Sunday, November 10, 2024

****🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹: నా ఆజ్ఞా చక్ర అనుభవాలు - 9 ( సూక్ష్మ శరీర అనుభవాలు ) అనుభవం : శ్రీ పవనానంద సరస్వతి మూలం : కపాల మోక్షం అనే మోక్ష సాధనా గ్రంథం

 🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹:
నా  ఆజ్ఞా చక్ర అనుభవాలు - 9

( సూక్ష్మ శరీర అనుభవాలు )


అనుభవం : శ్రీ పవనానంద సరస్వతి


మూలం : కపాల మోక్షం అనే మోక్ష సాధనా గ్రంథం


...ఇన్నాళ్ళు నేను కూడా నా సాధన కూడా సహస్రార చక్రము దాకా వెళితే సరిపోతుంది. అదే చిట్టచివరి స్థితి అని అనుకున్నాను. కానీ అది నిజం కాదని సహస్రార చక్రము కాకుండా మిగతా చక్రాల వరకు కూడా  వెళ్లాల్సి ఉంటుందని నాకు అర్థమైనది. సాధన చేస్తే సాధ్యం కానిది ఏమీ లేదని ఆ మోక్షపతి అయిన సర్వేశ్వరుడి అనుగ్రహమును తప్పకుండా పొందాలని నిశ్చయించుకొని ఇలాంటి గురుబోధ చేసినందుకు మా సద్గురువైన భగవాన్ రమణ మహర్షి  గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నా యోగసాధనను కొనసాగించాను. ఇది ఇలా ఉండగా నా ప్రమేయం లేకుండా జరిగే ఆసనాలు, ముద్రలు,అరుపులు పూర్తిగా ఆగిపోయినాయి. కొన్ని గంటల పాటు లేవకుండా స్థిర ఆసనంలో ధ్యానం చేసుకునే స్థితికి చేరుకున్నాను. కాళ్ల నొప్పులు కూడా రావడం లేదు. తలనొప్పి కూడా రావడం లేదు. కానీ ఏదో తెలియని అద్వితీయమైన ఆనంద స్థితి మాత్రం కలుగుతుండేది. ఇప్పుడు ఎలా కూర్చుంటే, అలా స్థిర ఆసనంలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే నాలో ఏకాగ్రత తీవ్రంగా పెరగసాగింది. ఆలోచనలు క్రమేపీ తగ్గుతూ వస్తున్నాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు తగ్గుతూ వస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే నా శ్వాస ఊపిరితిత్తులలోకి వెళ్లకుండా భృకుటి ప్రాంతంలో ఆగిపోవటం నేను గమనించే సరికి నాకే ఆశ్చర్యమేసింది. శ్వాస తీసుకోకుండా నేను ఎలా బ్రతుకుతున్నాను. నాకు ఏమీ అర్థం కాలేదు. ఎందుకు బ్రతకడము? బ్రతుకుతున్నాను కదా! ఈ విశ్వములో ఊపిరితిత్తుల ద్వారా కాకుండా గుండె ద్వారా శ్వాసక్రియను జరిపే పాములు బ్రతికే ఉన్నాయి కదా! ఖచ్చితంగా నేను కూడా బ్రతుకుతాను. శ్వాస తీసుకోవటానికి ఏ భాగం అయిన ఒకటే కదా. "ఒక యోగి చరిత్ర" పుస్తకములో సూక్ష్మ లోకవాసులు వివిధ అంగాలు ద్వారా అనగా చెవితో గాని ముక్కుతో గాని చర్మంతో గాని చూపులతో చూడటము జరుగుతుందని అలాగే కంటితో లేదా నాలుకతో కానీ లేదా చర్మముతో చూడగలరని వినగలరని చెప్పకనే చెప్పినారు కదా ! మరి నాకెందుకు కంగారు ? నా శ్వాస ఊపిరితిత్తులలోకి వెళ్లకపోతే నా భృకుటి లోనికి వెళుతుంది కదా ! అని నాకు నేను సమాధాన పడ్డాను. నేను తెల్లవారుజామున మూడు గంటలకే లేచి ధ్యానానికి కూర్చుంటే నా ఆజ్ఞాచక్రంలో కనుబొమ్మల మధ్యలో ప్రస్ఫుటంగా మెరుస్తూ జ్యోతి బిందువు కనపడసాగింది. అలాగే నా రెండు చెవులలో అంతే స్పష్టంగా ఓంకార నాదం కూడా వినబడసాగినది. దానితో నాకు నిద్ర మెలకువ కాని మగత వంటి ప్రారంభ సమాధిస్థితిని అనుభవించసాగాను. 

