[11/3, 09:18] +91 73963 92086: శివ గురునాథ ధర్మ వనం (SGD Vanam):
అరుణాచలా!!!!
జై శ్రీగురుదత్తా!!!!!
త్రిపురారహస్యసారమున - జ్ఞానఖండము - పదునేడవయధ్యాయము - సమాదిస్థితివివరణము
జనకుఁడు చెప్పినది విని అష్టావక్రుఁడు మరల ఇట్లు అడిగెను. ''మహారాజా! వవ్యహార దశల యందును నిర్వికల్పములు చిదాత్మకములును అయిన సమాధి స్థితులు సూక్ష్మమములుగా నుండు నని చెప్పితివి. అవి ఏ దశల యందు సంభవించునో స్పష్టముగా చెప్పుము.''
జనకుఁడు ఇట్లు చెప్పెను. ''ప్రియురాలి చేత మొదట గాఢముగా కౌఁగిలింప బడినప్పుడు పురుషుండు క్షణకాలము వెలుపల లోపల ఏ విషయమును ఎఱుంగక నిద్రను పొందక నిశ్చలత నొందును. అది సమాధియే. అలభ్య మనుకొన్న వస్తువు అనుకొనకుండ లభించినప్పుడు నిద్ర లేకయే క్షణకాలము మనస్సునకు నిశ్చలత కలుగుచున్నది. అదియు సమాధియే. నిర్బయుఁడై సంతోషముతో ఎక్కడికో పోవుచున్న వానికి ఆకస్మికముగా మృత్యువు వలె వ్యాఘ్రమో కాలసర్పమో ఎదురైనచో క్షణకాలము మనస్సు నిశ్చలమగును. అది సమాధియే. ఆరోగ్యవంతుఁడు కుటుంబ భరణ దక్షుఁడు అత్యంత ప్రియుఁడును అయిన కుమారుఁడు మృతి నొందె నని విన్నప్పుడు తండ్రికి వెలుపల లోపల ఏదియు తోఁచక మనస్సు క్షణము నిశ్చల మగును. అదియును సమాధియే. అనఁగా మహా సుఖము మహా భయము మహా దుఃఖము ఆకస్మికముగా సంభవించిన క్షణము నందు మనస్సు విమర్శను కోల్పోయి స్వరూప స్థితిని పొందును. ఇవి యన్నియు క్షణికములైన సమాధులు. ఇట్లే జాగ్రద్దశ నుండి నిద్రలోనికి జాఱునపుడు, నిద్రలో స్వప్నము ఆరంభమగునపుడు, స్వప్నము ముగిసి నిద్ర పైకి వచ్చునప్పుడు, నిద్ర ముగిసి జాగ్రద్దశలోనికి వచ్చునప్పుడు క్షణకాలము మనస్సు దేనిని గ్రహింపక విమర్శ రహితమై సమాధిస్థితి నొందును. దూరమునందున్న ఏదేని ఒక పదార్థమును ఏకాగ్రమగు బుద్ధితో చూచుచున్నప్పుడు మనస్సు దీర్ఘమై దేహము నందు దేహ రూపముగా ఆ పదార్థము నందు ఆ పదార్థ రూపముగా ప్రసరించును. దేహమునకు ఆ పదార్థమునకు నడుమ పెద్ద త్రాడువలె ప్రసరించియున్న మనస్సు ఏ రూపమును పొందక నిర్వికల్పముగా నుండును. ఆ విధముగా కేవలమైన మనస్సును (Pure mind) చూచుచుందుము.
