Tuesday, November 19, 2024

 *బుద్ధి*
🕊️

రచన : ఎ. ఎన్. జగన్నాధ శర్మ 


పూర్వం కాశీ రాజ్యంలో కుముదుడు, అమాయకుడు అని ఇద్దరు అన్నదమ్ము లు ఉండేవారు. కుముదుడు పెద్దవాడు, తెలివిగలవాడు. డబ్బుగలవాడు.

అమాయకుడు చిన్నవాడు. పేదవాడు. ఇద్దరూ వేరువేరుగా ఉంటూ ఒకే ఊరిలో జీవిస్తున్నారు. చుట్టుపక్కల జరిగే సంతలకీ, పెళ్ళిళ్ళకీ మాత్రం కలసి వెళ్ళడాన్ని అలవాటు చేసుకున్నారు. అమాయకుడు ఆడ గుర్రం మీద ప్రయాణిస్తే, మగ గుర్రం మీద కుముదుడు ప్రయాణిస్తాడు.

ఒక రోజు అన్నదమ్ములిద్దరూ పక్క ఊరిలో సంతకి వెళ్ళి వస్తూండగా చీకటి పడింది. రాత్రి అయింది. రాత్రి ప్రయాణం మంచిది కాదనుకుని, ఇద్దరూ ఒక చోట ఆగిపోయారు. ఆ రాత్రి అక్కడే బస చేయడం శ్రేయస్కరం అనుకున్నారు. గుడిసె బయట గుర్రాలను కట్టి వేశారు. వాటికి మేత పెట్టి, వెళ్ళి గుడిసె లోపల నిద్రపోయారిద్దరూ.

తెల్లారింది.

లేచి చూస్తే గుడిసె బయట రెండు గుర్రాలు కాదు, మూడు గుర్రాలు కనిపించాయి వారికి. మూడోది గుర్రప్పిల్ల. ఏ రాత్రి పుట్టిందో ఏమో! కింద తడుము కొనిపోతోంది. లేచి నిలబడే ప్రయత్నం చేస్తూ, ఫలించక పడిపోతోంది. అయినా పట్టు వీడలేదు. నేల మీద కాళ్ళను నిల దొక్కుకుని లేచి నిలబడింది. తల్లి గుర్రం దగ్గరకు వెళ్ళి, కడుపారా పాలు తాగింది. శక్తి సంతరించుకుందేమో! మెల్లగా నడచి వెళ్ళి, మగ గుర్రం దగ్గర నిలుచుంది. తన పక్కన నిల్చున్న పిల్లను చూసి, మగ గుర్రం ఆనందంగా పెద్దగా సకిలించింది. 

గుర్రప్పిల్ల ముద్దుగా బాగుంది. పెరిగి పెద్దయితే అద్భుతంగా ఉంటుందనుకు న్నాడు కుముదుడు. ఎలాగైనా సరే దాన్ని కాజేయాలనుకున్నాడు. ఎప్పుడైతే పిల్ల వెళ్ళి మగగుర్రం పక్కన నిలుచుందో అప్పుడు, ఆ పిల్ల తనదన్నాడతను. తన గుర్రానికే ఆ పిల్ల పుట్టిందన్నాడు.

"అదెలా సాధ్యం అన్నయ్యా? మగ గుర్రానికి పిల్ల పుడుతుందా చెప్పు? అది నా గుర్రానికి పుట్టిన పిల్ల. అది నాది, నీది కాదు" అన్నాడు అమాయకుడు.

"నాదే! నా గుర్రానికి పుట్టిందే ఆ పిల్ల, కావాలంటే చూడు, నా గుర్రానికి ఉన్నట్టు గానే, ఆ పిల్లకి కూడా చెవి దగ్గర నల్లటి మచ్చ ఉంది" అన్నాడు కుముదుడు.

"మచ్చ ఉన్నంత మాత్రాన, మగ గుర్రానికి ఆ పిల్ల పుట్టిందంటే నవ్విపోతారెవరైనా. "

"ఎవరు నవ్విపోతే నాకేమిటి? అది నా గుర్రానికి పుట్టిందే, అందులో అనుమానం లేదు. లేకపోతే ఆ పిల్ల, నా గుర్రం దగ్గరకు వెళ్ళి ఎందుకు నిలుచుంటుంది? అడిగాడు కుముదుడు.

