🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹:
నా ఆజ్ఞా చక్ర అనుభవాలు - 6 &7
మూలం : కపాల మోక్షం అనే మోక్ష సాధనా గ్రంథం
అనుభవం - అనుభూతి : శ్రీ పవనానంద సరస్వతి
శీర్షిక : నా సద్గురువు త్రైలింగ స్వామి దర్శనం
...ప్రస్తుత నా
దీన స్థితి నుండి బయటపడవేసే సద్గురువుని చూపించమని శ్రీ దత్త స్వామిని వేడుకోవటం తప్ప ఏమి చేయలేకపోయాను. ఇలా కొన్ని రోజులు గడిచాయి. యధావిధిగా జంతువుల అరుపులు రావటం అలాగే నల్లని నీడ వ్యక్తి ఆకారము దర్శనం ఇవ్వటం జరిగిపోయాయి. ఇంతలో ఒక లావుపాటి వ్యక్తి యొక్క పాదాలు మాత్రమే దర్శనం ఇవ్వడం మొదలైనది.అది కూడా సజీవ పాదాలు అన్న మాట. ఈ పాదాలు ఎవరివో ఎందుకు కనబడుతున్నాయో మొదట నాకు అర్థం కాలేదు. విచారణ చేసి చూసుకోగా ఒకవేళ ఈ పాదాలు సద్గురువువి అయి ఉండాలి అనిపించింది. కాని ఇవి ఎవరి పాదాలు, ఎవరా సద్గురువు... నాకేమీ అర్థం కాలేదు. కానీ విచిత్రం... ఈ పాదాల సద్గురువు గూర్చి స్వాతి వీక్లీ పత్రికలు అలాగే ఈయన చరిత్ర పుస్తకాలు నాకు చేరినాయి. కానీ వాటిని నేను పట్టించుకోలేదు. ఒకరకంగా వీటిని చూడలేదు. చదవలేదు. ఒకసారి అనుకోకుండా నేను మొదటిసారిగా కాశీ యాత్రకు వెళ్లటం జరిగింది. మూడు రోజుల తర్వాత నాకు మానస ఘాట్ వద్ద తిరిగి ఈ సజీవ పాదాలు నాకు ధ్యానమునందు కనిపించినాయి. అంటే ఈ పాదాలకి ఈ క్షేత్రానికి ఏమైనా సంబంధం ఉన్నదా? ఈయన ఇక్కడ నివసిస్తున్న యోగినా లేక గురువా? ఈయన సజీవంగా ఉన్నాడా? ఆయన సజీవ సమాధి చెందిన గురువా? నాకేమీ అర్థం కాలేదు.మరో రెండు రోజుల తర్వాత ఈ పాదాలు కాస్త మోకాళ్ళ వరకు కనిపించటం ప్రారంభమైనది. ఈ మోకాళ్ళ వ్యక్తి చాలా లావుపాటి శరీరం ఉన్న వ్యక్తి లాగా నాకు అనిపించసాగింది. మరి ఈ మోకాళ్ళ పాదాల వ్యక్తి ఎవరో నాకు ఏమీ అర్థం కాలేదు. ఇలా సగం సగం ఎందుకు కనబడుతున్నాడో అర్థమయ్యేది కాదు. విచారణ చేసుకోగా నా ఆజ్ఞా చక్రశుద్ధి పరిసమాప్తి అయితే గాని ఆయనను సంపూర్తిగా చూసే సాధన స్థితికి నేను రాలేను... అని నాకు అర్థం అయింది. ఈ మోకాళ్లను పట్టుకొని నా ధ్యాన స్థితి అదే... జంతువుల అరుపులు నల్లని ఆకార వ్యక్తి నీడ గూర్చి చెప్పటం అంతా మనస్సులోనే జరుగుతోంది.... ఈ మోకాళ్లు పాదాలు వ్యక్తి ఎవరో తెలియదు. అలాగే కోడిగుడ్డు జ్యోతిలో కనిపించే వ్యక్తి ఎవరో తెలియదు. కనిపించీ కనిపించకుండా వీరిద్దరు నాతో ఎందుకు ఆటలు ఆడుతున్నారో తెలియదు. మరుసటి రోజు ఈ మోకాళ్లు పాదాలు కాస్త ఏవో ఘాట్లోని ఇరుకైన సందుల్లో ఉన్న ఎత్తైన ప్రదేశానికి వెళ్ళటానికి వీలు ఉన్న మెట్ల మీద ఎక్కుతూ కనపడసాగింది. పోనీ ఆ ఘాట్ వివరాలు కూడా తెలియవు. కానీ ఖచ్చితంగా ఈ పాదాల వ్యక్తి కాశీ క్షేత్రవాసి అని నమ్మకమైన సూచన వచ్చినది అని గ్రహించాను. మరుసటి రోజు నిన్నటి రోజు లాంటి దృశ్యమే కనిపించసాగింది. దానితో ఇలా కాదనుకుని గంగ ఒడ్డున ఉన్న అస్సీ ఘాట్ నుండి మొదలుపెట్టి 64 ఘాట్లు అనగా చివరిదైన పంచ గంగ ఘాట్ దాకా చేరుకోగానే అక్కడ నాకు ధ్యానములో కనిపించిన మెట్ల సందు కనిపించేసరికి నాకు గుండెలో దడ మొదలైంది. ఇన్నాళ్లుగా అర్థంకాని పజిల్ గా ఉన్న పాదాల రహస్యం విడిపోతుందని అనిపించగానే నాలో ఏదో తెలియని ఆశ్చర్యం, ఆనందం, భయాలు నన్ను చుట్టుముడుతుండగా నేను కూడా ఈ మెట్ల పైకి ఎక్కుతూ పైకి చేరుకోగానే అక్కడ ఉన్న శ్రీ మఠ ద్వారము దర్శనమిచ్చింది. సరే కదా అని లోపలికి వెళ్లి విచారించగా అక్కడ ఒక పుస్తకంలో పాదాలు ఉన్న బొమ్మ చూడగానే అచ్చం ఈ పాదాలు నాకు ధ్యానంలో కనిపించిన పాదాలు అని నేను రూఢి చేసుకోగానే అక్కడ ఒక స్త్రీమూర్తి లోపలికి వచ్చి నన్ను పలకరించి ఎందుకు వచ్చానో తెలుసుకున్నది. అప్పుడు ఆమె వెంటనే ఆనంద పడుతూ “స్వామి! మీకు కనిపించినవి మా గురు మూర్తి పాదాలు అయిన శ్రీ త్రైలింగస్వామి వారివి. ఆయన ప్రతిరోజూ గంగ స్నానానికి నేను వచ్చిన ఘాట్లో క్రిందకి వెళ్లి స్నానాదికాలు పూర్తి చేసుకుంటారని” అంటూ ఆయన విగ్రహ మూర్తి ని అలాగే వారు వాడిన వస్తువులు చూపించ సాగినారు. ఇంతలో ఒక పని మనిషి అక్కడున్న క్రింద గదిలోనికి వెళ్ళటం నా ఓరకంట గమనించాను.అప్పుడు ఈమెను అడిగితే అది మా గురుమూర్తి నిత్యం ధ్యానం చేసుకునే గది క్రింద ఉంటుంది. అది ఎప్పుడూ మూసి ఉంటుంది. మా గురుమూర్తి సజీవ సమాధి చెందే ముందుగా కొన్ని మల్లెపువ్వులు గా మారిపోయినారు. ఈ పువ్వులను ఆయన గుర్తుగా ఆ గదిలోనే పెట్టి దానిపైన ఒక సమాధి లాంటిది కట్టినారు. ఆ గదిలోనికి వెళ్లడానికి ప్రస్తుత మఠాధిపతి అనుమతి కావాలని ఆయనకి మీరు నచ్చితేనే మిమ్మల్ని లోపలికి అనుమతిస్తారని ఆవిడ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఈలోపల మేము ఆయన పూజించిన అతిపెద్ద నల్ల శివలింగమును, అలాగే ప్రత్యక్షమయ్యే మంగళా దేవి విగ్రహం మూర్తిని దర్శించుకుని ఆయన విగ్రహమూర్తి ప్రక్కన ఉన్న ఖాళీ స్థలంలో కూర్చుని, ధ్యానము నేను చేసుకుంటూండగా కొద్దిసేపటికి ప్రస్తుత పీఠాధిపతి అయిన ఒక లావుపాటి వ్యక్తి పైజమా లాల్చీ వేసుకొని లోపలికి వచ్చి తన ఆసనం పరుపు మీద కూర్చొని ధ్యానము చేసుకోవటం నా ఓరకంటి నుండి తప్పుకోలేదు. నా ధ్యానము అలాగే మా శ్రీమతి దీక్షాదేవి ధ్యానాలు పూర్తి గావస్తుండగా ఆయన మమ్మల్ని రమ్మని పిలవడం జరిగింది.