ఇంత ఎందుకు? ఒక మాట వినుము. ఈ వ్యవహారమంతయు భిన్నములైన ఖండ జ్ఞానముల (Pieces of knowledge) సముదాయముగా జరుగుచున్నది. చెట్టునందు ఒక ఖండజ్ఞానము, పండు నందు మఱియొక ఖండజ్ఞానము కలుగును. ఈ ఖండ జ్ఞానములన్నియు తరంగముల వంటివి. తరంగములకు లోపలనున్న అఖండమైన జలమువలె వివిధ ఖండజ్ఞానములకు ఆధారముగానున్న యేకరూపమైన జ్ఞానము వ్యవహారము నందు ఎవరికిని స్ఫురింపదు. ఈ కారణము చేతనే క్షణక్షణమునకు మాఱుచున్న జ్ఞానప్రవాహము (Flow of knowledge) ఆత్మ అని కొందఱు, అట్టి జ్ఞానప్రవాహము ఆత్మకు ధర్మమైన బుద్ది యని మఱికొందరు ఆచార్యులు చెప్పుచున్నారు. ఆక్షణిక జ్ఞానముల ప్రవాహములో ఒక క్షణిక జ్ఞానమునకు మఱియొక క్షణిక జ్ఞానమునకు మధ్యలో మనస్సునకు నిర్వికల్ప దశ ఉన్నది. కావున తెలిసికొనఁగలిగిన వానికి వ్యవహరము నందు కూడ ప్రతిక్షణము సమాధి యున్నది. ఇతరులకు అది కుందేటి కొమ్మువలె అసంభవముగానే తోఁచును.''
అది విని అష్టావక్రుఁడు మరల ఇట్లు అడిగెను. ''వ్యవహారము నందు ఉన్న వారికి కూడ సమాధి సంభవమైనచో సంసారము ఎట్లు జరుగచున్నది? సుషుప్తి యందు జడమైన అవ్యక్తము భాసించుచుండుట వలన ఆ దశ యందు కృతార్థత లేదు. కాని యిప్పుడు మీరు చెప్పుచున్న నిర్వికల్ప దశ సమాధియే కదా! అందు శుద్ధమైన చైతన్యమే భాసించుచుండును. ఆ చైతన్యము సకలమైన యజ్ఞానమును నశింపఁజేయును. అట్టి నిర్వికల్ప సమాధి కలిగినవానికి మరల సంసార మెట్లు సంభవించును.?''
జనకుఁడిట్లు చెప్పెను. ''ఈ సంసారము అనాదిగా సుఖ దుఃఖ ప్రవాహరూపమున మహాస్వప్నము వలె ఎల్లర చేతను అనుభవింపఁబడుచున్నది. దీనికి మూలమైన యజ్ఞానము జ్ఞానము చేతనే తొలఁగునని విద్వాంసుల చేత నిశ్చయింపఁబడినది. సవికల్ప జ్ఞానమే ఆయ జ్ఞానమును తొలఁగించును. నిర్వికల్ప జ్ఞానము వలన ఆ యజ్ఞానము నశింపదు. నిర్వికల్ప జ్ఞానము, చీఁకటికి వెలుఁగువలె, దేనికిని విరోధి కాదు. చిత్రవిచిత్రములైన బొమ్మలకు గోడ ఆధారముగా నున్నట్లు వికల్ప జ్ఞానములకు అన్నింటికిని నిర్వికల్ప జ్ఞానము ఆధారముగా నున్నది. ప్రతిబింబములు లేని యద్దమే కేవలమైన యద్దమైనట్లు, వికల్పము లేని జ్ఞానమే కేవల జ్ఞానము. దాని యందు ఎన్ని విధములైన వికల్పములు వస్తువుల వివిధత్వమును బట్టి భాసించుచున్నను అది ఏ వికల్పమును అడ్డగింపదు. అద్దము ఏ ప్రతిబింబమును అడ్డగింపదు కదా! సంసారమునకు మూలమైన యజ్ఞానము కూడ ఒక వికల్ప జ్ఞానమే. ప్రతిబింబమును అద్దము అడ్డగింపలేనట్లు కేవల జ్ఞానము కూడ తన యందు ప్రతిబింబించుచున్న యీ వికల్ప జ్ఞానమును అనఁగా అజ్ఞానమును అడ్డగింపదు. కావుల కేవల జ్ఞానము చేత అజ్ఞానము తొలఁగదు.
సంసారమూలమైన యజ్ఞానము కార్యకారణ రూపమున అనేక విధములుగా నున్నది. ఆత్మ యందు పూర్ణత్వము తోఁచకుండుట కారణమైన యజ్ఞానము. విభాగములు లేని యాత్మ పూర్ణమే అగును. అయినను కారణమైన యీ యజ్ఞానము ఆత్మ యందు పూర్ణత్వము తోఁచకుండఁజేసి, ఇక్కడ ఇప్పుడు నేను ఉన్నాను'' అను తలంపును కలింగిచుచు దేశము కాలము ఆకారము అను విభాగములను పుట్టించుచున్నది.
