Sunday, November 3, 2024


 
ఇప్పుడే అగ్రస్థాయి అమ్మకాలలో సంచలనం కలిగించిన తెలుగు పుస్తకం రవి మంత్రి రాసిన పుస్తకం "అమ్మ డైరీలో కొన్నిపేజీలు" అమెజాన్ లో కొనుక్కుని చదవటం పూర్తి చేసాను. బాగుంది.
"పితా రక్షతి కౌమారే
 భర్తా రక్షతి యౌవనే
 పుత్రా రక్షతి వార్ధక్యే!
 నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి! అన్న
మనుస్మ్రతి ని అనుసరించే ఎందరో మగవారిలాగే  
తండ్రిలేని  పిల్లలకి అందంగా ఏక్టివ్ గా ఆరోగ్యంగా ఉన్న తల్లిఉంటే గర్వమే!  కాని ఆ తల్లి మనసులో తండ్రి కాకుండా మరెవరున్నా భరించలేనితనం అతి సహజం! 

తండ్రిలోని ఎన్ని అవలక్షణాలున్నా పిల్లలు స్వీకరించగలరు కాని తల్లిలో  పవిత్రత ఏమాత్రం తగ్గినా భరించలేనితనం జిత్తూ  ద్వారా  అవగతమౌతుంది. 

అలాంటి  జిత్తూ తల్లి గురించి,  తండ్రి గతం తెలిసిన గీత తన తండ్రి గురించి ఒక తల్లిలా,  జిత్తూ ఒక తండ్రిలా తల్లి గురించి  ఆలోచించి, తల్లి తండ్రుల జీవితాన్ని ఆనందప్రాయంగా మార్చాలనుకోవడం ఈ తరం విశాల దృక్పథానికి అద్దంపడుతుంది.

కొడుకు మనసులోని బాధ అర్ధమైన సారిక ఎటువంటి వ్యామోహం లేకుండా మానసిక పరిణతితో  ప్రశాంతంగా ఒక తల్లిలానే ఉండటం అతి సహజం!   ఇటువంటి సంఘటనలు నాకు తెలిసి  కొన్ని చోట్ల జరిగాయి కూడా! 

ఇలా పైకి వ్యక్తపరచలేని అనుభూతులని చివరంటా ఇస్తూ, ప్రేమ ఇచ్చే మధురానుభూతులు, వియోగం కల్గించే విషాదాన్ని చదువరుల మనసులో నాటుతో రాసిన ఉదాత్తమైన కథనం ఆపకుండా చదివిస్తుంది.
పెళ్లి మంత్రాలలోని అర్ధాలు విడమరిచి చెప్పడం, చరిత్రలో నిలిచిపోయిన ఒక దుర్ఘటనను కథకు వాడుకున్న విథానం సూపర్! అలాగే కథనడిచిన కాలాన్ని లెక్క తప్పకుండా కోట్ చేయడం, చూస్తే అలవోకగా కాకుండా కష్టపడి అర్ధవంతంగా 
 రాసారు అని అవగతమౌతుంది.
బుక్ కొనుక్కుని చదివిన ప్రతీవారికి "పైసావసూల్" అనిపిస్తుంది.

 అలాగే విదేశాలలో ఉన్న ఒక తెలుగు యువకుడు ఈ పుస్తకం రాయడం కాస్త ఆశ్చర్యం కలుగుతుంది. అందరూ చదవాలి కాబట్టి, ఇంతకంటే చెప్పకూడదు.
 'బాగున్నది ఏదైనా, ఎవరికి వారు ఆస్వాదిస్తేనే బాగుంటుంది. యువరచయిత రవిమంత్రి కి అభినందనలు, ఆశీస్సులు

No comments:

Post a Comment