   అప్పుడు మూలాధార చక్రం నుంచి కుండలిని శక్తి ప్రవాహం మొదలై అది శరీరమంతా ప్రవహించి విద్యుత్ కాంతితో ఆజ్ఞాచక్రము వరకు రాసాగింది. ఏదో చీమలు పాకుతున్నట్లుగా దీని ప్రవాహ వేగముంది. క్రమేపీ నా మనస్సులో ఆలోచనలు తగ్గుతూ వస్తున్నాయి.ఇలా కొన్ని వారాలు జరిగినది. రాను రాను నాకు ధ్యానమందు తీవ్రమైన కాంక్షతో పాటుగా మనశ్శాంతి పొందటం జరుగుతుంది. ఇది ఇలా ఉండగా ఒకరోజు నాకు ప్రతి రోజూ కనిపించే చిన్న దివ్య జ్యోతి బిందువు కాస్త ఒక కోడిగుడ్డు ఆకారపు పరిమాణందాకా నెమ్మది నెమ్మదిగా పెరగసాగింది.అప్పుడు దీని నుండి జ్యోతి కిరణాలు వెలువడి నా శరీరం నుండి బయటకు ప్రసరిస్తున్నట్లుగా అనుభూతి కలగ సాగింది. కానీ నా "శివ పంచాక్షరి మంత్ర మననము" అన్నివేళలా జరుగుతూ ఉండటం నేను గమనించాను. కానీ మనస్సు ఓంకార నాదం మీద జ్యోతి బిందువు మీద మంత్రం మీద తప్ప మరే ఆలోచనలకి వెళ్లడం లేదు. అనగా ఈ ప్రక్రియలు కలిసి ధ్యానము, ధ్యేయ వస్తువు, ధ్యేత అన్నట్లుగా త్రిపుటిగా సాగింది. ఇంతలో ఈ కోడిగుడ్డు ఆకారంలో నీలి వర్ణముతో నల్లని ఆకారము కనపడసాగింది. అది ఒక శరీర ఆకారముగా కనపడసాగింది. అది ఎవరో ఎందుకు కనబడుతుందో నాకేమీ అర్ధం కాలేదు. ఇలా మరి కొన్ని రోజులు గడిచిపోయాయి. 
అప్పుడు నా లాంటి ఆకారం ఉన్న ఒక తెల్లని శరీరం నా నుండి బయటికి రావడం జరిగేది. నాకు ఆశ్చర్యం వేసింది. అచ్చము నాలాగా మరొక వ్యక్తి నా శరీరం లో ఉన్నాడా? మరి ఈయన ఎవరు? ఈయనను ఎవరు చూస్తున్నది. నాకేమీ అర్థం కాలేదు. కొన్ని క్షణాల తర్వాత నా శరీరము లోనికి బయటికి వచ్చిన తెల్లని శరీరం బయటికి వెళ్ళి పోయేది. లోపలికి వచ్చేది. అది ఎక్కడికి ఎలా వెళుతుందో నాకేమీ అర్ధం అయ్యేది కాదు. ఇలా కొన్ని వారాలు జరుగుతున్న సమయంలో నా విశ్లేషణ శక్తి వలన అది నా సూక్ష్మశరీరం అని అది మెదడు మధ్యభాగంలో ఉండే "పిట్యూటరీ గ్రంధి" లోపల దీని ఆవాసమనీ దీని ప్రక్కనే ఉన్న మరో గ్రంధి "పీనియల్ గ్రంథి" అయిన త్రినేత్రం ద్వారా స్థూల శరీరము దీనిని ఈ సూక్ష్మ శరీర ధారిని చూస్తోందని నాకు అర్థమైనది. ఒకరోజు నేను కాశీ విశ్వనాథుని లింగమూర్తిని చూడాలి అనిపించి గుడి కి వెళ్ళినాను.