[11/3, 09:18] +91 73963 92086: ఈ యజ్ఞాన వృక్షమున చిగురుటాకుల వలె ''దేహము నేను'' అను భావము మొదలుగా సంసార మంతయు పెంపొందుచున్నది. మూలమైన యజ్ఞానము తొలఁగిననే తప్ప సంసారము తొలఁగదు. ''ఆత్మ పరిపూర్ణము'' అను విజ్ఞానము చేత తప్ప అజ్ఞానము తొలఁగదు. ఆ పూర్ణాత్మ యొక్క విజ్ఞానము పరోక్ష మని అపరోక్షమని రెండు విధములుగా నున్నది. గురు ముఖముగా శాస్త్రముల వలన కలుగుజ్ఞానము పరోక్షము. ఇది మోక్షమను పురుషార్థమునకు సాక్షాత్తుగా కారణము కాదు. గురువు వలన శాస్త్రము ననుసరించి పొందిన జ్ఞానము ''ఇది నిజమే'' అను విశ్వాసమాత్ర ముగనే యుండును; అనుభవమునకు రాదు. అందువలన అది మోక్ష రూపమైన ఫలమును కలిగింపదు. సమాధీ యొక్క పరిపాకమువలన కలుగునట్టి విజ్ఞానమును అపరోక్షజ్ఞాన మందురు. అదియే కార్యమైన (effect) ప్రపంచమును కారణమైన యజ్ఞానమును (Cause) నశింపఁజేసి మోక్ష ఫలమును ఇచ్చును.
గురు ముఖముగా శాస్త్రము వలన కలుగు పరోక్ష జ్ఞానము ముందుగా ఉండినప్పుడే సమాధి వలన విజ్ఞానము కలుగును. అందు వలన శాస్త్ర జ్ఞానము లేనివారికి సమాధి కలిగినను దాని వలన ప్రయోజనము లేదు. మాణిక్య మనఁగా ఎట్లుండునో తెలియని వాఁడు కోశాగారము నందు ఆ మణిని చూచుచున్నను ''ఇది మాణిక్యము'' అని గ్రహింపఁజాలఁడు. మణిని కూర్చి విని తెలిసికొన్న వాఁడు కూడ దానియందు దృష్టి యుంచి పరిశీలించినచో ''ఇది మాణిక్యము'' అని గ్రహింపఁగలఁడు. మణిజ్ఞానము నందు మఱియొకఁడు ఎంత నిపుణుఁడైనను దాని యందు దృష్టిని నిలుపకున్నచో అది మణియని గ్రహింపఁజాలఁడు. కావున విజ్ఞానమునకు ఫలముగా లభించునట్టి దానిని మూఢుఁడు అజ్ఞానము వలన పోందఁజాలఁడు. పండితులు విజ్ఞానవంతులైనను దాని యందు దృష్టినుంచని కారణము చేత ఆఫలమును పొందఁజాలరు. శుక్రనక్షత్రమును గూర్చి తెలియనివాఁడు ఆ తారను ఎన్ని దినములుగా చూచుచున్నను ''ఇది శుక్రతార'' అని గ్రహింపఁజాలఁడు. మఱియొకఁడు దానిని గూర్చి వినియున్నను దాని యందు దృష్ఠి నుంచక పోయినచో దానిని గ్రహింపఁజాలఁడు. ఆ శుక్రతార ఏ దిక్కులో ఎచ్చట ఏయాకారణముతో నుండునో తెలిసికొన్న తరువాత శ్రద్ధతో ''నేను దీనిని తెలిసికోవలె'' అని నిశ్చయించి ఏకాగ్రతతో ఎవఁడు పరిశీలించునో అట్టి బుద్ధి శాలియే దానిని ''ఇది శుక్రతార'' అని గుర్తింపగలఁడు. కావున అజ్ఞానము చేత మూఢులు, శ్రద్ధలేక పోవుటచే పండితులును సమాధి దశలను పొందుచుండియు ఆ దశలలో ఆత్మను గుర్తింపలేకున్నారు. పెరటిలో నిధి యున్నను దానిని గుర్తింపలేక భిక్షాటనము చేయుచుండు దౌర్భాగ్యుల వలె ఇట్టి వారందఱును సమాధిస్థితులను కలిగియుండియు వాని వలన ప్రయోజనమును పొందలేకున్నారు. ఈ కారణము చేతనే శిశువులకు అజ్ఞానము తొలఁగక పోవుట వలన ఎల్లప్పుడు నిర్వికల్ప స్థితియున్నను వారికి దాని వలన కలుగ వలసిన ఫలము కలుగుట లేదు.
