నీ చరణములే
మాకు శరణు
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
భగవానుడొక్కడే పాదపూజకు అర్హుడు. ఆయన సృష్టికర్త, అనంతుడు. ఆయన చరణాలు శ్రీచరణాలు. అహంకారాన్ని, ఆభిజాత్యాన్ని వదిలిపెట్టి చేసే పాదసేవ సంపూర్ణ శరణాగతికి నిదర్శనం. మనసులోని సకల కల్మష భావాలను ఆవల పెట్టి చేసే సేవే పాదసేవనం.
అనంతుడి పాదపీఠమే భూమి. హరిపాదం సోకని తావుండదు. ఆయన సర్వవ్యాపకుడు. విశ్వం మొత్తాన్ని ప్రకాశింపజేసే చైతన్యరూపం ఆయనది. బ్రహ్మాండ గోళాలన్నింటినీ కొలిచిన పాదం. ఒక పాదంతో భూమిని, మరొకపాదంతో ఆకాశాన్ని ఆక్రమించి తన విరాట్ స్వరూపాన్ని ప్రదర్శించాడు. అహంకారంతో తుళ్ళిపడే జీవులను సంస్కరించిన పాదమది. పావనగంగ ఆ పాదాలనుంచే ఉద్భవించింది. అందుకే భక్తి జగత్తులో, మనసును పుష్పంలా మలచి ఆ పాదాలకు సమర్పించాలి. మనోవాక్కాయ కర్మలు ఏకీకృతమై, శుద్ధత్వంతో ఆ పాదాలను ఆశ్రయించాలి. భగవానుడికి సమర్పించే అధాంగపూజలో ప్రథమంగా పాదౌ పూజయామి అంటారు.
హిరణ్యకశిపుణ్ని తన నరసింహాకృతితో వధించిన పిదప, ఉగ్రరూపంలో సింహాసనాన్ని అధిష్ఠించిన శ్రీహరిని ప్రహ్లాదుడు నీ పాదాశ్రయుడిగా చేయమంటూ ప్రార్థిస్తాడు. అంతకన్నా సామ్రాజ్య వైభవాలు వద్దంటాడు.
శ్రీరామచంద్రుడి పాదుకలను తలపై ధరిస్తాడు భరతుడు. తల ఉన్నతమైన స్థానం. అది బ్రహ్మరంధ్రం ఉండే చోటు. సహస్రారకమలం నెలవై ఉండే చోటు. శ్రీరామచంద్రుడి పాదుకలను సింహాసనంపై ఉంచి శ్రీరామచంద్రుడి పేరిట రాజ్యపాలన చేస్తాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు కాళియుడి పడగలపై నాట్యం చేస్తాడు. ఆయన పాదముద్రలే నాగజాతికి అలంకారాలయ్యాయి.
శ్రీకృష్ణుడు గోవులతో గోపబాలురతో యమునాతీరంలో బృందావనంలో విహరిస్తుండగా గోవులను, గోప బాలురను మాయం చేస్తాడా విధాత. సృష్టికి ప్రతిసృష్టి చేస్తాడు శ్రీకృష్ణుడు. మనసును కమ్మిన మాయ, అహంకారం తొలగుతాయి విధాతకు. శ్రీకృష్ణుడి అవతార వైభవానికి తన్మయుడైన విధాత ‘స్వామీ! ఆ బ్రహ్మపథం ఎందుకు! నీతో కలిసి ఆడిపాడే గోపబాలుర పాదరేణువు నా తలపై ధరించినా నాకది చాలు’నంటాడు. మధురానగరంలో మాలాకారుడైన సుదాముణ్ని అనుగ్రహించి వరం కోరుకొమ్మని అంటాడు శ్రీకృష్ణుడు. నీ పాదకమల సేవ నీ పాదార్చకులతోడి స్నేహం అనుగ్రహించమని అడుగుతాడు సుదాముడు.
ఆదిశంకరుల అద్భుత రచనల్లో దేవీదేవతల పాదాల వైభవాన్ని వర్ణించారు.
సర్వ భయాలను పోగొట్టి సుఖాలనిచ్చే సదాశివుడి పాదపద్మాలను ఆశ్రయించాలని శివానందలహరిలో ప్రబోధిస్తారు. అరిషడ్వర్గాలను తొలగించి ముక్తిపథాన్ని చూపేది ఒక్క గురుపాదాలేనని, తన గురుపాదుకాస్తోత్రం ద్వారా తెలియజేశారు.
వివాహ వేడుకలో వరపూజ ముఖ్యమైన ఘట్టం. కన్యాదాత వరుణ్ని లక్ష్మీనారాయణ స్వరూపుడిగా భావించి, సుగంధ పూజాద్రవ్యాలతో కూడిన జలంతో పాదప్రక్షాళన చేస్తారు. అలాగే తల్లిదండ్రులను దైవస్వరూపులుగా భావించి, పాదపూజ జరుపుతుంది సంతానం. పాదప్రక్షాళన చేసిన జలాన్ని తమ శిరస్సులపై చిలకరించుకొని ధన్యత చెందినట్లుగా భావిస్తారు.
వినమ్రతకు, మనసులో మెదిలే భక్తి భావనకు నిదర్శనాలు ఇవన్నీ. ఆధ్యాత్మిక సాధనాజగత్తులో పాదసేవ గొప్ప సంస్కారవంతమైనది. భగవానుడి అవతారమూర్తుల చరణాలపైన నిలిచే దృష్టి, ఆ రూప వైభవాన్ని, తత్వాన్ని కాలగమనంలో గ్రహించగలుగుతుంది.
ఆ పాదాలకు-మనసుకు బంధం ఏర్పడాలి. ఆ బంధం మానవుణ్ని మాధవత్వం వైపు నడుపుతుంది.
💥💥💥🙏🏼🙏🏼💥💥💥💥
No comments:
Post a Comment