Tuesday, November 5, 2024

 🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹:
ఆజ్ఞా చక్ర సాధనానుభవాలు - 5


( ఆజ్ఞాచక్ర జాగృతి )


మూలం : కపాల మోక్షం అనే మోక్ష సాధనా గ్రంథం 

అనుభవం , అనుభూతి : పవనానంద సరస్వతి



...మైసూరు దత్త పీఠం నుండి వచ్చిన పంచలోహ శ్రీ దత్త స్వామి విగ్రహ మూర్తి, స్ఫటిక శ్రీచక్రము అలాగే నాకు వచ్చిన వెండి శివలింగమూర్తి , బంగారు బాలదుర్గ యంత్రము విషయం మీకు విదితమే కదా ! ఇలా ప్రతి రోజూ వీటిని కూడా నిత్య పూజలో ఉంచడం జరిగినది. నేను ఆజ్ఞాచక్రం ధ్యాన సాధన చేస్తుండగా విచిత్రంగా వివిధ రకాల శబ్దాలు తగ్గుతూ వివిధరకాల వాయిద్యాల శబ్దాలు స్పష్టముగా వినబడసాగాయి. ఆ నాద కచేరి విన్న దగ్గర నుండి ఈ వాయిద్య శబ్దాలు అనగా మృదంగము, వేణువు, హార్మోనియం, తబలా వంటి శబ్దాలు వినబడసాగాయి. నేను తీవ్ర ధ్యానంలో ఉండగా ఎవరో ఏదో ఒక వాయిద్యమును మ్రోగిస్తూ ఉంటే ఎలాంటి శబ్దం వస్తుందో అలా నాకు స్పష్టంగా ఎవరు వాయించకపోయినా వినబడసాగింది.ఈ శబ్ద నాదాలకి నా చెవులలో చిల్లులు పడతాయి ఏమోనని భయము పెరగసాగింది. దానితో నాకు ధ్యాన భంగము అయిపోయేది.ఈ శబ్దాలు నేను ధ్యానం ఆపిన ఆగిపోయేవి కావు. నిరంతరం ఏదో ఒక వాయిద్యం లయబద్ధంగా శాస్త్ర బద్ధంగా తాళబద్ధంగా మ్రోగడము నేను గమనించాను.ఈ వాయిద్య శబ్దానికి నాలో ఏదో తెలియని ఉత్తేజం కలిగేది. దానితో నృత్యాలు చెయ్యటం లేదా తాళానికి తగ్గట్లుగా కాళ్లు చేతులు కదపటం ఆరంభమైనది.ఇలా కొన్ని నెలల పాటు కొనసాగింది. ఈ వాయిద్యం శబ్దము ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు అంతమవుతుందో నాకు తెలిసేది కాదు. కాకపోతే మనస్సు స్థిర మనస్సుగా మారి ఏకాగ్రత స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ వాయిద్య నాదం వినబడేది.రాను రాను నేను ఈ వాయిద్య  శబ్ద నాదములకు అలవాటు పడిపోయి ఏదో తెలియని ఆనంద స్థితిని పొందటం తరచుగా జరుగుతూ ఉండేది. ఇలా ఉండగా 27 రుద్రాక్షలున్న జపమాల నాకు సంప్రాప్తి అయినది. ఇది మెడలో వేసుకొని నా శివ ధ్యానము సాధన చేయడం ప్రారంభించినాను. 

 ఆజ్ఞా చక్రం శుద్ధి: 

