Tuesday, November 19, 2024

 *కర్ణ మహా భారతం -13*
🏹

రచన : శ్రీ శార్వరి 

*ఉభయ మిత్రులు* 

ఆనాటి నుండి అశ్వత్థామలో ఏదో కొత్తదనం కనిపించసాగింది. అది ఉర్వి చూపుల్లో మార్పా. దృష్టి కోణంలో మార్పా. లోగడ అనుమానం ఇప్పుడు గౌరవంగా మారింది. మోసగాడైన గురువుకు మంచి బిడ్డడు. తప్పు పుట్టాడు. కర్ణుని ప్రతిభను దుర్యోధనుడు గుర్తిస్తే, అతని మంచితనాన్ని అశ్వత్థామ గుర్తించాడు. ఇద్దరూ అర్జునుని కన్న కర్ణుడు అధికుడని అంగీకరించారు. మనసా, వాచా కర్ణునికి సమాజంలో సముచితస్థానం కలిగించిన ధీశాలి దుర్యోధనుడు. మైత్రి విలువ చూపిన వాడు అశ్వత్థామ. కానీ ఇద్దరి తత్వాలు వేరు వేరు. కర్ణుని స్నేహంలోనూ ఆ తేడాలు కనిపిస్తాయి. కర్ణుని దృష్టిలో ఇద్దరూ తనకు సమానమే. తన యోగ్యత, స్థానం తనకు తెలుసు. అతిగా ఎక్కడ ఏ విషయంలోను ప్రవర్తించడు.

దుర్యోధనుడు ఉదారుడే. కాని పనికిమాలిన అంగరాజ్యాన్ని కాక మరొక సుభిక్షమైన రాజ్యాన్ని ఇస్తే బాగుండేది. అది కంటితుడుపు వ్యవహారం. కర్ణుడు నామమాత్రపు రాజు. అవి కర్ణుడు మనసులో పెట్టుకోడు. దుర్యోధనుడు తనకిచ్చిన గౌరవం ముందు రాజ్యం తీసికట్టు. సంపదలు విలువలేనివి.

రాధేయుడు దుర్యోధనుని ప్రశంసించిన ప్రతిసారి ఉర్వికి చిరాకు. వారి మైత్రిని ఎవరు విమర్శించినా తను సహించలేడు. చిర్రు బుర్రులాడుతుంది. తన తండ్రిగారి హెచ్చరికలు, భీష్మ పితామహుని హెచ్చరికలు మరచిపోదు. దుర్యోధనుడు ఏదైనా మంచి పని చేస్తే అది కర్ణతో మైత్రి ఒక్కటి మాత్రమే.

కర్ణ దుర్యోధనులు కలిసిన ప్రతిసారి ఉర్వి భయపడుతుంది. కలవరపడుతుంది.

హస్తినలో కలిసిన రోజు సుదినమా, దుర్దినమా! సూర్యాస్తమయవేళ ఉదయించిన స్నేహం మధ్యలోనే అస్తమిస్తుందా? ద్రోణ, కృపాచార్యుల నిర్ణయాన్ని పక్కన పెట్టి కర్ణుని పక్షాన దుర్యోధనుడు గట్టిగా వాదించాడు. ఎవరి బలం వారిది. ఎవరి శక్తి వారిది. అప్పటి నుండి దుర్యోధనుడు కర్ణుని పట్ల అభిమానం పెంచుకున్నాడు.

దుర్యోధనుడు తనతో ఎందుకంత ప్రసన్నంగా ఉంటాడు అని ఉర్వి అనుమానం. తనంటే నాకు ఇష్టం ఉండదని తెలుసు. వారి స్నేహాన్ని నేను అంగీకరించననీ తెలుసు. తెలిసీ నాపట్ల సుముఖత ఎందుకు? అతని దుర్మార్గ బుద్ధి ఆమెకు తెలుసు. పెళ్లినాడు పెద్దరికం చేశాడు.

కర్ణుడు రోజూ రాజాస్థానానికి వెడతాడు. అక్కడ ఈయనకేం పని? దుర్యోధనుడు ఇంటికి వచ్చి కలుస్తాడు.