సమాధానం ఏం చెప్పాలో తెలియలేదు అమాయకుడికి, తెల్లమొహం వేసి అన్నని చూడసాగాడు. అదే అవకాశంగా ఆ గుర్రప్పిల్ల తనదంటూ తగాదాకి దిగాడు కుముదుడు.

"కావాలంటే ఊరికి పద, అక్కడి పెద్దలని అడిగి తేల్చుకుందాం" అన్నాడు. ఆ మాటకి భయపడి, తమ్ముడు గుర్రప్పిల్ల ను వదలి వేస్తాడనుకున్నాడు. కాని, అమాయకుడు భయపడలేదు. పదంటే పదమన్నాడు.

ఇద్దరూ ఊరికి చేరుకున్నారు. న్యాయ మూర్తులను కలిశారు. జరిగిందంతా వారికి వివరించారు. తమకి న్యాయం కావాలన్నారు. విని ఊరుకున్నారేగాని, న్యాయాన్ని తేల్చలేదు న్యాయమూర్తులు దానికి కారణం, ఆ రోజు సోమవారం. సోమవారం నాడు న్యాయాన్ని మహా రాజు అనంతభూపాలుడు నిర్ణయిస్తాడు. న్యాయమూర్తులు నిర్ణయించకూడదు. పరమ శివభక్తుడు రాజు. ఆ కారణంగా సోమవారం నాటి తగాదాలను అతనే తీర్చడం ఆనవాయితీ.

"మీరిద్దరూ రాజాస్థానానికి నడవండి" అన్నారు న్యాయమూర్తులు. నడిచారు. కొలువుదీరిన రాజు ముందు అన్నదమ్ము లిద్దరూ నిల్చున్నారు. చేతులు జోడించి మహారాజుకి నమస్కరించారు. తగాదాను వివరించారు.

"మగ గుర్రానికి పిల్లలు పుడతారా మహా రాజా?" ప్రశ్నించాడు అమాయకుడు. మాట తీరు తెలీదు అమాయకుడికి. "మగ గుర్రానికి పిల్లలు పుట్టే అవకాశం లేదు కదా మహారాజా? తమరికి తెలియనిది ఏమున్నది? మీకు సర్వం తెలుసు" అని అభ్యర్ధనగా చెప్పక, తనని ప్రశ్నించడాన్ని తట్టుకోలేక పోయాడు. రాజు. పైగా మాట్లాడుతున్నప్పుడు రెండు సార్లు రాజుకి కన్ను గీటాడు అమాయకు డు. దానిని అస్సలు భరించలేకపోయాడు రాజు. నిజానికి అమాయకుడు రాజుకి కన్ను గీటలేదు. ఈగలాంటిది ఏదో పదే పదే కన్రెప్ప మీద వాలడంతో, దానిని విది ల్చేందుకు రెప్పను అలా కొట్టాడు అమాయకుడు. దానిని గ్రహించలేక పోయాడు రాజు. అమాయకుడి మీద కళ్ళమొయ్యా కోపాన్ని తెచ్చుకున్నాడు.

మగ గుర్రానికి పిల్లలు పుట్టవు. రాజుకి ఆ సంగతి తెలుసు. తెలిసి, పేదవాడు, పైగా పేరుకు తగ్గట్టుగా ఉన్న అమాయకుడికే గుర్రప్పిల్లను ఇప్పిద్దామనుకున్నాడు రాజు. పెద్దవాణ్ణి శిక్షిద్దామనుకున్నాడు. న్యాయ నిర్ణయాన్ని ప్రకటిద్దామని కూడా అనుకున్నాడు. అనుకున్నంతలో అమాయకుడి ప్రవర్తన అతన్ని కకావికలు చేసింది. దాంతో ఇలా అన్నాడు రాజు.

"గుర్రప్పిల్ల ఎవరిది అన్న సంగతి తేల్చడం అంత సులభం కాదు. ఇది చాలా క్లిష్టమైన సమస్య న్యాయనిర్ణయాన్ని వారం పాటు వాయిదా వేస్తున్నాం. మళ్ళీ సోమవారం రండి, అప్పుడు తేలుద్దాం."

"అలాగే మహారాజా" అని చేతులు జోడించాడు కుముదుడు. వినయం నటించాడు. అమాయకుడికి ఏదీ అంతు చిక్కలేదు. అయోమయంగా చూడసాగాడతను.

