకు అర్థమే ఈ కూటస్థము.
అన్యత్వవారకం స్వత్యమితి చేదన్యవారణమ్ ౹
కూటస్థస్యాత్మాతాం వక్తురిష్టమేవ హి తద్భవేత్ ౹౹42౹౹
42. (ఆక్షేపము)స్వత్వము ఇతరములను వారించును గదా.కూటస్థమును గూర్చి చెప్పుట లేదే.(సమాధానము) ఈ "ఇతరములను వారించుట"యే కూటస్థము యొక్క ఆత్మత్వము.ఇది మాకు ఇష్టమే (సమ్మతమే).
ఇది అనే శబ్దము అన్ని వస్తువులకు అన్వయించునట్లే,
నేను అనే శబ్దము సకల మానవులకు జీవజాలమునకు అన్వయించును.
కాని రజతము,అహంతలు పరిమితమైన అన్వయములుగలవి.
బిచ్చగాడైనను చక్రవర్తియైనను"నేను"అనే తనను తాను ఉద్దేశించును.కాని వారి అహంతలలోని భిన్నత వలన వైవిధ్యము అనుభూతమగును.
అంతటను అన్వయించే భావము సామాన్యము.
ఒక దానికి పరిమితమై విశేషముగ ఏర్పచునది విశేష భావము.
ప్రపంచదృశ్యము గారడీవాని యుక్తి,దానికి నాకు మధ్యగల విషయి-విషయ సంబంధమంతయు అవివేకయుతమే-ఈ అవగాహన పాతుకొన్నప్పుడు"అహంత"నిర్మూలమగును."ప్రపంచ"భావనను కలిగించునది "నేను"అనునదే అని తెలిసినప్పుడు ఆ రెండును శాంతిలో లయించును.
అయినను
"నేను సమస్త విశ్వము ఒక్కటే, నాకంటె వేరుగా ఏదియులేదు"
అను శ్రేష్ఠతరమగు "అహంతా" రూపముగా జ్ఞాని యొక్క అవగాహన(వివేకము)ఉండును.
మరియొక విధమగు "అహంత"ఉన్నది;
"నేను"అత్యంత సూక్ష్మమనియు, అణుస్వభావము కలదనియు, కావున ఈ విశ్వమునందలి సమస్త విషయములకంటె విభిన్నము, స్వతంత్రమనియు వ్యక్తి భావించునప్పుడు అది ఉండును,
ఇది కూడా మోక్షమునకు అనుకూలమగుటవలన నిషేధింపదగినది కాదు.
దేహముతో తాదాత్మ్యము చెందించు "అహంతను" దృఢముగా పరిత్యజింపవలయును.
శ్రేష్ఠతరమగు "అహంతను"
పట్టుదలతో పెంచుకొనుటవలన అల్పతరమగు అహంత నిర్మూలింపబడును.
"నేను","నాది"మొదలగు వానికి అస్తిత్వము ఏమాత్రము లేదు. "నేను నష్టపోయితిని"-అని ఆలోచించుట వలన దుఃఖమును పొందును."నేను జాగరూకుడను" అని ఆలోచించుట వలన ఆనందము వైపు పోవును.
ఒకహద్దును దాటి చూడని నేత్రేంద్రియముయొక్క అసమర్థతయే నైల్యముగా అగుపించును.అదేవిధముగా,
ప్రపంచాకారమును దర్శించునది ఆలోచనా పరిమితియే.
ప్రంచదర్శనము (ప్రపంచాకారము)భ్రమ;
దాని భావననే(ప్రపంచ భావననే) మనస్సునందు మరల ఆవిర్భవింపనీయకుండుటయే శ్రేష్ఠతరము.
పూర్ణమూ,సర్వవ్యాపమూ అయిన "నేను"శరీరంకాను,మనస్సు కాను,బుద్ధి కూడా కాను.
అజ్ఞానం అనబడే ఈ స్వప్నం నుండి నేను స్వరూప స్థితిలోకి మేలుకున్నాను.జ్ఞానస్వరూపముగా
నన్ను నేను తెలుసుకున్నాను.
ఈ స్వరూపావగాహనను
సమ్యక్ జ్ఞానమని బుధులు అంటున్నారు.
No comments:
Post a Comment