వృశాలి ఈ కొత్త అలవాటుకు ఆశ్చర్య పడ్డది. ఠీవిగా రథం దిగి కర్ణుని మందిరానికి వెడతాడు దుర్యోధనుడు. ఇద్దరూ ప్రయత్నించి కర్ణుని మెప్పించలేక పోయారు. అతనితో స్నేహం ప్రమాదమని నమ్మించలేకపోయారు.

“నువ్వయినా చెప్పి ప్రయత్నించు చెల్లీ" అన్నది వృశాలి. ఉర్విలో వృశాలి మాటలలో అర్థింపు ఉన్నా తనూ ఏమీ చేయగలింది లేదు. ఎంత ప్రేమ నటించినా మగాళ్లు భార్యల మాట వింటారా? దుర్యోధనుడు లోపలకు వచ్చాడు. భారీ శరీరం. భీమ బలుడు. విశాలమైన వక్షస్థలం, బలమైన జబ్బలు, చేతులు. ప్రతి నిమిషం తన మీసాలు మెలేస్తుంటాడు. చూస్తేనే భయం వేస్తుంది. రావణుడు కూడా ఇలాగే ఉండేవాడేమో.

“నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటు న్నావా ఉర్వీ! చెప్పు!" అది ప్రశ్నలా వినిపించలేదు. శాసించినట్టుంది.

“అవును మహారాజా” అన్నది ఉర్వి.

“నీవు అంగరాజు భార్యవు ఇంద్రప్రస్థ రాణివి కావు కదా ఉర్వీ.”

ఇంద్రప్రస్థ ప్రస్తావనతో తికతిక పడ్డది. కలవరపడ్డది. తనకు, ఇంద్రప్రస్థానికి ఏమిటి సంబంధం?

అతని మాటల్లో ఏదైనా వ్యంగ్యం, గూఢార్థం ఉందా అనిపించింది. అతన్ని విమర్శిస్తే కర్ణుడు సహించడు. ఈయనగారి ధీమా అది.

“ఇంద్రప్రస్థమా? మహారాజా! ఆ పేరు ఎక్కడో విన్నట్లుంది. ఇంద్రప్రస్థం అంటే స్వర్గం కదూ. ఇంద్రప్రస్థం స్వర్గంలా ఉంటుందని విన్నాను.” ఖాండవ ప్రస్థం ఇంద్రప్రస్థంగా మారింది. మరు భూమి అమరసీమ అయింది. పాండవుల చేతిలో ఇంద్రజాల విద్యలున్నాయా. ఆలోచించసాగింది ఉర్వి

"అందుకు కారణం మీ తండ్రిగారే కదా! అర్ధ రాజ్యం ఇవ్వబట్టే గదా!” ఉర్వి మాటల్లోని వ్యంగ్యం దుర్యోధనునికి ఎక్కడ తగలాలో అక్కడ గుచ్చుకుంది. మాట గుచ్చుకున్నా మనస్సుకు నొప్పి కలుగుతుంది!

"ఎగతాళి చేస్తున్నావా ఉర్వీ రాకుమారీ, అంగరాణీ!" అన్నాడు. దుర్యోధనుడు తమాయించుకుని అన్నాడు. "నాన్నగారి నిర్ణయం నాకిష్టం కాకపోయినా అంగీక రించక తప్పదు. వారు అర్ధరాజ్యం కోరినా గురుద్రోణాచార్య భీష్మపితామహులు అందరూ నాన్నగారినే సమర్థించారు. నాకు, కర్ణునికి ఇద్దరికీ ఇష్టం లేని పని జరిగిపోయింది ఉర్వీ. రాజ్యాన్ని పంచడం మాకిష్టం లేదు. నిజానికి యుద్ధం చేద్దామంటాడు కర్ణుడు. పాండవులపై అకస్మాత్తుగా దాడి చేస్తే ఓడించడం సులభం. ద్రుపదుని సేన, శ్రీకృష్ణ యాదవ సేన వచ్చే లోగా విజయం సాధిస్తాం.”