మేము ఇద్దరమూ వెళ్ళాము. ఆయన హిందీలో మాట్లాడినాడు. నాకు హిందీ రాదు. మా శ్రీమతికి వచ్చిన హిందీలో ఆయనకు తను సమాధానాలు ఇస్తూ ఉంటే నేను మౌనం వహించాను. కొన్ని క్షణాలు పూర్తి అయిన తర్వాత ఆయన ఒక తాళం చెవి ఇస్తూ “మీరిద్దరూ కూడా శ్రీ స్వామివారు ఉన్న చిన్న గదిలోనికి వెళ్ళిరండి” అని అనుజ్ఞ ఇచ్చినారు. మేమిద్దరము సంతోషంతో ఆ క్రింద ఉన్న చిన్న గది వైపు అడుగులు వేశాము. ఆ చిన్న గది లోనికి ప్రవేశించాము. అక్కడ చిన్న రాతి పలకలతో నిర్మితమైన ఒక పెట్టె వంటి నిర్మాణం కనబడింది. అందులోనే శ్రీ స్వామివారు తను సమాధి చెందిన తర్వాత ప్రసాదించిన మల్లెపూలు ఉంచినారని నాకు అవగతమైనది.ఆ గదికి మూలలో గోడకు ఉన్న చిన్న రంధ్రం నుండి స్వామివారు తన దగ్గరికి వచ్చిన భక్తుల కోసం వస్తువులు తీసి ఇచ్చేవారని గమనించి ఆ రంధ్రంలో నేను చెయ్యి పెట్టి చూస్తే ఏమీ లేదు. ఖాళీగా ఉంది అనిపించింది. తర్వాత గదిలో కూర్చున్న క్షణములో నుండి నాలో తీవ్ర ధ్యానస్థితిలోకి నా మనస్సు వెళ్ళిపోయింది. తీవ్రమైన ఏకాగ్రతతో కూడిన స్థిర మనస్సు గా మారినది. ఇంతలో నా నోటి నుండి యధావిధిగా నెమ్మదిగా తక్కువ స్థాయి శబ్దంతో జంతువుల అరుపులు ఒక్కొక్కటిగా రావటం మొదలైంది అని నాకు అవగతమైనది. ఈ జంతువుల అరుపులు వింటే నన్ను ఖచ్చితంగా బయటికి పంపుతారని తెలియని భయము మొదలైనది. ఏమి జరిగితే అది జరుగుతుంది అంతా నా సద్గురు శ్రీ త్రైలింగస్వామి వారు మీద భారం వేసి మౌనంగా ఈ వచ్చే శబ్దాలు గమనిస్తూ ఉన్నాను. ఇంతలో నా భ్రూమధ్యం ప్రాంతములో కోడిగుడ్డు జ్యోతి లో యధావిధిగా నీలి వర్ణ నల్ల వ్యక్తి ఆకారం అగుపించటం ఆరంభమైనది....
