Vedantha panchadasi:
స్వయమాత్మేతి పర్యాయై తేన లోకే తయోః సహ ౹
ప్రయోగో నాస్త్యతః స్వత్వమాత్మత్వం చాన్య వారకమ్ ౹౹43౹౹
43. "స్వయం" "ఆత్మ"అనునవి పర్యాయ పదములు.కనుకనే లోకమున ఈ రెండింటికి ఏకకాలమున ప్రయోగము లేదు.ఇవి రెండూ ఇతర భావములను వారించును.
ఘటః స్వయం న జానాతీత్యేవం స్వత్వం ఘటాదిషు ౹
అచేతనేషు దృష్టం చేత్ దృశ్యతామాత్మ సత్త్వతః ౹౹44౹౹
44. (ఆక్షేపము)"ఘటము స్వయముగ తెలియజాలదు" మొదలైన ప్రయోగములందు కుండ మొదలగు అచేతనములందు కూడ స్వత్వము కనబడుచున్నది గదా.
(సమాధానము)అట్లే ఆత్మసత్తాయే అచేతనములకు కూడా ఆశ్రయమగుట చేత వానియందు కూడా స్వత్వము కన్పించును.
చేతనాచేతనభిదా కూటస్థాత్మకృతా న హి౹
కింతు బుద్ధికృతాభాసకృతైవే త్యవగమ్యతామ్౹౹45౹౹
45. చేతనము అచేతనము అనే భేదము కూటస్థమగు ఆత్మ వలన కలుగుట లేదు.
ప్రతిఫలన సాధనమగు బుద్ధి,అంతఃకరణము,వలన ప్రతిఫలనమగు అభాసల వలన మాత్రమే అని తెలియును.
యథా చేతన ఆభాసః కూటస్థే భ్రాంతి కల్పితః ౹
అచేతనో ఘటాదిశ్చ తథా తత్ర్పైవ కల్పితః ౹౹46౹౹
46. కూటస్థము నందు భ్రాంతి ద్వారా చేతనమనే అభాస కల్పితమగుచున్నట్లే కుండ మొదలగు అచేతనములనే అభాసలు కూడా కూటస్థమునందు భ్రాంతిచే కల్పింపబడుచున్నవి. చేతనములు,అచేతనములు రెండింటికీ ఆశ్రయము కూటస్థ బ్రహ్మమే అని భావము.
వ్యాఖ్య: ఉన్నది సర్వవ్యాపియైన బ్రహ్మమే.
అవిద్యా ఉపాధియందలి శుద్ధ మలిన తారతమ్యముల వలన, కొన్ని ఉపాధులయందు బ్రహ్మము ప్రతిఫలించి చిదాభాసలు,
అనగా జీవులు చేతనములు, భాసించును.
కొన్ని ఉపాధుల యందు ప్రతిఫలింపక అచేతనములుగ భాసించును.
ఇంద్రియజ్ఞానము గల వానికి ఇంద్రియ జ్ఞానము లేనివానికి మధ్య,
జడ-చేతనములకు మధ్య భేదములేదు.
సమస్తపదార్థముల సారమునందు ఏ మాత్రము భేదము లేదు.దీనికి కారణము సర్వపదార్థములయందలి సత్తయొక్క సమానత్వమే.
ఏల అనగా,అనంతమయిన చైతన్యము అంతట ఒకే విధముగా ఉన్నది.
తనను విభిన్నపదార్థములుగా తాదాత్మ్యము చెందించుకొనుచున్న ప్రజ్ఞయే భేదములకు కారణము .
చేతనములు అచేతనములు అనేే భేదము కూటస్థమగు అత్మ వలన కలుగుట లేదు. ప్రతిఫలనసాధనమగు బుద్ధి, అంతఃకరణము,వలన ప్రతిఫలనమగు అభాసల వలన మాత్రమే అని తెలియును.
అనంతమయిన ఒకే చైతన్యము విభిన్నపదార్థములలో విభిన్న నామములతో పిలవబడును.అదే విధముగా క్రిములుగా,చీమలుగా,పక్షులుగా తాదాత్మ్యము చెందుచున్న ప్రజ్ఞయే ఒకే విధమయిన అనంత చైతన్యమే.
ఉత్తరధ్రువము నందు నివసించు జనులు దక్షణధ్రువమునందలి జనులను ఎరుగనట్లే(కావున వారితో తమ తారతమ్యము చూడనట్లే)ఆ చైతన్యమునందు పోలికగనీ,భేదబుద్ధిగానీ లేదు.
ప్రతిస్వతంత్రపదార్థము ఈ ప్రజ్ఞచే అట్టిదిగా,(ఆ పదార్థముగా) తాదాత్మ్యము జెంది ఇతరపదార్థముల నుండి వ్యత్యాసము లేకుండ తానుగా ఉండును.
వానికి"ఇంద్రియజ్ఞానముగలవి",
"ఇంద్రియజ్ఞానము లేనివి"అను భేదములను ఆరోపించుట,రాతిలో పుట్టిన కప్ప,దానికి వెలుపల పుట్టిన కప్ప-ఒకటి జడమనియు, రెండవది చేతనమనియు-తమ్ము విభిన్నముగా భావించుట వంటిదే.
సముద్రమునందు తరంగములు అభివ్యక్తమురయినట్లుగానే
చేతనములు,అచేతనములకు అశ్రయము కూటస్థ బ్రహ్మమే.
No comments:
Post a Comment