"ఆ విషయాలు నాకెందుకు చెప్పడం సుయోధన మహారాజా! రాజ వంశాలలో ఇలాంటి విషయాలు ఆడవారితో సంప్రదించరు గదా. మా సలహాలు ఎవరైనా, ఏనాడైనా అడిగారా, పాటించారా! అయినా యుద్ధంతో ఏం పని? ఇది మీ కుటుంబ విషయం గదా. బయట వారికి, బంధువులకు ఏం సంబంధం."

దుర్యోధనుని తర్వాతి మాట ఉర్వి నోరు కట్టి వేసింది.

"కర్ణుడు నా కుటుంబంలోని వ్యక్తి ఉర్వీ. తను నా ప్రియమిత్రుడు. నా సోదరులలో తనూ ఒక్కడు. నాకు సోదరుని వంటివాడు" అన్నాడు.

“లాం ... టి ... వా ... డే ... గాని నిజ సోదరుడు కాదుగా దుర్యోధనా. ఎప్పటికీ కాలేదు. మీ కుటుంబ కలహాలలోకి కర్ణుని లాగకండి దయచేసి. మీరు మీరు సర్దుకు పోండి స్వామీ. తను మీ దర్బారుకు రావడం ఎవరికీ ఇష్టం లేదు. మీకు ప్రయోజనం లేదు కూడా.”

"తను నా స్నేహితుడు ఉర్వీ! ఆపద్ధర్మ స్నేహం కాదు మాది. అవసరం కోసం స్నేహం చేయడం లేదు నేను.”

ఆ మాటల వెనుక ధ్వని అదే! అవసరం కోసం స్నేహం చేసినట్లు తెలుస్తోంది.

"అవసరమో, అనవసరమో నాకు తెలియదు మహాత్మా. మీ వైరం పాండవు లతో. మీరు మీరు అన్నదమ్ములు. మధ్య కర్ణుడికేం సంబంధం? మీది స్నేహం కాదు ధర్మం కాదు. స్వార్థం! మోసం!

“తన కృతజ్ఞతను విశ్వాసాన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారేమో ఆలోచించండి. నిజం చెప్పండి దుర్యోధన మహారాజా! అర్జునునికి దీటైనవాడు అనేగా ఈయన్ని మీరు చేరదీశారు. అంగ రాజ్యం కట్టబెట్టి అర్ధరాజ్యం ఇచ్చినట్లు ? మాట్లాడుతున్నారు.”

ఆమె ముఖం వివర్ణమైంది. ఎన్ని మాటలు మాట్లాడగలిగాను అనుకున్నది.

“ఇప్పుడు నేనేం చెప్పినా నీవు నమ్మవు రాకుమారీ. నిన్ను నమ్మించడం నా తరం కాదు. కర్ణుడు నా ఏకైక మిత్రుడు. తను నాకు ప్రాణంతో సమానం. నాకు తనంటే ఎనలేని గౌరవం, ఇష్టం. తనను ఎవరు కించపరచినా సహించను.

"తనను వదిలేయమన్నావు గదా ఉర్వీ. ఇష్టం లేకపోయినా ఆ పని చేయగలను."

ఉర్వి నమ్మలేకపోయింది దుర్యోధనుని మాటలు. ఆమెలో కొంత విజయగర్వం. దుర్యోధనుడు ఆమెకు దగ్గరగా వచ్చి అన్నాడు.

"నేను తనను వదిలించుకున్నా తను నన్ను వదిలిపోలేడు ఉర్వీ.”


*శకుని చెలగాటం*
🎲
"అయిష్టంతో నేను తనని దూరం చేసుకున్నా అతను నన్ను విడిచి ఉండగలడా?"

అతని మాటలు దుర్యోధనుని ఈ చివరి మాటలు ఉర్వి చెంప చెళ్లుమనిపించా యి. చెవుల్లో మారు మ్రోగుతూనే ఉన్నాయి.

ఆ ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేదు. అది ప్రశ్న కాదు జవాబు చెప్పడానికి. అది నిశ్చితాభిప్రాయం.

కొన్నాళ్ల తర్వాత అదే విషయం కర్ణుని నోటి వెంట మరొక రూపంలో వెలువడింది. అది ఉర్విని దిగ్భ్రాంతికి గురి చేసింది.