మహారాజుకి పొడుపు కథలు, కొంటె ప్రశ్నలు అడగడం ఇష్టం, వాటితో కొలువు రక్తి కడుతుందంటాడతను. అలాగే వాటితో నిజానిజాలు కూడ రాబట్టవచ్చు అంటాడు. ఆ ఆలోచనతోనే అన్నాడిలా.

"నేను నాలుగు ప్రశ్నలు అడుగుతాను. జవాబులు ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ సోమవారం చెబితే చాలు. నా ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పగలిగేవారిదే గుర్రప్పిల్ల.”

"అడగండి మహారాజా! అప్పుడైనా నా నిజాయితీ బయటపడుతుంది" అన్నాడు కుముదుడు. ధైర్యాన్ని కనబరిచాడు.

"అయితే వినండి.

ఒకటవ ప్రశ్న: ప్రపంచంలో అతి వేగవంతం అయినదేది?

రెండవ ప్రశ్న: బాగా కొవ్వు కలిగినదేది?

మూడవ ప్రశ్న: సుతిమెత్తనిదేది?

నాలుగవ ప్రశ్న: అమూల్యమైనదేది?"

"బాగున్నాయి మహారాజా! ప్రశ్నలు అద్భుతంగా ఉన్నాయి" అన్నారు సభ లోని వారంతా. 

"ఈ నాలుగు ప్రశ్నలకీ నాకు సరైన సమాధానాలు సోమవారం వచ్చి చెప్పండి. చెప్పిన వారిదే గుర్రప్పిల్ల" అన్నాడు రాజు. కొలువు చాలించాడు.

ఇంటికి చేరిన దగ్గర నుంచీ రాజుగారి ప్రశ్నలకు సరైన సమాధానాలను ఆలోచించసాగాడు కుముదుడు. సరైన సమాధానాలు చెప్పగలిగితే గుర్రప్పిల్ల తనదవుతుంది. లేదంటే ముద్దులు మూటగట్టే ముచ్చటైన పిల్ల తనది కాకుండాపోతుంది. తీవ్రంగా ఆలోచిస్తూ భార్య రావడాన్ని కూడా గమనించలేదు కుముదుడు.

"ఏంటండీ, అంత తీవ్రంగా ఆలోచిస్తున్నా రు?" అడిగింది భార్య. భుజం మీద చేయి వేసి, కుదిపిందతన్ని. దాంతో అతడు తేరుకున్నాడు. కుముదుడు రాజుగారి ప్రశ్నలు చెప్పాడామెకు. సమాధానాలు కావాలన్నాడు.

"వాటికి ఇంతగా ఆలోచించాలా? చూడండి ఎలా చెబుతానో" అన్నదామె.

"చెప్పు చెప్పు."

"ప్రపంచంలో అతి వేగవంతం అయింది, మన గుర్రమే! మొన్న మా పుట్టింటికి దాని మీదే నన్ను తీసుకెళ్ళారుగా, అప్పుడు చూశాను దాని వేగం. చాలా వేగంగా పరిగెడుతుందది. ఇక బాగా కొవ్వు కలిగినది, పక్కింటివాళ్ళ పంది. చూస్తూంటారుగా, తెగ బలిసి తిరుగుతూ ఉంటుంది. సుతిమెత్తనిది, మన పట్టు పరుపు. అమూల్యమైనది, మన రెండేళ్ళ పాప. దాని ముందు ఈ ప్రపంచం అంతా దిగదుడుపే" అంది.

"అవునవును" అని సంబరపడ్డాడు కుముదుడు. భార్య తెలివితేటలను మెచ్చుకున్నాడు. రాజుగారు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు తనకి తెలిసిపోయాయి. గుర్రప్పిల్ల తనదే అనుకున్నాడు అతను. హాయిగా నిద్రపోయాడు.

అమాయకుడికి నిద్రలేదు. ఆలోచిస్తూ కూర్చున్నాడు. రాజుగారి ఏ ఒక్క ప్రశ్నకీ సరైన సమాధానం తట్టడం లేదతనికి. తన గుర్రప్పిల్ల తనకి కాకుండాపోతోంది. తెలివిగా అన్నయ్య దానిని సొంతం చేసుకోబోతున్నాడు. ఏం చేస్తాం, అంతా కర్మ అనుకున్నాడు. ఏడాది క్రితం భార్య చనిపోయింది. ఇప్పుడు గుర్రప్పిల్ల పోతోంది. ఇష్టమైనవేవీ ఇంట్లో ఉండడం లేదనుకున్నాడు. కళ్ళు చెమర్చుకున్నాడ తను. అమాయకుడు అలా కళ్ళు చెమర్చుకోవడాన్ని అతని ఏడేళ్ళ కూతురు బుద్ధి చూసింది.

