భట్టి విక్రమార్క చరిత్ర
(భేతాళ కథలు)
*కార్పటికుని కథ !*
విక్రమాదిత్యుడు భేతాళుని బృహదారణ్యం వైపుకు మోసుకెళ్తుండగా, ఎప్పటి లాగానే భేతాళుడు మరో కథ ప్రారంభించాడు. ఇది, ఎనిమిదవ కథ!
ఒకప్పుడు చండ సింహుడనే రాజుండేవాడు. అతడు బ్రహ్మపురం అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యమేలు తుండేవాడు. అతడు మంచివాడు, ప్రతాపవంతుడు, తన ప్రజల పట్ల ఎంతో ప్రేమ కలవాడు.
ఒకరోజు... కార్పటికుడు అనే యోధుడు రాజు వద్దకు వచ్చి, తన యోగ్యతలు వివరించి కొలువునివ్వ వలసిందిగా అభ్యర్ధించాడు. చండసింహుడికి కార్పటికుడి స్వరూప స్వభావాలు నచ్చటంతో, తన వ్యక్తిగత అంగరక్షకుడిగా అతణ్ణి నియమించాడు.
కార్పటికుడు రాజునెంతో భక్తిశ్రద్ధలతో సేవిస్తుండేవాడు. ఇలా ఉండగా... ఓ రోజు రాజు చండసింహుడు సపరివారంతో అడవికి వేటకెళ్ళాడు. రాజెక్కిన గుర్రం, సైనికుల గుర్రాల కంటే చురుగ్గా ఉంది. అది మెరుపు వేగంతో అడవిలోకి దూసుకెళ్ళింది. రాజు వెంట ఉన్న బృందంలో సైనికుల గుర్రాలు గానీ, మంత్రి తదితర అనుచరుల గుర్రాలు గానీ, దాని వేగాన్ని అందుకోలేక పోయాయి.
క్షణాల్లో రాజు ఎక్కిన గుర్రం అడవి మలుపుల్లో మాయమైంది. కొంత సేపటికి రాజు, తాను పరివారం నుండి దూరంగా వచ్చేసానన్న విషయాన్ని గ్రహించాడు. గుర్రాన్ని అదిలించి, దాని నియంత్రించాడు. వెనుదిరిగి చూస్తే... ఒక్క కార్పటికుడు తప్ప మరెవ్వరూ కనుచూపు మేరలో లేరు. అదీ కార్పటికుడు తన గుర్రాన్ని పరుగుతో అనుసరించి రావటం చూసి, రాజు చండసింహుడు అమితాశ్చర్య పడ్డాడు.
అయితే అప్పటికే అతడు డస్సిపోయి ఉన్నాడు. గుర్రం దిగి, ప్రక్కనే ఉన్న మర్రిచెట్టు నీడన కూలబడ్డాడు. దాహంతో నోరెండిపోయింది. కార్పటికుణ్ణి చూసి ‘దాహం’ అన్నట్లుగా సైగ చేశాడు.
అప్పటికి కార్పటికుడు చెమటలు గ్రమ్మి ఉన్నాడు. ఆయాసంతో రొప్పుతున్నాడు. అయినా గానీ, తన విద్యుక్త కర్తవ్యాన్ని మాత్రం మరిచి పోలేదు. రాజుకు అంగరక్షకుడిగా పరిసరాలని నిశితంగా పరిశీలించటం తన విధి. అందులో భాగంగా, అతడు దారి పొడుగునా పరిసరాలు గమనిస్తూనే వచ్చాడు.
రాజు విశ్రాంతికై కూర్చున్న మర్రి చెట్టుకు దాపులనే ఊసిరి చెట్టుండటం, కార్పటికుడు గుర్తించి ఉన్నాడు. రాజు ‘దాహం’ అనగానే పరిగెత్తుకు పోయి రెండు ఉసిరి కాయలు తెచ్చి రాజుకిచ్చాడు.
దాపులనే సరస్సుని గమనించి పరుగున పోయి ఆకుదొన్నెలో నీటిని తెచ్చి రాజుకిచ్చాడు. అప్పటికే ఉసిరి కాయాలతో నోరు తడి చేసుకున్న రాజు, నీరు త్రాగి సేదతీరాడు. రాజు స్థిమిత పడ్డాక, కార్పటికుడు వెళ్ళి సరస్సు నీటితో దాహం తీర్చుకుని వచ్చాడు. అప్పటికి రాజ పరివారం అక్కడికి చేరుకుంది.
కాస్సేపు సేద తీరి, అంతా రాజధానికి తిరిగి ప్రయాణమయ్యారు. రాజు కార్పటికుని విధి నిర్వహణకి ఎంతగానో ముగ్ధుడయ్యాడు. రాజధాని చేరాక, రాజు చండసింహుడు, కార్పటికుణ్ణి తన అంగరక్షక దళానికి అధిపతిగా చేసి సత్కరించాడు.
రోజులు గడుస్తున్నాయి. చండసింహుడు సింహళ రాజకుమారిని వివాహమాడదలిచాడు. ఆమె చాలా అందమైనదీ, తెలివైనదే గాక సుగుణశాలి అని అతడు విని ఉన్నాడు. దాంతో అతడు కార్పటికుణ్ణి పిలిచి, సింహళం వెళ్ళి ఇతర వివరాలు తెలుసుకు రమ్మన్నాడు.
