*మత్స్యావతారం*
ధర్మానికి హాని, అధర్మానికి అభ్యుదయం కలిగినప్పుడు భక్తుల్ని రక్షించడానికి, ధర్మస్థాపనకు భగవంతుడు తానే స్వయంగా అవతరిస్తాడు. అవతార పురుషుడు మూర్తీభవించిన శక్తి. భిన్నరూపాలు ధరిస్తాడు. మానవుల కాలచిత్త సంస్కారాన్నిబట్టి దేశకాల పరిస్థితుల్నిబట్టి ఒక అవతార ప్రభావం ప్రకాశిస్తుంది. ఈ వైవిధ్యాన్ని పురస్కరించుకుని అవతారం చేసే కార్యకలాపాలు, సందేశోపదేశాలు భిన్నంగా ఉంటాయి.
శ్రీమన్నారాయణుడు లీలావిలాస అవతార కార్యకలాపాలకు మూలమని సంప్రదాయ భావన. భగవంతుడి అవతారాలు సృష్టి పరిణామాన్ని వ్యక్తంచేసే సంకేతాలుగా ఆధునికులు భావిస్తున్నారు. శ్రీమహావిష్ణువు తొలి అవతారం మత్స్య రూపం. చైత్ర బహుళ పంచమినాడు మత్స్యావతార ఆవిర్భావమని సంప్రదాయం. మహా ప్రళయకాలంలో లోకాలన్నీ నశించి జలమయమవుతాయని, దాన్ని నైమిత్తిక ప్రళయమంటారని పురాణాలు చెబుతున్నాయి. వేయి మహాయుగాలు బ్రహ్మకు ఒక పగలు. రాత్రి కాలం కూడా అంతే. పగలు గడవగానే నిద్రకు ఉపక్రమించిన బ్రహ్మ, నిద్ర లేచాక యథాపూర్వం సృష్టిని కల్పిస్తాడు. దీనికి ‘కల్పం’ అని పేరు.
వరాహకల్పంలో ద్రవిడ రాజైన సత్యవ్రతుడు కృతమాలిక నదీతీరంలో జలతర్పణం చేస్తుండగా ఒక చేప పిల్ల అతడి దోసిట నీట్లో కనిపించింది. రాజు దాన్ని నదిలో విడిచాడు. తనను పెద్ద చేపలు మింగుతాయని, రక్షించమని ఆ చేప రాజును కోరింది. రాజు ఒక పాత్రలో ఉంచాడు. మర్నాటికి ఆ పాత్ర పట్టనంత పెద్దదైంది. దాన్ని ఒక చెరువులో విడిచాడు. తరవాత ఆ చెరువు పట్టలేదు. సముద్రంలో విడిచిపెడితే శతయోజన ప్రమాణానికి విస్తరించింది. తాను శ్రీమన్నారాయణుడినని నాటికి ఏడు రోజుల్లో ప్రళయం రానుందని సత్యవ్రతుడివంటి ధర్మపాలకుడు ఆ ప్రళయంలో నశించకూడదని ఆ మత్స్యం రాజుకు చెప్పింది. లోకమంతా మహాసముద్రమైపోయే తరుణంలో సప్తర్షులతో కూడిన ఒక నావ అతడి వద్దకు వస్తుందని, పునఃసృష్టికి అవసరమైన ఓషధులు, బీజాలు వేసుకుని నావ ఎక్కమని, తాను మీన రూపంలో వచ్చి నావను రక్షిస్తానని పలికింది.
సప్తర్షుల నావలోకి సత్యవ్రతుడు ప్రవేశిస్తాడు. మీనరూపుడైన నారాయణుడు తన కొమ్ముకు మహా సర్పరూపమైన తాటితో నావను కట్టి, ప్రళయాంతం వరకు రక్షిస్తాడు. సాంఖ్యక్రియా సహితమైన పురాణ సంహితను రాజుకు ఉపదేశిస్తాడు. సత్యవ్రతుడు అనంతర కాలంలో వైవస్వత మనువుగా ప్రసిద్ధికెక్కాడు.
ప్రళయం తరవాత పరమేష్ఠి సృష్టి కార్యానికి యత్నించబోయి వేదాలు అపహరణకు గురయ్యాయని తెలుసుకొని శ్రీమహావిష్ణువును ప్రార్థించాడు. వేదాలను అపహరించిన సోమకుడనే రాక్షసుడు మహా సముద్ర గర్భంలోకి చొచ్చుకుపోయాడు. విష్ణువు మహా మత్స్య రూపంలో జలనిధిని అన్వేషించాడు. సోమక, మత్స్యాలకు పోరుసాగింది. చివరకు నారాయణుడు రాక్షసుడి ఉదరాన్ని చీల్చి వేదాలను, దక్షిణావర్త శంఖాన్ని బ్రహ్మ వద్దకు తెచ్చాడు. వేదాలను విధాతకు అప్పగించి, శంఖాన్ని తాను గ్రహించాడు.
సోమకుడు మింగడం వల్ల శిథిలమైన వేదభాగాలను బ్రహ్మను పూరించమని చెప్పాడు.
వేదాలను అపహరించడమంటే జ్ఞాన ప్రకాశాన్ని అదృశ్యం చేయాలనే యత్నం. రాక్షస నాశనంతో సృష్టికార్య ప్రతిబంధరూపమైన నిద్రారూప తమస్సు అంతరిస్తుంది. బ్రహ్మ సహజ స్వరూపాన్ని పొందుతాడు. పరబ్రహ్మ చైతన్యాత్మ సర్వవ్యాపకమని, విశ్వంలో కనిపించే తేజమే పరమాత్మ స్ఫురణమని గ్రహించాలి.
No comments:
Post a Comment