కాఁబట్టి ''ఆత్మ ఇట్టిది'' అని దానిని గుర్తింపఁజేయునట్టి శాస్త్ర జ్ఞానమే, అనఁగా సవికల్పజ్ఞానమే, సంసారమునకు మూలమైన యజ్ఞానమును తొలఁగింపఁగలదు. ఎన్నో జన్మల యందు నిష్కామముగా చేసిన పుణ్యకర్మల చేత ఆత్మదేవత సంతుష్టురా లగును. ఆ దేవత సంతుష్టురాలైనప్పుడే మోక్షము నందు కోరిక కలుగును. లేకున్నచో కోట్ల కొలఁది కల్పములు జరుగుచున్నను మోక్షము కావలయు ననుకోరిక కలుగదు. కోట్లకొలఁది జస్మల యందు చేతనత్వముతో జన్మించుట దుర్లభము. అందును మనుష్య జన్మము ఇంకను దుర్లభము. మనుష్యులలో కూడ సూక్ష్మ బుద్ధి కలవాఁడై జన్మించుట పరమ దుర్లభము. నీవే గమనింపుము. సృష్టి యందు స్థావరములలో నూఱవ వంతు కూడ జంగమములు లేవు. జంగమములలో నూఱవ వంతు కూడ మనుష్యులు లేరు. వారిలో కూడ మంచిని చెడును పుణ్యమును పాపమును గుర్తింపక పశువులతో సమానముగా నుండు వారు కోట్లకొలఁదిగా నున్నారు. పాండిత్య గర్వముతో ఈ లోకము నందు స్వర్గాదిలోకములందును భోగములను కోరుచు పైకి క్రిందికి రాక పోకలు చేయువారు కూడ కోట్ల కొలదిఁగానున్నారు. పండితులలో కొందఱు వివేక వంతులు తత్త్వమును గ్రహింపఁబూనుకొన్నను మలిన సంస్కారముల ప్రాబల్యము చేత అద్వితీయమైన యాత్మను గ్రహింపఁజాలరు. పరమేశ్వరుని యొక్క మాయచేత అంధులైన వారికి భాగ్యహీనులైన వారికి అద్వైత జ్ఞానము బుద్ధి కెక్కదు. బుద్ధిశక్తి చేత దానిని గ్రహింపఁగలిగినను కొందఱు దౌర్భాగ్యులు ''విషయాకారమును. పొందని కేవల చైతన్య మెట్లుండును? ఉన్నచో కుండ చట్టి మొదలగు వానివలె ఏల గోచరము కాదు? కావున లేదు?'' అని యిట్టి కుతర్కములతో దానిని తిరస్కరించుచుందురు అహో! భగవంతురాలైన మాయ యొక్క ప్రభావ మేమని చెప్పుదును; చేతికి దొరికిన చింతామణిని, ''ఇది మణి యగునో కాదో'' అని సంశయించుచు పారవేయినట్టి వాని వలె పండితులు కూడ ఆత్మను చూచుచుండియు మాయ చేత మోహితులై కుతర్కములు చేయుచు దానిని వదలి వేయుచున్నారు. పరదేవత యొక్క అనుగ్రహమును పొందినవారు మాత్రము మాయ నుండి తప్పించుకొని శ్రద్ధతో సరియైన తర్కముతో విచారించి అద్వితీయమైన పరమపదమును పొందుచున్నారు. ఆ పదమును పొందుటకు క్రమమును చెప్పెదను వినుము.
