*🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🪭శోక పురాణం🪭*
*పుట్టగానే శిశువు చేసే మొదటి పని ఏడవడం. 'చిన్నపిల్లలకు ఏడుపే బలం' అనేది నానుడి. చిన్న వయసులో బాలలకు ఏ ఇతర వ్యాయామాలూ ఉండవు. కాబట్టి ఏడవడం వల్ల అవయవాలు బాగా కదిలి శారీరక వ్యాయామం జరుగుతుంది. తద్వారా తాగిన పాలు, తిన్న ఆహారం బాగా జీర్ణమై శరీరానికి బలం, ఆరోగ్యం చేకూరతాయి. మాటలు రాని పసివాడు తనకు కావలసిన ఇతర అవసరాలన్నీ తీర్చమని చెప్పేది ఏడుపుతోనే.*
*వాల్మీకి శోకమే శ్లోకమైంది. అదే ఆది కావ్యమైన రామాయణానికి నాంది అయింది. భారతీయ సాహిత్యానికి పునాది అయింది. ఆధ్యాత్మికపరంగా ఏడుపు ప్రధాన భూమిక నిర్వహిస్తోంది. ఎన్ని విధాలుగా*
*వేడుకున్నా కానరాని దైవం కన్నీళ్లకు కరిగి ప్రత్యక్షమవుతాడని అనేక పౌరాణిక గాథలు తెలుపుతున్నాయి. దానికి కారణం మిగిలిన ఏ మార్గం ద్వారా అయినా భగవంతుణ్ని ప్రార్ధించడంలో నిబద్ధత కొరవడవచ్చు. కానీ అన్ని మార్గాలూ మూసుకుపోయిన తరవాత కలిగే శోకంలో నిజాయతీ, నిబద్ధత ఉంటాయి. దాన్ని గమనించిన భగవంతుడు తనంత తానుగానే దిగివస్తాడట. వస్త్రాపహరణ సమయంలో ద్రౌపది, మొసలికి చిక్కిన గజేంద్రుడు... ఇలా ఎందరో భక్తులు దుఃఖంతోనే భగవంతుడి సాక్షాత్కారాన్ని పొందారు.*
*పురాణాలు, ఇతర సాహిత్యంలో ఏడుపునకు పెద్ద స్థానమే ఉంది. అరణ్యంలో వదిలినప్పుడు సీత, ఉపపాండవులను కోల్పోయిన ద్రౌపది, హరిశ్చంద్ర నాటకంలోని సన్నివేశాలు మొదలైనవన్నీ దుఃఖాన్ని కలిగించేవే. వాటిని చదివిన పాఠకులు, దృశ్యంగా చూసిన ప్రేక్షకులు, పురాణ, కథల రూపంలో విన్న శ్రోతలు ఆయా పాత్రల పట్ల అభిమానులయ్యారు. కేవలం నీరే... సుడిగుండం, బుడగ, కెరటం, ఆవిరి, మంచు లాంటి రూపాల్లోకి మారుతుంది. అలాగే సాహిత్యంలో నవరసాలు ఉన్నా, ఒక్క కరుణరసమే ముఖ్యమైనదిగా చెప్పవచ్చు అంటాడు భవభూతి తన ఉత్తర రామచరిత్ర నాటకంలో. మిగిలిన రసాలన్నీ దాని నుంచే పుట్టాయనీ వివరణ సైతం ఇచ్చాడు. అందుకే తన ఉత్తర రామచరిత్ర నాటకాన్ని కరుణరస పూరితంగా రచించాడు.*
*తెలుగు సాహిత్యంలో 'అల్లసాని పెద్దన అల్లిబిల్లిగా ఏడ్చాడు, ముక్కు తిమ్మన ముద్దు ముద్దుగా ఏడ్చాడు. భట్టుమూర్తి బావురుమని ఏడ్చాడు' అన్న ఛలోక్తి సుప్రసిద్ధమైంది. అల్లసాని పెద్దన మనుచరిత్రలో వరూధిని దుఃఖం స్వారోచిష మనువు జన్మకు నాంది అయింది. ముక్కు(నంది) తిమ్మన రచన పారిజాతాపహరణంలో నారదుడిచ్చిన పారిజాత పుష్పాన్ని ఎదురుగా ఉన్న రుక్మిణికి ఇచ్చాడు కృష్ణుడు. ఆ విషయం తెలిసిన సత్యభామ 'ఈసు'తో ఏడ్చినట్టు తన కావ్యంలో వర్ణించాడు. ఫలితంగా పారిజాత వృక్షం భూమికి వచ్చింది. వసురాజును వలచిన గిరిక నిండు పున్నమి వెన్నెల వెలుగు తాళలేక ఎలుగెత్తి ఏడ్చిందని భట్టుమూర్తి వర్ణించాడు.*
*వీరి ముగ్గురిలోనూ వరూధిని 'కలస్వనంబుతో' (తీయని కంఠధ్వనితో) ఏడ్చింది. సత్యభామ 'కాకలీధ్వనితో' ఏడ్చింది. గిరిక కాంభోజి రాగంలో 'స్వరసం'గా ఏడ్చిందట. అందుకే ఏడుస్తున్నవారిని చూసి రాగం తీస్తున్నారని సరదాగా అంటారు.*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనా సుఖినో భవంతు🙏*
🌻🌴🌻 🌴🌻🌴 🌻🌴🌻
No comments:
Post a Comment