...కానీ నా అవతారం చూసి వాళ్లు భయపడి నన్ను ఒక పిచ్చివాడి కింద జమకట్టి నన్ను గుడిలోనికి పంపించలేదు.కించిత్ బాధ వేసింది. ఆయనే నాకు దర్శనము ఇవ్వకూడదని అనుకున్నాడని అనుకుని మౌనంగా వెనక్కి తిరిగి వచ్చి నా ధ్యానం లో కూర్చున్నాను. కానీ నా ధ్యానము కుదరలేదు.మనసంతా ఆ విశ్వనాధుని పైనే ఉండిపోయింది. ఆ రోజంతా మనోవికలము అయినది. నిద్ర లేదు. ఆకలి లేదు. ఆనందమూ లేదు. ధ్యాస లేదు. ధ్యానము లేదు. మౌనము. ఏదో తెలియని వేదన, ఆవేదన. నా తండ్రి నన్ను అనుగ్రహించలేదని బాధ. ఇలా అర్ధరాత్రి సమయంలో ఉండగా నా శరీరం నుండి నా సూక్ష్మశరీరము బయటికి వచ్చి కాశీ విశ్వనాధుని లింగ మూర్తిని దర్శించి పూజించి పువ్వులు, పూలమాల సమర్పించి రావటం అది అంతా నా యొక్క త్రినేత్రం నందు ప్రస్ఫుటంగా కనపడ సాగినది. అంటే ఒక వీడియో లాగా చూస్తున్నట్లుగా చూడటము జరిగినది. అది నిజమా లేదా అబద్దమా లేదా భ్రాంతియా లేదా భ్రమ అని తెలియని అయోమయ స్థితి. ఎటూ తేల్చుకోలేని స్థితి. సరే కొన్ని క్షణాల తర్వాత తను చూసిన అపూర్వ దృశ్యం అదృశ్యమైంది. సరే అని నేను నిద్ర లేచి ఘాట్ వద్ద స్నానాదికాలు చేసుకుందామని వెళ్ళగానే దశాశ్వమేధ ఘాట్ వద్ద ఇదిగో స్వామి! ఈరోజు విశ్వనాథుడికి అలంకరించిన పువ్వులు. ఇవి చాలా పవిత్రమైనవి. మీలాంటి పవిత్రమైన వారికి వీటిని ఇస్తేనే వాటి పవిత్రత మరింతగా పెరుగుతుందని ఆ రాత్రి నాకు నిజంలాంటి కలలో నేను నా సూక్ష్మ శరీరంతో ఏ ఏ పువ్వులతో ఆ కాశీ విశ్వనాధునిని అర్చించినానో వాటిని నా చేతిలో ప్రత్యక్షంగా చూసేసరికి నా శరీరము కొంతసేపు అచేతనము గా మారినది. నా మనస్సు ఆనంద స్థితిలోనికి వెళ్ళినది. ఏమి జరుగుతుందో అర్ధం గాక ఆ భక్తుడు నాకు నమస్కారము చేసి భయపడుతూ వెళ్లిపోయాడని నాకు అర్థము కానీ అర్థమైన స్థితిలోనికి అనగా ప్రారంభ సమాధి స్థితిలో ని కి వెళ్ళినాను.