అనేక జన్మలలో చేసిన పుణ్యముల వలన పరదేవత యందు భక్తి కలుగును. భక్తితో పరమేశ్వరిని ఆరాధించి ఆమె యనుగ్రహమును పొందినప్పుడు భోగముల యందు విరక్తి ఆత్మతత్త్వము నందు ఆసక్తియు కలుగను. వైరాగ్యముతో శ్రద్ధతో ''ఆత్మ తత్త్వమునకు మించి పొందవలసినది ఏదియి లేదు, దానినే పొందవలె'' అని నిశ్చయించి సద్గురువు నాశ్రయించినచో ఆయన గావించు బోధ వలన అద్వైత తత్త్వము తెలియును. ''అద్వితీయమైన యాత్మయున్నది'' అని దృఢముగా తెలిసికొనుటయే పరోక్ష జ్ఞానము. ఇట్లు తెలిసికొనుట శ్రవణము. తరువాత శాస్త్ర సమ్మతమైన తర్కముతో దృష్టాంతములతో విచారించి సంశయములను తొలఁగించుకొనుట మననము. అట్లు మననము చేత నిశ్చయించుకొన్న యాత్మ స్వరూపమును మనస్సు నందు నిలుపుకొనుట ధ్యానము, మనస్సు చంచలమై ఆత్మ స్వరూపము దాని యందు నిలువకున్నచో తీవ్రముగ ప్రయత్నించి ప్రాణాయామాది సాధనములను అవలంభించియైనను అత్యంతమైన ప్టటుదలతో అపరోక్ష జ్ఞానము కలుగు వఱకు ధ్యానమును కొనసాగింపవలె. ఇదియే నిదిధ్యాసనము. ''శుద్ధమైన యాత్మ స్వరూపముగా నా మనస్సు చాలసేపు నిలుచునుగాక'' అని సంకల్పించి ఆ సంకల్పిమును మఱువ కుండ సంస్కార రూపముగా మాటిమాటికి పైకి తెచ్చుకొనుచు ఆత్మ తత్త్వమును మనస్సు నందు నిలుపుకొను ప్రయత్నము ధ్యానము. ధాన్యముయొక్క అభ్యాసము నందలి యతిశయము చేత, అనగా సంకల్పము యొక్క సంస్కారము యొక్క బలము చేత ఇష్టము వచ్చినంతసేపు మనస్సు నందు ఆత్మస్వరూపమును నిలుపుకొనఁగలుగట సవికల్పసమాధి అందురు. ఈసమాధిని కొనసాగించుచున్నచో కొంతకాలమునకు సంకల్పసంస్కారములయొక్క ప్రేరణలేకయే మనస్సునందు ఇష్టము వచ్చినంతసేపు ఆత్మస్వరూపము నిలిచియుండును. దీనిని నిర్వికల్పసమాది యందురు. దీని యందు పరమపదమైన యాత్మ స్వరూపము అపరోక్షణుగా (Directly) గోచరించును. ''ధ్యానము యొక్క పరిపక్వతయే నిర్వికల్ప సమాది. అట్లు ఆత్మతత్త్వము గోచరించిన తరువాత, సమాధిని వదలిన మరు క్షణమున శాస్త్రము నందు చెప్పఁబడిన యాత్మ తత్త్వము సమాధి యందు గోచరించిన యాత్మ స్వరూపము, రెండును ఒకటియే, ''శాస్త్రము నందు నిర్ణయింపఁబడిన యాత్మయే నేను (సో೭హమ్)'' అని గుర్తింపవలెన. అట్లు గుర్తించుటను ప్రత్వయబిజ్ఞ యందురు. దానిచేత సంసారమునకు మూలమైన యజ్ఞానము సమస్తము నశించును. ఇందు సంశయము లేదు.
