"ఆత్రేయగీత"
మూడవ భాగం
“జ్ఞాన మంజరి” - 6వ భాగము.
శ్రీ శాస్త్రి ఆత్రేయ (ఆకుండి శ్రీనివాస శాస్త్రి).
ఈ ధరణిలో పరమాత్ముని ప్రతిరూపంగా జీవాత్మగా జన్మించిన ప్రతిజీవి తమ మనుగడకోసం, తమ పరిధిలో కొన్ని కర్మలు చేయక తప్పదు. అందుకు తగిన శక్తిని, జ్ఞానాన్ని ప్రతి జీవానికి ఆ పరమాత్మ ప్రసాదించేడు.
జీవులన్నింటిలో అత్యంత జ్ఞానసంపన్నుడిగా, తన సంపూర్ణ ప్రతిరూపంగా, పూర్తి మేధస్సుతో మానవుడ్ని సృష్టించేడు పరమాత్మ. తనలాగే మానవుడు కూడా ఈ సృష్టిని, అందున్న ప్రతి జడజీవాన్ని జాగ్రత్తగా కాపాడుతూ, ఈ సృష్టి నిర్వాహణలో తనకు ఎంతో చేదోడువాదోడుగా వుంటాడని భావించేడు పరమాత్మ.
మానవుడు కూడా తన అపరిమిత జ్ఞానంతో కొన్ని ప్రత్యేక శక్తులను తన స్వంతం చేసుకొని, సృష్టిలో వున్న అన్ని జడజీవాలపై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ, అపర పరమాత్మగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. మిగతా జీవాలతో పోలిస్తే ఆత్మజ్ఞానం పొందుట మానవులకు మాత్రమే సాధ్యము.
అయితే మానవులు మాయకులోబడి తమ అసలు స్వరూపాన్ని గ్రహించలేకపోతున్నారు. మానవులలో వున్న ఇంద్రియాలు, మనస్సు ఈ మాయకు దోహదపడుతున్నాయి. వీటికి లోబడి మానవులు వివిధ నైజాలతో జీవిస్తున్నాడు.
ఆత్మజ్ఞాన విషయానికొస్తే మానవుల నైజము మూడురకాలుగా ఉంటుంది. కొందరు భక్తిరసభావంతో, కొందరు క్రియాశీలంతో, కొందరు విచారణాత్మకముతో
నుంటారు. ఈ మూడింటినే భక్తిమార్గమని, కర్మమార్గమని, జ్ఞానమార్గమని అనుకోవచ్చు. వీటి మోతాదు ఒక్కొక్కరిలో ఒక్కోలాగా ఉంటుంది. ఈ మూడు ఒకదానితో ఇంకొకటి పెనవేసుకొని వుంటాయి. ఆత్మజ్ఞానము పొందుటకు ఈ మూడు అవసరమే. ఈ మూడింటి విశిష్ఠతను అర్ధము చేసుకొని తదనుగుణంగా సాధనచేయువాడు ఆత్మజ్ఞానమును పొందగలడు.
సులువుగా చెప్పాలంటే మనుజులు ఆత్మజ్ఞానం పొందుటకు మధ్వాచార్యులంత భక్తి భావం, రామానుజాచార్యులంత నిష్కామకర్మభావం, శంకరాచార్యులంత జ్ఞానభావం కలిగుండాలి.
గీతలో శ్రీకృష్ణపరమాత్మ, ఓ పార్థా! ఎవరు నాకు ఇష్టమైన కర్మలు నిష్కామముతో చేయుదురో (కర్మయోగము), నిత్యము నన్నే ధ్యానించుదురో (ధ్యానయోగము), నాయందు అనన్యమైన భక్తి కలిగియుండెదరో (భక్తియోగము), దృశ్య వస్తువులందు బంధము పెంచుకొనక జ్ఞానవంతులై వుండెదరో (జ్ఞానయోగము) అట్టివారు నన్ను పొందెదరు. అంతేకాదు, ఎవరైతే మూర్ఖత్వముతో కర్మేంద్రియాలను బంధించి, ఇంద్రియ విషయాలను మనస్సుతో ఆలోచిస్తారో వారు మిధ్యాచారులు. వారు స్వయంగా నష్టపోవడమే గాక, ఇతరులకు ఏ మాత్రమూ వుపయోగపడరు. వారు నన్ను పొందడము సాధ్యం కాదు. ఇది యదార్ధమని వివిధ సందర్భాల్లో తెలియజేశాడు.
ఇచ్చట కర్మ చేయడంగాని, చేయకపోవడంగాని ముఖ్యంకాదు. మనస్సునందు మాలిన్యము అంతరించడమే ప్రధానము. వాటిని మనసా, వాచా, కర్మణా తొలగించకుండా ఒంటరిగా జనసంద్రమునకు దూరంగా పోయి తపమాచరించుట వలన ఉపయోగముండదు. అలాగే ఈ వాసనల నుండీ ముక్తుడైనవాడు జనసంద్రమున నున్నప్పటికీ కూడా మోక్షమును పొందగలడు.
ఇదంత సులభం కాదు. మొదటి మెట్టుగా మానవులు దుష్కర్మనుండి (చెడ్డ పనులు) సత్కర్మకు (మంచి పనులు) మారాలి, అందుకోసం భగవతార్పణ బుద్ధితో కర్మలనాచరించాలని బోధించింది. ఎందుకంటే ఏదైనా భగవంతునికి అర్పించేటప్పుడు జాగ్రత్తగా ఉంటాము కాబట్టి. ఇలా చేయడంవలన మానవులు చేయు దుష్కర్మలు కొన్నాళ్ళకు సత్కర్మలుగా మారతాయి. సత్కర్మల వలన శాంతి కలుగుతుంది
పిమ్మట సత్కర్మనుండి నిష్కామకర్మకు (ఎటువంటి ఫలితం ఆశించకుండా చేసే సుకర్మలు) మారే ప్రయత్నము చేయాలి. దీనివలన చిత్తశుద్ధి కలిగి త్వరలోనే జ్ఞానం ఉదయిస్తుంది. జ్ఞానంతో మోక్షము లభిస్తుంది.
No comments:
Post a Comment