ఇలా వివిధ రకాల వాయిద్య శబ్దాలు నెమ్మది నెమ్మదిగా ఒకేసారిగా వినబడసాగాయి. అయినా నేను నా ధ్యాన ప్రక్రియను ఆపేవాడిని కాను. ఏమి జరుగుతుంది. బీపీ పెరుగుతుంది. గుండెదడ మొదలవుతుంది. చెవులనుండి రక్తం కారుతోంది. ఏమి జరిగితే అది జరగని అని తెగించి తీవ్రంగా ఈ వాయిద్య శబ్దాలు వినటం ఆరంభించాను. ఇలా మరి కొన్ని వారాలు గడిచి పోయినాయి.అలాగే శ్రీ దత్త స్వామి, శ్రీ చక్ర పూజలు కూడా ఆగలేదు. ఇలా నేను ఒక రోజు తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉండగా వివిధ రకాల ఈ శబ్ద నాదాలు కలసి మిళితమై ఓంకార నాదం లాగా వినపడసాగింది.చాలా చాలా శ్రద్ధగా జాగ్రత్తగా మనస్సు చెవులు పెట్టి వింటే గాని ఈ ఓంకార నాదం వినబడేది కాదు. ఎందుకంటే ఈ ఆజ్ఞా చక్రశుద్ధి సమయములో మనకి ఓంకార నాదం వినబడుతుంది అని యోగశాస్త్రం చెబుతోంది. దానితో ఆనందం వేస్తూ ఉండేది. కానీ ఈ ఓంకార నాదం అంత స్పష్టంగా వినబడేది కాదు. చాలా కష్టపడవలసి వచ్చేది. రోజు మొత్తం మీద 16 గంటలు పాటు ఈ చక్రం ధ్యానం చేస్తే కేవలం ఎనిమిది నిమిషముల మించి ఓంకార నాదం వినబడేది కాదు. అయినా నిరుత్సాహ పడటం జరుగుతోంది. కానీ ఈ ధ్యాన ప్రక్రియలో ఈ ఓంకార నాదం వినటానికి మనస్సుకు ఏకాగ్రత అలవాటు చేయసాగినాను. ఇలా కొన్ని నెలలు గడిచినాయి. రానురాను ఓంకారనాదం స్పష్టంగా వినబడ సాగినది. నా ప్రమేయం లేకుండా చెవుల యందు ఈ ఓంకార నాదం వినబడుతూ ఉంటే అప్పుడప్పుడు కొండ నాలుక చివరినుండి ద్రవము కారుతుండేది. అదే "అమృతం" అని మీకు తెలుసు కదా! ఈ ద్రవమును సేవిస్తూ వచ్చే ఓంకారనాదం వింటుంటే మనస్సు అలాగే శరీరము కూడా ఏదో తెలియని చెప్పటానికి అలవి కాని తన్మయత్వ స్థితిలోనికి  నా ప్రమేయం లేకుండా వెళ్ళిపోయేది. ఇట్టి స్థితి పొందటానికి ప్రతిరోజు తపించడమే నాకు అలవాటైంది. ధ్యానము - ధ్యాస - ఏకాగ్రత పెరగసాగింది. మనస్సు కాస్త స్థిర మనస్సుగా  పెరుగుతూ ఆలోచనలు పరిసమాప్తి అవుతూ ఆలోచనా రహిత స్థితికి వెళుతుంది అని నాకు అర్థం అయింది. ఇది ఇలాయుండగా నాకు శ్రీశైలము నుండి శివశక్తి బాణలింగాలు వచ్చినాయి.ఇవి వచ్చిన మరుసటిరోజు నేను అలాగే మా ఆవిడ కలిసి అనుకోకుండా స్వామివారి సుప్రభాత సేవకి వెళ్ళడము...సుమారుగా నాలుగు గంటలు పాటు స్వామివారి సేవలో గడపడము జరిగినది. ఆ రోజే, నిజ బాలదర్శనం అవ్వడము జరిగినది. ఆ ఆనందానికి అవధులు లేవు. దీనికి కారణము మాకు వచ్చిన శివశక్తి బాణలింగాలే అన్నమాట. వీటిని యధావిధిగా పూజలో పెట్టి ఆరాధించడము ప్రారంభించాను. కొన్నివారాలకి నాకు అంతర్వేది క్షేత్రము నుండి ఓంకార గణపతి శంఖము వచ్చినది.అలాగే కాణిపాక క్షేత్రము నుండి లోహ ఓంకార లాకెట్ వచ్చినాయి.

ఇలా కొన్నిరోజుల తర్వాత నాకు ఇంతలో తీవ్ర ధ్యాన స్థితిలో ఉండగా రెండు దళాలు ఉన్న, ఓం బీజాక్షరం వున్న పద్మము నా భ్రూమధ్యము బొట్టు పెట్టుకునే ప్రాంతములో కనపడసాగింది. అక్కడ నుండి ఈ ఓంకార నాదం చాలా స్పష్టంగా వినపడసాగింది.ధ్యానంలో కూర్చున్న 48 నిమిషములకే ఈ శబ్దం వినబడుతుంది అని నేను గ్రహించాను.