"ఎందుకు నాన్నా ఏడుస్తున్నావు?" అని అడిగింది.

జరిగిందంతా చెప్పుకొచ్చాడు అమాయకుడు.

"రాజుగారి ప్రశ్నలకు జవాబులు ఏం చెప్పాలో తెలియడంలేదమ్మా" అన్నాడు.

"నేను చెబుతాను, నేను చెప్పిన జవాబులనే రాజుగారికి చెప్పు. గుర్రప్పిల్ల మనది అవుతుంది" అన్నది బుద్ధి.

"అంతకంటేనా, చెప్పు తల్లీ." కన్నీరు తుడుచుకున్నాడు అమాయకుడు. బుద్ధి చెప్పసాగిందిలా.

"ప్రపంచంలో అతి వేగవంతం అయినది, శీతకాలంలో ఉత్తరదిక్కు నుంచి వీచే గాలి. బాగా కొవ్వు కలిగినది, ఈ రాజ్యం నేల. ఈ నేల సుక్షేత్రం కాబట్టే ఇక్కడ పాడిపంటలకు కొదవలేకుండా ఉంది. సుతిమెత్తనిది, పసిపాప లాలన. అమూల్యమైనది నిజాయితీ, అదే చిత్తశుద్ది." 

గిర్రున రోజులు తిరిగిపోయాయి. సోమవారం వచ్చింది. కుముదుడు, అమాయకుడు రాజుగారి కొలువుకి చేరుకున్నారు. చేతులు కట్టుకుని రాజుగారి ముందు నిల్చున్నారు.

“ఒకరి తర్వాత ఒకరిగా మీరు తెలుసుకున్న సమాధానాలు చెప్పండి." ఆదేశించాడు రాజు. ముందుగా కుముదుడు చెప్పాడు. అతను చెప్పిన సమాధానాలకు కొలువంతా పగలబడి నవ్వింది. ఇక అమాయకుడు చెప్పే సమాధానాలు ఇంకెంత హాస్యంగా ఉంటాయో! వినేందుకు ఉవ్విళ్ళూరారు అంతా. ఒకటి తర్వాత ఒకటిగా అతను చెప్పే సమాధానాలు విని, నవ్వలేదు సరికదా, ఆశ్చర్యపోయారంతా. ఆఖరి సమాధానం, అమూల్యమైనది ఏదంటే నిజాయితీ, అదే చిత్తశుద్ధి అని చెప్పడం తో తనలో అది కొరవడినట్టుగా, ఆ కొరవడిన దానిని వేలెత్తి చూపించినట్టుగా అనిపించడంతో కోపగించుకున్నాడు రాజు. 

గుర్రప్పిల్ల ముమ్మాటికీ అమాయకుడిదే! వాడి గుర్రప్పిల్ల వాడికి ఇవ్వక, ఇలా ఆట లాడడం బాగులేదన్నట్టుగా రాజుని నిలదీస్తున్నట్టుగా కూడా అనిపించింది ఆఖరి సమాధానం. దాంతో రాజు భగభగ మండిపోయాడు. అయితే తన కోపతాపా లేవీ మంత్రి సామంతులు, న్యాయమూర్తు ల ముందు ప్రదర్శించలేదు రాజు. తనలో అణచుకున్నాడు. అమాయకుణ్ణి ఇలా అడిగాడు. 

"నిజం చెప్పు, ఈ సమాధానాలు నీకు ఎవరు చెప్పారు?"

"మా అమ్మాయి చెప్పింది. దానికి ఏడేళ్ళు  పేరు బుద్ధి" అన్నాడు అమాయకుడు. 

"ఏడేళ్ళ పిల్లకి ఇన్ని తెలివితేటలా?" ఆశ్చర్యపోయాడు రాజు. కోపం పోయి ఆనందం కలిగిందతనికి.

"ఇన్ని తెలివితేటలు గల కూతురిని కలిగినందుకు నిన్ను తప్పకుండా అభినందించాలి. సత్కరించాలి కూడా. మీ అన్నయ్య ఓడిపోయాడు. గుర్రప్పిల్ల నీదే! గుర్రప్పిల్లతో పాటు వంద బంగారు వరహాలు కూడా నీకు బహుమతిగా ఇస్తున్నాను. అయితే.." ఆగాడు రాజు. చెప్పండి అన్నట్టుగా చూశాడు అమాయకుడు.