...ఎవరో అశరీరవాణితో “పవన్ బాబా! కంగారు పడకు. ఆ వ్యక్తి ఎవరో కాదు. మీ ఆది జన్మ సూక్ష్మ శరీర మైన ఆత్మ స్వరూపం. ఈ జంతువుల అరుపులు కూడా నీ గత జన్మల అవతారాలే. ప్రస్తుత చక్ర స్థితి వలన మీ సాధన శక్తి వలన గత జన్మల, రాబోవు జన్మల పరంపరలు నువ్వు తగ్గించుకుంటున్నావు. గత జన్మ కర్మ వాసనలు ఈ జంతువుల అరుపులతో సంపూర్తిగా నాశనమయ్యాయి. ప్రస్తుతము "నేను" ఎవరో తెలుసుకో. నీ ఆది జన్మ ఎవరిదో గ్రహించు.... అదియే నీ స్వస్వరూప జ్ఞానం అని గ్రహించు. అదియే ఆత్మ సాక్షాత్కార అనుభూతి అని గ్రహించు... నీవు ఎవరివో నీవే తెలుసుకోవాలి. నేను కానీ నేను ఎవరో నీవే తెలుసుకోవాలి. అప్పుడే మీ రుద్రగ్రంధి ప్రవేశం జరుగుతుంది. ముందుగా నువ్వు ఎవరో తెలుసుకో...నువ్వు, "పవనానంద సరస్వతి" అని ఎవరో నా చెవులలో చెప్పినట్లుగా అనిపించింది. కళ్ళు తెరవ లేకపోయినాను. విచిత్రముగా జంతువుల అరుపులు సంపూర్తిగా ఆగిపోయినాయి. కానీ నా మనోదృష్టి ముందు నీలి వర్ణ నల్ల ఆకార వ్యక్తి మరుగున పడలేదు. అలాగే నీడ లాంటి ఆకారం లో అటూ ఇటూ కదులుతూ అగుపిస్తున్న ఈ వ్యక్తి ఎవరో తెలియదు. నేను ఎవరో తెలియ రాలేదు. జంతువుల అరుపులు తగ్గించుకోవటానికి నేను కాశీ కి వచ్చానా? లేక నేను ఎవరో నేను కానీ నేను ఎవరో అర్థంగాక మతిభ్రమణము పొందటానికి వచ్చానా? జంతువుల అరుపులకి కారణాలు తెలిశాయి. బాగానే ఉంది. మరి ఈ ఇద్దరి వ్యక్తుల పరిస్థితి ఏమిటి?
నా పరిస్థితి ఏమిటి? అయోమయం. అర్థం కాని పరిస్థితి. అని తలచుకోగానే నాకే తెలియని ఏడుపు నాలో మొదలైంది. కళ్ళ వెంట ఏకధాటిగా కన్నీరు రావటం ఆరంభమైనది. ఇక చావే శరణ్యమని నాకు అర్ధమై ఇక చావాలని నిశ్చయించుకొని ఆ చిన్న పెట్టె వంటి నిర్మాణం మీద నా తలను బాదుకోవడం ప్రారంభించాను. ఏమి జరిగితే అది జరుగుతుందని మొండి ధైర్యంతో తెగింపు నాలో మొదలైనవి. చచ్చినా పర్వాలేదు. మా సద్గురువు సమాధి సమక్షంలో చావడం కన్నా ఇంకా ఏముంటుంది అని నాలో బలంగా అనిపించసాగింది. అసలు నాకు ఏమి జరుగుతుందో అర్థం కాక బిత్తర చూపులతో మా శ్రీమతి నన్ను ఓరకంటితో గమనిస్తూనే ఉంది అని నాకు అర్థమైనా... అర్థంకాని స్థితి.
No comments:
Post a Comment