   కొన్ని క్షణాల తర్వాత సాధారణ స్థితికి వచ్చి గంగలో స్నానాదికాలు పూర్తిచేసుకుని విచారించగా అది నాకు మనో జప సిద్ధి కలిగినదని అనగా సూక్ష్మ శరీరంతో ఎక్కడికి ఏ చోటుకి వెళ్లాలనుకున్న వెళ్లి రావటం అన్నమాట. అంటే ఇన్నాళ్ళు స్థూల శరీరంతో చేసిన అన్ని యానాలు కూడా సూక్ష్మ శరీర యానాలు ద్వారా చేయవచ్చని గ్రహించేసరికి అలా నిన్న రాత్రి విశ్వనాధుని దర్శించుకోవటం జరిగినదని తెలియగానే నాలో తెలియని ఆవేశ, ఆనందాలు కలిగినాయి.

...ఇంతలో ఒకరోజు నేను తీవ్రమైన ధ్యానస్థితిలో ఉండగా ఈ నీలి వర్ణ వ్యక్తి ఆకారము కాస్త గురుదేవుడు "భగవాన్ రమణ మహర్షి"  లాగా అగుపించింది. తర్వాత మరొక ఆకారము అనగా విశ్వ గురువైన శ్రీ దత్త స్వామి లాగా కనపడింది. ఆ తర్వాత అది కాస్త ఒక మహర్షిలాగ రూపాంతరము చెందినది. ఇదియే నా ఆది జన్మని స్మృతికి వస్తుండగా ఆ మహర్షి ఎవరో కాదని నైగేమయుడని నాకు అర్థమైనది. ఆ మహర్షి కాస్త నా ప్రస్తుత స్థూల జన్మ ఆకారముగా రూపాంతరం చెందినది. అవును. తను జ్యోతి స్వరూపుడే. ఇంతకాలమూ ఇంకేదో అని కలగనటము జరిగింది. తన సహజ స్థితి స్వస్థితి సరిగ్గా ఇదే అని అదే నేను అని నాకు ఆత్మానుభూతి కలిగినది.ఇదియే యోగ శాస్త్రాలు చెప్పిన ఆత్మసాక్షాత్కార అనుభూతిని చెప్పకనే చెప్పకుండానే తెలిసిపోయింది. నా పెదవుల మీద పరమానందము తో కూడిన చిరునవ్వు మెరుస్తుండగా నా అంగిట్లో నుంచి ఆనందానికి కారణమైన అద్భుతమైన అమృతరసం కారుతుందని నాకు అవగతమైనది. దానితో నేను ఖేచరి ముద్రలో సహజసిద్ధంగా నా నాలుకను వెనక్కి మడిచి దాన్ని అందుకుంటూ పరమానందము పొందటం ప్రారంభించాను. దానితో నాకు నా జన్మాంతరాలు అలాగే ఇతరుల జన్మాంతరాలు తెలిసిపోయే జన్మాంతర జ్ఞానసిద్ధి కలిగినది. అలాగే ఈ చక్ర సిద్ధి అయినా దూరదృష్టి కూడా అబ్బినది.ఇలా అంటే నేను తీవ్ర ధ్యానంలో ఉండగా ఎప్పుడైనా ఎవరైనా స్మరిస్తే వాళ్ళు ఉన్న ప్రస్తుత స్థితి నా త్రినేత్రం అయిన మనోనేత్రం ముందు దర్శనం అవసాగింది. తల్లిదండ్రులు ఓదార్పులు నిట్టూర్పులు, బంధు మిత్ర విరహ వేదనలు ఆవేదనలు సంతోషాలు నా కళ్ళముందు తరచుగా అగుపించేవి. కానీ నేను వాటికి మానసికంగా అలాగే శారీరకంగా స్పందించటం ఇలాంటి స్పందనలు నాలో కలగలేదు. అలాగే ఈ సిద్ది పరీక్షించాలని అని కూడా అనిపించలేదు.       

No comments:

Post a Comment