సందర్భం: దుర్యోధనుడు మిత్రుడు కర్ణుని, ఉర్విని భోజనానికి పిలిచాడు. కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చిన వాడు గదా! ఆ విందు గురించి కర్ణుడు ఉర్వితో చెప్పాడు. ఆమెలో తను ఆశించిన ఆనందం కనిపించలేదు. ముభావంగా ఉండిపోయింది.

"ఏం ఉర్వీ! ఈ విందు నీకిష్టం లేదా?”

"ఇష్టం లేదని చెప్పను. ఇష్టమనీ చెప్పలేను. అవసరమా?” మాట మార్చి అన్నది.

"గాంధారీ దేవికి మనమంటే ఇష్టం లేదు. దుర్యోధనుడు మనకు విందులివ్వడం ఆమెను అవమానించడమే అవుతుంది. ఆమె వెనకటిలా ఉండడం లేదు. ముభావంగా ఉంటోంది. నాకు తెలియక అడుగుతాను. ఆయనగారు మిమ్మల్ని, వృశాలిని ఎప్పుడైనా భోజనానికి పిలిచాడా లోగడ?" సూటిగా అడిగింది.

“లేదు చిన్న రాణీ! ఎప్పుడూ ఆ అవసరం కలగలేదు అవకాశం రాలేదు. నీకు దుర్యోధనుడంటే సదభిప్రాయం లేదు గనుక తన పిలుపుకి పెడర్థాలు చూస్తున్నావు. తను నీకు చిన్నతనం నుండి తెలుసు. వృశాలికి తను అసలు తెలియడు. గాంధారి విషయం అంటావా. తమ అంతస్తుకు నేను తగిన వాడిని కానని ఆమె అభిప్రాయం.”

ఉర్వి అసహనంగా చూచింది. కర్ణుడిచ్చిన సమాధానం ఆమెకు నచ్చలేదు “నాదేం పోయింది మధ్యలో. కష్టం దుర్యోధనునికి ఉండాలి. నష్టం మీకుండాలి. అయినా మీకు అతనికి స్నేహం కదా. నాకు అనవసరం. ఆయన గారిని ఎవరూ నమ్మరు. ఆయనంటే ఎవరికీ ఇష్టం ఉండదు ... మీ అమ్మగారికి మీ తమ్ముడు గారికీ ఆయనంటే గౌరవం లేదు. వృశాలికి ఇష్టం లేదు. నేనూ అంతే. చిన్నప్పటి నుండి అతనంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఆయన స్వభావం నాకు నచ్చదు. మనిషికి స్వార్థం ఎక్కువ. మర్యాద తెలియదు. మొదటి నుండి కుతంత్ర బుద్ధి. మంచి వాళ్లంటే అసలు గిట్టదు. ఇప్పటికీ అతనిలో మార్పు లేదు.”

“నాకు తెలుసు చిన్నీ! తనంటే నీకు ఇష్టం ఉండదని. నీ అభిప్రాయంతో మా మైత్రి మారదు కదా! నీ అభిప్రాయం మార్చుకో మని నేను అడగడం లేదు. నీవు నన్ను మార్చలేవు. నేను నిన్ను మారమని చెప్పను. నేను ఎవరితో స్నేహం చేయాలో నిర్ణయించేది నీవు కాదు. నా అంతరాత్మ, నా మనస్సు. దుర్యోధనుడు నీకు హితం కాదని, నన్ను దూరం కమ్మనడం న్యాయం కాదేమో. తను మర్యాదగా పిలిచాడు. మర్యాదకైనా వెళ్లడం ధర్మం.”


“భోజనానికి వస్తా లెండి ఈ ఒక్కసారికి. కానీ చనువుగా ఉండను. మాట పడను. నాకిష్టం లేని వారితో నేను చనువుగా ఉండలేను. దయచేసి నన్ను ఇతరత్రా బలవంత పెట్టకండి. ఆయన మీరనుకు న్నంత మంచివాడు కాదు. అదే నేను చెప్పదలచింది. తర్వాత మీ ఇష్టం” అన్నది ఉర్వి.

కర్ణుడు నవ్వి ఆమె వైపు అదోలా చూసాడు. ఉర్వి కళ్లు వేడిగా, చూపులు వాడిగా ఉన్నాయి.
🏹
*సశేషం* 

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•

No comments:

Post a Comment