Tuesday, November 5, 2024

 🍁ఆప్తవాక్యాలు  🍁

7. సుగా ఋతస్య పంథాః

సత్యమార్గం సుఖమయమైనది - సరళమైనది (ఋగ్వేదం)

సత్యంలో ఉన్న సుఖం అసత్యంలో లేదు. స్థూలదృష్టితో చూస్తే అసత్యమే సుఖంగా
కనిపించవచ్చు. “ఈ రోజుల్లో 'సత్యం' అంటూ కూర్చుంటే లాభం లేదు. అసత్యం
వల్లనైనా సరే సుఖపడాలి” అని కపట జీవితాన్ని సమర్థించే లౌకికులు ఉండవచ్చు.
కానీ అసత్యం వల్ల చాలా చిక్కులున్నాయి. 'అసత్యం' అంటే నిజాయితీ లేకపోవడం,
అవినీతి, (మోసం) కపటం, అధర్మం... అని అనేకార్థాలున్నాయి. వీటితో కూడిన
జీవితానికి అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉంటాయి. సత్యాన్ని (ధార్మిక నైతిక
జీవనం) నమ్ముకోవడానిని ఛాదస్తం కింద కొట్టి పారేయడం మంచిది కాదు.

సాధారణంగా ఎవరూ చూడరు కదా అనో, గమనించేవారు లేరనో, ఎప్పటికీ
గమనించే అవకాశం లేదనో, అతి త్వరగా ఎంతో సంపాదించేయాలనో
సత్యమార్గాన్ని వదులుతారు. పాపభీతి, దైవభీతి కూడా లేక, 'సత్యప్రియుడైన’
భగవంతుని ఉనికిని కూడా విస్మరించి మోహంతో అడ్డదారుల్ని తొక్కుతారు. అయితే ఆ దారిలో వెళ్ళేటప్పుడు మనస్సులో పొంచి ఉండే భయాల్ని గమనించడం చాలా ముఖ్యం.

ఎప్పుడు ఏ నిఘా ఉంటుందో, ఎవరికి దొరికిపోతామో అనే భయం సహజంగానే
ఉంటుంది.

కాలం అన్ని వేళలా అసత్యానికి అనుకూలంగా ఉండదు. దాని స్వభావం సత్యంతో సహజసాంగత్యమే. తాత్కాలికంగా అసత్యాన్ని సత్యంలా భ్రమింపజేయవచ్చు. కానీ అది కొనసాగదు. ఇది ప్రకృతి నియమం. శాశ్వత నియమం. సృష్టి చక్ర నిర్వహణకు అవసరమైనది ఆ శాశ్వతసత్యమే. దానినే వేదం “ఋతం” అంది. దీనికి మార్పు ఉండదు. దీని లక్షణం 'ఆనందం'.

కాబట్టి సత్యమార్గసంచారి తాత్కాలికంగా దుఃఖితునిలా కనిపించవచ్చు.
అసత్యవాదిలా తొందరగా లౌకిక అభివృద్ధులు సాధించలేకపోవచ్చు. కానీ అతడు శాశ్వతమైన సత్యంతో బంధం ఏర్పరుచుకున్నాడు కనుక, నిజమైన ఆనందానికి దూరం కాడు. అతడికి భయం ఉండదు. ధైర్యానికి లోటుండదు. అతడి చూపులో బెదురుండదు.నిర్భయంగా, సుఖంగా జీవితం సాగుతుంది. ఆ సరళమైన జీవనపథం - సత్యమార్గ గమనమే. రామచంద్ర, ధర్మరాజాదులు అచంచలంగా, అకుంఠితంగా అన్నీ ఓర్చుకొని
సత్యమార్గాన్ని అనుసరించి జీవితం సాగించడం చేతనే ఆదర్శ మూర్తులయ్యారు.
వేదధర్మానికి సాకారమయ్యారు. దుర్యోధన, రావణాదుల పతనాలు మనకు
హెచ్చరికలుగా కనబడుతున్నాయి.

అసత్యమార్గంలో సాధించిన సంపదలో అభద్రత, భీతి వెన్నంటే ఉంటాయి. ఆ
జీవితంలో అణువణువునా 'ఆత్మన్యూనతా భావం' నీడలా వెన్నాడుతూనే ఉంటుంది.
అసత్యమార్గానికి బయటి నుండి శత్రువులక్కర్లేదు, అతడి అంతరాత్మే ప్రథమ
శత్రువవుతోంది. ప్రతిదశలో పొడుస్తూనే ఉంటుంది. అటువంటి జీవితాలు ఎన్నో
మనకు ప్రత్యక్ష ప్రమాణాలుగా కనిపిస్తూనే ఉంటాయి.

ఎంత ఉన్నత పదవుల్లో ఉంటే, అంత ఉన్నతంగా అసత్యాన్ని ఆశ్రయించి, సత్యంగా భ్రమింపజేస్తూ ఎదగవచ్చు. కానీ ఆ అభ్యున్నతి ఏనాటికైనా సర్వనాశన మవుతుందని ఇప్పటికీ ఎందరో పెద్దల జీవితగాథలు మనకు తారస పడుతుంటాయి.

సృష్ట్యాదియందే ఈ విశ్వచక్రం సజావుగా నడిచేందుకు కావలసిన ధార్మికసత్యాలు
ప్రవచించిన వేదం సృష్టిలో ప్రతిప్రాణికి ముఖ్యమైన ఆప్తవాక్యాలను ఇలా
ప్రబోధించింది.

ఎన్ని కాలాలు మారినా వేదమాతబోధ సార్వకాలీనం, సార్వజనీనం కావడంలో
రహస్యమిదే.      

No comments:

Post a Comment