మనస్సు నందు వికల్పములు పుట్టకుండుటయే నిర్వికల్ప స్థితి. ఆత్మ స్వరూపము తప్ప మఱి దేనిని మనస్సులోఁ జొరఁబడకుండునట్లు చేసినచో వికల్పములు పుట్టవు. మనస్సు వివిధ పదార్థముల యొక్క ఆకారములను పొందుచుండుట వికల్పస్థితి. అది దేనిని బాసింపక ఏక రూపమున నిలుచుట నిర్వికల్ప స్థితి. గోడమీఁద బొమ్మలను తుడిచి వేసినచో అది శుద్ధమైనట్లే మనస్సులో విక్లపములు లేకుండఁజేసినచో అది స్వయముగా శుద్ధమై నిర్వికల్ప మగును. ఇదియే పరమ పావనమైన పదము. మాయ యొక్క ప్రభావము చేత పండితులు కూడ ఈ విషయము నందు భ్రాంతి నొందుచున్నారు. ఈ పరమ పదమును పొందఁదగినవారు మూఁడువిధములుగా నున్నారు. గురువువలన శ్రవణము చేయుచున్నప్పుడే, ఆయన ఒక్కసారి బోధించినంతనే, మనన నిదిధ్యాసనముతో మఱు క్షణముననే ఆ పదమును తెలిసికొన గలవారు ఉత్తములు. సాధన చేసి కొంత కాలమునకు తెలిసికొన గలవారు మధ్యములు. చిరకాలము సాధన చేసి తెలిసికొను వారు అధములు. ఉత్తములకు పరమ పదమును పొందుటలో క్లేశమే యుండదు.
వెనుక ఒకప్పుడు వేసవిలో వెన్నెల రాత్రి యందు మద్యమును సేవించి ఉద్యానవాటికా ప్రాంగణమున రత్నములచే అలంకరింపఁబడిన శయనము నందు ప్రియురాలిచే కౌంగిలింపఁబడి యుంటిని. అప్పుడు ఆకాశము నందు పోవుచు సిద్ధపురుషులు అద్వితీయమైన యాత్మ తత్త్వమును గూర్చి మధురముగా ప్రసింగిచుకొనుచుండిరి. ఆ ప్రసంగమును నేను వింటిని. వెంటనే నేను దానిని మననము చేసికొని ధ్యానించి నిర్వికల్ప సమాధిని పొంది అర్ధ ముహూర్తము (ఒక్కగడియ = 24 నిముషములు) పరమ పావనమైన యాత్మ తత్త్వమును తెలిసికొని ఆ సమాధి స్థితి యందే పరమానంద సాగరమున తేలియాడుచు కొంత సేపు ఉంటివి. పిదప బాహ్య స్మృతిని పొంది ఆలోచించితిని. ''అహో! ఇది అద్బుతముగా నున్నది; ఆనందామృత పూర్ణముగా నున్నది. చాల అపూర్వమైన స్థితిని (Most unusual state) పొందితిని. దీని యందు మరల ప్రవేశింతును. ఇంద్ర పదవి నుండి బ్రహ్మ పదవి వఱకును లభించునట్టి సుఖ మేదియును ఈ సుఖములోని రవ్వంత భాగమునకు కూడ సమానము కాదు. ఇప్పటి వఱకును కాలము వ్యర్థముగా గడచినది. చింతామణులతో నిండిన నిధానము తమ యింటిలోనే యుండఁగా దానిని తెలిసికొనలేక బిచ్చ మెత్తుకొను వారివలె లోకులు ఆత్మానందమును గుర్తింపలేక మహాశ్రమతో అల్పమైన బాహ్య సుఖమును పొందుచున్నారు. ఈ బాహ్య సుఖము కొఱకు ప్రయత్నము చాలును. ఇంక అనంతముగా ఆనందము నొసంగు నాత్మనే ఎల్లప్పుడు పొందుదును. నూఱిన దానినే మరల నూఱుటవలె (పిష్టపేషణము) నిరుపయొగమైన యీ వ్యవహారముతో నా కేమి పని? అవియే భోజన పదార్థములు అవియే పుష్పమాలలు శయనములు భూషణములు అన్నియు అవియే; వారే యువతులు; అవియే భోగములు. చద్దివంటకము వలె అవియే మరల మరల సేవింపఁబడుచున్నవి. ఒకరిని చూచి మఱి యొకరు చేయుయుండుట వలన అందఱకును ఇది అలవాటైనది. అందు వలననే నాకు ఏవగింపు కలుగుట లేదు.''
