Vedantha panchadasi:
తాదాత్మ్యాధ్యాస ఏవాత్ర పూర్వోక్తావిద్యయా కృతః ౹
అవిద్వాయాం నివృత్తాయాం తత్కార్యం వినివర్తతే ౹౹52౹౹
52. అవిద్య చేతనే ఇట్లు అహంతకు, ఆత్మకు తాదాత్మ్యాధ్యాస కల్పింప బడినదని పూర్వమే (19నుండి34వరకు)చెప్పబడినది.ఈ అజ్ఞానము తొలగింపబడినపుడు దాని కార్యమగు అధ్యాస కూడా తొలగింపబడును.
అవిద్యావృతి తాదాత్మ్యే విద్యయైవ వినశ్యతః ౹
విక్షేపస్య స్వరూపం తు ప్రారబ్ధ క్షయమీక్షతే ౹౹53౹౹
53. ఆత్మ స్వరూపము యొక్క ఆవరణము,తాదాత్మ్యాధ్యాస రెండూ
(అవిద్యచే కల్పింపబడినవగుటచే)
విద్య చేతనే నశించును.కాని విక్షేపము యొక్క స్వరూపము ప్రారబ్ధక్షయము చేతనే నశించును.
వ్యాఖ్య: ఆవరణము,అధ్యాసలకు కారణము కేవలము అవిద్య.కనుక అవి రెండూ విద్య చేతనే నశించును.
కాని విక్షేపస్వరూపమైన స్థూలదేహము అవిద్యతో కూడిన ప్రారబ్ధ కర్మ వలన ఏర్పడినది.
ఆ ప్రారబ్ధము అంతమైతే గాని స్థూలదేహము నశింపదు.
కర్మ మూడు విధములు. సంచితము,ప్రారబ్ధము,ఆగామి అని. పూర్వ జన్మములందు చేయబడిన ఫలమనుభవింపవలసియున్న కర్మ "సంచితము".
అనుభవం ఆరంభమై ఈ శరీరమును కల్పించినది
"ప్రారబ్ధ కర్మ".
ఈ శరీరముచే చేయబడుచు ఇక మీద ఫలమును ఈయబోవునది
"ఆగామి"కర్మ.
విద్యచే అనగా జ్ఞానముచే "సంచిత" "ఆగామి"కర్మలు నశించును గానిప్రారబ్ధము అనుభవము చేతనే క్షయించును.
గతంలో చేయబడిన కర్మల వలన వచ్చే ఫలితం వర్తమానంలో అనుభవం లోనికి రావడమే ప్రారబ్ధ మనబడుతుంది.
కాలం మనోబుద్ధులలో జనించి వానిచే కొలవబడుతుంది.ఈ మనోబుద్ధుల నధిగమించిన స్థితే ఆత్మానుభవం.ఆత్మానుభవ స్థితుడయిన యోగి కాలాన్ని జయించినవాడే.
మనోబుద్ధుల ద్వారా పనిచేసే అహంకారాన్ని మాత్రమే గతం శిక్షించగలదు.ఈ గత కర్మల ఫలం మన శరీరాలకూ వాటితో మనకు గల తాదాత్మ్యానికి మాత్రమే పరిమితంగా ఉండి వాటిని శాసించగలుగుతుంది.
ఆత్మతత్త్వాన్ని గుర్తించలేనప్పుడు మాత్రమే అన్యధా గ్రహణం సంభవమౌతుంది.ఆత్మను గురించిన అజ్ఞానమే దీనికంతటికీ మూలకారణం.శరీరభావం ఆత్మమీద ఆరోపిపబడినది (అధ్యాస)మాత్రమే.
అజ్ఞానం వలన శరీర మనో బుద్ధులను ఊహించి చూసి వాటితో తాదాత్మ్యం చెంది ఈ ప్రపంచంలో సుఖదుఃఖాల ననుభవించి పరిమిత జీవిగా భావించడమే అధ్యాస.
ఈ అజ్ఞానము తొలగింపబడినపుడు దాని కార్యమగు అధ్యాస కూడా తొలగింపబడును.ఆత్మ స్వరూపము యొక్క ఆవరణము,తాదాత్మ్యాధ్యాస రెండూకూడా విద్య చేత మాత్రమే నశించును.
వ్యక్తి తన అంతరంగంలో తన నిజతత్త్వాన్ని గ్రహించగలిగినప్పుడు అంతవరకు తానుగా భావించిన చూస్తున్న శరీర మనోబుద్ధులూ,వాటిద్వారా చూడబడే వస్తు-ఉద్రేక-ఆలోచనలూ వాటి ననుభవించే వ్యక్తిత్వాలూ అన్నీ కూడా ఆత్మచైతన్యంలో లయమయి పోగా అద్వైతానుభవం మాత్రమే ఏకంగా మిగిలి ఉంటుంది.
ఒక పోలీసు ఒక వ్యక్తిని "అరేస్టు"చేయడానికి అతని యింటికి వెళ్ళాడనుకుందాము.ఆ యింటికి వెళ్ళి ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని చూస్తాడు.కాని అప్పటికే ఆవ్యక్తి విగత జీవుడయి ఉండే,
ఆ పోలీసు అరెస్టు వారెంటుతో ఎవరిమీద చర్య తీసుకుంటాడు?
ఇదే విధంగా సాధకుడు సిద్ధుడయి మనశ్శరీరాల కతీతమయిన స్థితిలో నిలిచినప్పుడు ప్రారబ్ధం ఎవరిని బాధిస్తుంది?ఏ విధంగా బాధిస్తుంది?
అందుచేతనే కాలబద్ధమయిన ప్రారబ్ధం కాలాతీతంగా నిలచిన యోగిని బాధింపలేదు.
శరీరము ఇట్లు అనుభవించుచున్నను,జ్ఞానికి దానితో తాదాత్మ్యము ఉండదు.ఆస్థితియే "జీవన్ముక్తి".
No comments:
Post a Comment