"నీ గుర్రప్పిల్లనీ, బహుమతిగా నేనిచ్చే వంద బంగారు వరహాలనూ తీసుకోవాలి అంటే, నీ కూతురు బుద్ధి, వచ్చే సోమవారం ఈ కొలువుకి రావాలి. ఎలా రావాలో తెలుసా?"

"ఎలా రావాలి మహారాజా?"

"నీ కూతురు బాగా తెలివైంది కదా, నా కొలువుకి తను ఎలా రావాలంటే... దుస్తులు ధరించి రాకూడదు. అలాగని నగ్నంగా రాకూడదు. నడచి రాకూడదు. గుర్రమ్మీద రాకూడదు. కాని ఇక్కడికి రావాలి, ఉత్త చేతుల్తో రాకూడదు. అలాగని చేతిలో నా కోసం ఏ బహుమతీ లేకుండా రాకూడదు. అలా వస్తేనే నీకు నీ గుర్ర ప్పిల్లతో పాటు, నేను బహుమానం గా ఇస్తానన్న వంద వరహాలూ నీ సొంతం అవుతాయి. లేని పక్షంలో, నేను చెప్పిన ట్టుగా నీ కూతురు నా కొలువుకి రాని పక్షంలో నీ తల తీసి, కోట గుమ్మానికి వేలాడదీస్తాను" అన్నాడు రాజు.

మంచి పని అయింది. తమ్ముడుకి తగిన శిక్ష పడిందనుకుని ఆనందించాడు కుముదుడు. అది గమనించాడు రాజు. అబద్దం ఆడి తమ్ముడి గుర్రాన్ని కాజేయాలనుకున్న అతన్ని శిక్షించక తప్పదు అనుకున్నాడు. వేయి కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు. కుముదుణ్ణి కొట్టి హింసించేందుకు అతన్ని కారాగారా నికి తోడుకునిపోయారు రాజభటులు.

గుర్రప్పిల్లను అన్నయ్యకి ఇస్తే పోయేది, వాడికి దెబ్బలు, తనకి ఈ తిప్పలూ తప్పేవనుకున్నాడు అమాయకుడు. ఇంటికి చేరుకున్నాడు. కొలువులో జరిగిందంతా కూతురుకి చెప్పాడు.

"ఇన్ని అవస్థలు పడి కొలువుకి ఎలా వస్తావమ్మా? రాలేవు. వద్దు, రాకు. మీ అమ్మతో పాటు నేనూ పోయాననుకో" అన్నాడు అమాయకుడు. తలపట్టుకుని కూర్చున్నాడు.

"భయపడకు నాన్నా! మనకి అంతా మంచే జరుగుతుంది" అంది బుద్ధి. మళ్ళీ సాలోచనగా ఇలా అంది.

"ముందుగా రేపు నువ్వో పని చెయ్యి, ఒక కుందేలునీ, ఒక పావురాన్నీ పట్టుకుని రా.” అంది. 

"అవెందుకు తల్లీ?"

"పట్టుకు రా నాన్నా, చెబుతాగా" అంది.

మర్నాడు కూతురు చెప్పినట్టుగానే అమాయకుడు ఓ కుందేలునీ, పావురాన్నీ పట్టుకుని వచ్చాడు. బుద్ధికి ఇచ్చాడు. ఇచ్చి, సోమవారం రాకూడదు. రాకుండా చెయ్యమని వేయి దేవుళ్ళకు మొర పెట్టుకున్నాడు. అతని మొర ఏ దేవుడూ వినిపించుకోలేదు. మొరపెట్టు కున్నంత సేపు పట్టలేదు. సోమవారం వచ్చేసింది. 

రాజు కొలువుదీరాడు. అమాయకుడి కోసం, అతని కూతురు బుద్ధి కోసం నిరీక్షించసాగాడు. అమాయకుడు ఏం వస్తాడు? రాడుగాక రాడు. కూతురు సహా రాజ్యం వదలి పారిపోయి ఉంటాడు అనుకున్నారు సభలోని వారంతా. అంతలో కూతురిని వెంటబెట్టుకుని అమాయకుడు రానేవచ్చాడక్కడికి. బుద్ధి నగ్నంగా లేదు. అలాగని దుస్తులు ధరించి లేదు. శరీరం చుట్టూ చేపల్ని పట్టే వలను చుట్టుకుని వచ్చిందక్కడికి. అలాగే నడచి రాలేదు. గుర్రం మీద కూడా రాలేదు. కుందేలు మీద కూర్చుని వచ్చింది. చూసి ఆశ్చర్యపోయారంతా. రాజు కూడా విస్తుపోయి చూడసాగాడు ఆ పిల్లను.