ఇలా మరి కొన్ని వారాలు గడుస్తుండగా ఒకరోజు నేను తీవ్ర ధ్యానంలో ఉండగా నా భ్రూమధ్య స్థానములో ఒక తెల్లని దివ్య జ్యోతి కనపడ సాగింది. నీలి వర్ణంలో బంగారపు వర్ణ కాంతి వెలుగులతో తెల్లని కాంతి ఈ దివ్య జ్యోతి దర్శనం కాసాగింది. ఇది ఎలా నా భ్రుకుటి స్థానంలో కనబడుతుందో నాకు అర్థమయ్యేది కాదు. ధ్యానములో 4 గంటలు దాటిన తరువాత ఈ దివ్య జ్యోతి దర్శనమిచ్చేది. మొదట చాలా లీలగానే కనపడేది. రాను రాను స్పష్టముగా నాకు కనపడ సాగింది. మొదట చిన్న బిందువు లాగా కనపడేది కాస్త ఒక కోడిగుడ్డు పరిమాణ ఆకారం దాకా కనపడసాగింది. నాకు ఏమి జరుగుతుందో నాకే అర్థంకాని స్థితి. కానీ యోగశాస్త్రం ప్రకారం చూస్తే ఎవరికైతే తమ ఆజ్ఞా చక్ర శుద్ధి ప్రక్రియ పరిసమాప్తి అవుతుందో వారికి ఈ దివ్య జ్యోతి దర్శనం కలుగుతుందని చెబుతున్నాయి. దీనినే జ్యోతి బిందువుగా లేదా ఆత్మ జ్యోతి ఇలా పలు పేర్లతో పిలవడం వివిధ గ్రంథాల ద్వారా తెలిసినది. కానీ విచిత్రంగా ఈ దివ్య జ్యోతి మూడున్నర అంగుళాల పరిమాణంలో నీలి వర్ణంలో నల్ల నీడ లాంటి మనిషి ఆకారం ఒకటి తరచుగా కనబడుతోంది. అటు ఇటు కదులుతున్నాడు. ఆయన ఎవరో, ఆ ఆకారం ఎవరిదో నాకైతే అర్థం కాలేదు. కానీ ఓంకార నాద శబ్దం ఆగలేదు. ఈ విచిత్ర వ్యక్తి దర్శనం అయ్యేసరికి నాకు ధ్యాన భంగము అయిపోయేది. కళ్ళు తెరిచిన వెంటనే ఈ కనిపించీ కనిపించని ఆ నీలి నల్ల ఆకార వ్యక్తి ఎవరో అర్థం కాక ధ్యానము ముందుకు సాగేది కాదు. 

ఇతను ఎవరో అర్థం అయ్యే లోపల నాకు తీవ్ర ధ్యాన స్థితిలో ఉండగా నాకు తెలియకుండానే నా నోటి నుండి వివిధ రకాల జంతువుల అరుపులు రావటం మొదలైంది. అంటే కుక్క అరుపు,పిల్లి అరుపు, పులి గాండ్రింపు, సింహ గర్జన, ఎద్దు గాండ్రింపు, దున్నపోతు అరుపు, నెమలి అరుపు, గ్రద్ద అరుపు, చిలుక అరుపు, పావురము అరుపు, కోతి కిచకిచలు ఇలా సుమారుగా 84 జంతువుల అరుపులు వచ్చినట్లుగా నా దృష్టికి వచ్చింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క జంతువు అరుపుతో నాకు తెలియకుండానే నేను ధ్యానములో అరుస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేయటం అలవాటు అయినది. ఈ జంతువుల అరుపులు ఎందుకు వస్తున్నాయో ఆ కనిపించే వ్యక్తి ఎవరో నాకు అర్థమయ్యేది కాదు. ఎవరు చెబుతారో తెలిసేది కాదు. ఏమిచేయాలో అర్థంకాని అయోమయ స్థితి. నా నోటి నుండి వచ్చే జంతువుల అరుపులు వలన నాకు ధ్యాన భంగము అవ్వటం పరిపాటి అయినది. ధ్యాన సమయము ముందుకు సాగటం లేదు. ధ్యానంలో కూర్చుని 15 నిమిషములకు ఏదో ఒక జంతువు అరుపు తీవ్రస్థాయిలో నా నుండి రావడం అంతటితో ఆ రోజుకి నా ధ్యానం సమాప్తి  చేసుకునే పరిస్థితికి వచ్చేసరికి నాకు ఏడుపు ఆగేది కాదు. ఇలా ఈ జంతువుల అరుపులు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థమయ్యేది కాదు. ఈ జంతువుల వలన ఇంటి చుట్టుపక్కల వారికి జూ నుండి ఆ జంతువులు బయటికి వచ్చినాయి అని భయపడే స్థితికి నా ధ్యాన జంతువుల అరుపులు ఉన్నాయి అంటే నా పరిస్థితి మీరే అర్థం చేసుకోండి. ఈ జంతువుల అరుపులు మిమిక్రీ చేసే వారికన్నా చాలా స్పష్టంగా నా నోటి నుండి విచిత్రంగా వచ్చేవి. అలాగని ధ్యానము అయిన తరువాత నేను ఏదైనా జంతువు అరుపుతో అఱచిన  ఆ జంతువు శబ్దము వచ్చేది కాదు. కానీ విచిత్రంగా ధ్యాన స్థితిలో మాత్రమే ఆ జంతువుల శబ్దాలు చాలా స్పష్టంగా వచ్చేవి. ఆ కనిపించే నల్లని వ్యక్తి ఎవరో అర్థం అయ్యేది కాదు. ఆనాటి నుండే ఈ జంతువుల అరుపులు మొదలైనాయి. ఇలాంటి విచిత్ర స్థితిలో మరి కొన్ని నెలలు గడిచి పోయినాయి.     

No comments:

Post a Comment