కార్పటికుడు, ఓ వ్యాపారి దగ్గరికి వెళ్ళి, అతడి నౌకలో సింహళానికి వెళ్ళే ఏర్పాట్లు చేసుకున్నాడు. (నేటి శ్రీలంకకు నాటి పేరు సింహళమే.)
సముద్రయానం ప్రారంభమైంది. మార్గమధ్యంలో వారు పెను తుఫానులో చిక్కుకున్నారు. గాలివానలో వాళ్ళ నౌక చిగురుటాకులా ఊగిపోయింది. రాకాసి అలల్లో అల్లాడుతుంది. చివరికి ఓడ బద్దలైంది.
సముద్రపు నీళ్ళల్లో ఈదుతున్న కార్పటికుణ్ణి ఓ పేద్ద తిమింగలం అమాంతం మ్రింగేసింది. ఒరనున్న కత్తి తీసి, కార్పటికుడు, ఆ చేప కడుపును చీల్చుకుని బయటకు వచ్చాడు. అప్పటికి అతడికి కనుచూపు మేరలో ఓ దీవి కనపించింది.
ఈదుకుంటూ అతడా దీవి చేరుకున్నాడు. అక్కడ అతడికి అద్బుతమైన శిల్పకళతో అలరారుతున్న కాళికా దేవి ఆలయం కనబడింది. అతడు ఆలయం ప్రవేశించి, అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశాడు. తర్వాత ఆలయం ఆవరణలో శిల్పాలను చూస్తూ తిరగసాగాడు. అక్కడ ఓ పెద్ద మర్రివృక్షం ఉంది. దాని చుట్టూ అరుగు నిర్మించి ఉంది. శాఖోపశాఖలుగా విస్తరించిన ఆ చెట్టు నీడలో, ఓ అందమైన యువతి వయ్యారంగా వాలి పడుకుని ఉంది.
ఆమె చుట్టు దాసీలున్నారు. చుక్కల్లో చంద్రుడిలా, సరస్సులో కలువలా... ఆమె, చెలుల మధ్య భాసిస్తోంది. ఆమె అందాన్ని చూడటానికి కార్పటికుడికి రెండు కళ్ళూ చాలలేదు. వర్ణించేందుకు మాటలు రాలేదు.
ఆమె నల్లని కురులు చీకటిని తలపిస్తూ చెలరేగుతున్నాయి. నునువైన శరీరంతో, తీర్చిదిద్దినట్లున్న ఒంపుసొంపులతో, దేవాలయ గోడల మీద ఉన్న శిల్పసుందరి, ప్రాణం పోసుకు వచ్చినట్లుంది. కార్పటికుడామెని చూడగానే ప్రేమలో పడి పోయాడు.
కాస్సేపలా ఆమెనే చూస్తూ నిలబడి పోయాడు. అది గమనించి, ఆమె చెలికత్తెలలో ఒకతె... అతడి దగ్గరి కొచ్చి ‘ఏమిటన్నట్లు’గా చూసింది. మరొకామె ‘ఇక దయచెయ్’ అన్నట్లుగా సైగ చేసింది. అతడు వాళ్ళద్దరినీ ప్రాధేయపడుతూ... తనకు వారి యజమానురాలిపై గల ప్రేమను వివరించి, తన ప్రేమ సందేశాన్ని ఆమె కందించమని ప్రార్ధించాడు.
ఏమనుకున్నారో ఏమో, ఆ
చెలికత్తెలిద్దరూ ఆమె దగ్గరికి వెళ్ళి, అతడి గురించి చెప్పారు. ఊపిరి బిగబట్టి అదంతా చూస్తున్నాడు కార్పటికుడు. ఆమె ఓ క్షణం అతడి వైపు తదేకంగా చూసింది. వీణ మీటినట్లున్న స్వరంతో "వెళ్ళి, ఆలయ ఆవరణలో ఉన్న బావిలో స్నానం చేసి రా!" అంది.
కార్పటికుడు ఆ దిగుడు బావిలోకి దిగి, స్నానం చేద్దామని బుడుంగున మునిగాడు. ఒక్క మునక వేసి పైకి తేలి చూస్తే... ఆశ్చర్యం! అతడు తన ఊరైన బ్రహ్మపురంలో రాజ ప్రసాదానికి ఎదురుగా నిలబడి ఉన్నాడు.
~~
🙏💐🙏💐🙏💐🙏
చెలికత్తెలిద్దరూ ఆమె దగ్గరికి వెళ్ళి, అతడి గురించి చెప్పారు. ఊపిరి బిగబట్టి అదంతా చూస్తున్నాడు కార్పటికుడు. ఆమె ఓ క్షణం అతడి వైపు తదేకంగా చూసింది. వీణ మీటినట్లున్న స్వరంతో "వెళ్ళి, ఆలయ ఆవరణలో ఉన్న బావిలో స్నానం చేసి రా!" అంది.
కార్పటికుడు ఆ దిగుడు బావిలోకి దిగి, స్నానం చేద్దామని బుడుంగున మునిగాడు. ఒక్క మునక వేసి పైకి తేలి చూస్తే... ఆశ్చర్యం! అతడు తన ఊరైన బ్రహ్మపురంలో రాజ ప్రసాదానికి ఎదురుగా నిలబడి ఉన్నాడు.
~~
🙏💐🙏💐🙏
No comments:
Post a Comment