"ఉత్త చేతుల్తో రాకూడదన్నాను. అలాగని నా కోసం ఏ బహుమతీ లేకుండా రాకూడ దన్నాను. దాని సంగతి ఏం చేశావు?" అడిగాడు రాజు. కళ్ళు పెద్దవి చేసి బుద్ధిని పరీక్షించసాగాడు.

"ఇవి ఉత్త చేతులు కావు మహారాజా" అంది బుద్ధి. చేతులు విప్పి, పావురాన్ని చూపించింది.

"ఇది మీ కోసమే! మేము మీకు ఇచ్చే బహుమతి ఇదే! తీసుకోండి" అంది. పావురాన్ని వదిలింది. పావురాన్ని అందుకుని, బుద్ధికి తగిన బుద్ధి చెబుదామని చాలా ప్రయత్నించాడు రాజు. కొలువులో చిన్నపిల్లాడిలా ఎగురుతున్న పావురం కోసం పరుగు దీశాడు. అందలేదది. కొలువు వెలుపలికి పారిపోయి, ఆకాశానికి చేరిపోయింది.

రాజు ఆదేశించినట్టుగానే ప్రవర్తించింది బుద్ధి. మాట ప్రకారం, గుర్రప్పిల్లనూ, బహుమతిగా వరహాలనూ అమాయకుడి కి బహూకరించాలి రాజు. అయినా బహూకరించలేదతను. పైగా బుద్ధిని ఇలా ప్రశ్నించాడు.

"ఈ గుర్రప్పిల్ల లేకపోతే మీ నాన్న బతకలేడా? ఈ పిల్ల మీకు అంత అవసరమా? మీరు అంత పేదవారా?"

"అవును మహారాజా! మేము చాలా పేదవాళ్ళం. మాకు ఆ గుర్రప్పిల్ల చాలా అవసరం. ఆ గుర్రప్పిల్లతో మా నాన్న నీటిలో కుందేళ్ళను పడతాడు. చెట్ల మీద చేపల్ని పడతాడు" అంది బుద్ధి. 

"నీటిలో కుందేళ్ళా? చెట్ల మీద చేపలా? ఇదెక్కడి చోద్యం?" పగలబడి నవ్వాడు రాజు. అతనితో పాటు సభలోని వారు కూడా పెద్దగా నవ్వారు.

"నీటిలో కుందేళ్ళుంటాయా? చెట్ల మీద చేపలు ఉంటాయా? తెలివితక్కువగా మాట్లాడకు.” కసిరాడు రాజు.

"మగ గుర్రానికి పిల్లలు పుట్టే ఈ రాజ్యం లో, అది కొలువులో కూడా చర్చించేంత గా ప్రచారమైన ఈ రాజ్యంలో ఏదైనా సహజమే మహారాజా! మీకు తెలియనిది ఏముంది?" అంది బుద్ధి. 

చావు దెబ్బ చల్లగా కొట్టింది. ఆ దెబ్బకి మురిసిపోయాడు మహారాజు. బుద్ధిని అభినందిస్తూ కరతాళ ధ్వనులు చేశాడు. లేచి నిల్చున్నాడు. గుర్రప్పిల్లనూ, వంద బంగారు వరహాలనూ అమాయకుడికి అందజేశాడు. బుద్ధిని దగ్గరగా తీసుకుని, ఆ పిల్ల నుదుటన ముద్దుపెట్టాడు. గర్వంగా ఇలా ప్రకటించాడు.

"ఒక్క నా రాజ్యంలో తప్ప మరే రాజ్యం లోనూ ఇన్ని తెలివితేటలు గల పిల్లలు పుట్టరు, పుట్టబోరు. అమాయకుడికి నా కొలువులో అతడు చేయగలిగే ఉద్యోగం చూసి ఇస్తాను.” అని ప్రకటించాడు.
🐰
*సమాప్తం* 
 ꧁☆•┉┅━•••❀❀•••━┅

No comments:

Post a Comment