ఇట్లు నిశ్చయించుకొని నేను మరల అంతర్ణుఖుఁడ నగుటకు పూనుకొనుచుండగా మఱియొక ఆలోచన కలిగెను. ''అహో! ఏమి నా భ్రాంతి! సమాధి యందు ఆనంద పరిపూర్ణుఁడనై యుండిన నేనే ఇప్పుడు కూడ ఉన్నాను. ఆనందమే నాస్వరూపమై యుండఁగా నే నిప్పుడు క్రొత్తగా పొందవలసినది ఏమున్నది? నా యందు లేని దానిని ఎప్పుడు గాని ఎచ్చట గాని ఏసాధనము చేతనైనను ఎట్లు పొందఁగలను? ఆనందము నాకు స్వరూపమే కాకున్నచో దానిని నేను ఏదో ప్రయత్నము చేసి క్రొత్తగా పొందవలసియే యున్నచో, పుట్టినది పొక తప్పదు అన్నట్లు, ఆ యానందము సత్యముగా ఎట్లు నిలుచును? అదియును గాక అనంతమైన చిదానందమే నా రూపమైనప్పుడు దాని యందు ఒక పని యెట్లు జరుగును? దేహము మనస్సు ఇంద్రియములు - అన్నియు స్వప్నములోని పదార్థముల వలె అసత్యములే. అసత్యములైన సాధనములతో సత్యమైన క్రియ ఎట్లు సంభవించును? ''ఈ శరీరము మనస్సు ఇంద్రియములు నావి'' అని ప్రతి జీవియు తన శరీరాదికమును అభిమానించుచున్నాఁడు. కాని అఖిల జీవుల యందున్న యాత్మను నేనే. కావున ఆశరీరములు మనస్సులు ఇంద్రియములు కూడ నావే. అట్టి యొడల ఈ శరీరమున ఒక మనస్సును నిరోధించుట వలన ఏమగ్గును? ఇక్కడ దీనిని నేను నిరోధించినను ఇతర జీవులలో ఉన్న మనస్సులు నిరోధింప బడుట లేదు కదా! మఱి అవి యన్నియు నా మనస్సులే. చైతన్య రూపుఁడనై అఖిల జీవులలో వ్యాపించియున్న నా యందు విరుద్ధములైన మనస్సులు అనిరుద్ధములైన మనస్సులు అన్నియు భాసించుచునే యుండును. ఇంక ఈ యొక్క మనస్సు నిరోధింపఁబడుటవలన లాభమేమున్నది? అట్లుగాక అందఱి మనస్సులు ఒక్కసారి నిరోధింపఁబడినను చైతన్య మాత్రుఁడనైన నాకేమి విశేషము కలుగును? మహాకాశమును కూడ మించి అంతటను వ్యాపించి పూర్ణానంద రూపుఁడనైయున్న నా యందు నిరోధము కాని సమాధి గాని ఎట్లు సంభవించును? ఆనందమే నేనై యుండఁగా నాకు శుభాశుభములు ఎక్కడివి? అందువలన కర్తవ్యము అకర్తవ్యము ఏదియును నాకు లేదు? సమాధి యున్నప్పుడు లేనప్పుడు ఎప్పుడైనను నా స్వరూపము నందు భేదమే లేదు. నేనెప్పుడును ఆనంద పూర్ణుఁడనే. కాబట్టి ఈ శరీరము ఇప్పటి వఱకు ఏపని చేయుచున్నదో ఆపనినే చేయుచుండును గాక! దానితో నాకేమి? అది ఏ స్థితి యందున్న నేనెప్పుడును నిరంజనుఁడనే పూర్ణుఁడనే ఆనందరూపుఁడనే.'' ఇట్లు ఏ క్షణము నందును స్వరూప విస్మృతి లేక వ్యవహారమునందుండియు స్వస్థత కలవాఁడనై ఆనంద పూర్ణుఁడనై యున్నాను.
ఇది ఉత్తమాధికారి విషయము, మధ్యమాధికారులు శ్రవణ మనన నిదిధ్యాసముల యొక్క క్రమముల వలన నెమ్మదిగా జ్ఞానమును పొందుదురు. అధమాదికారులు పెక్కు జన్మలలో శ్రవణమననాదులను గావించి జ్ఞానఫలమును పొందుదురు. శాస్త్ర జ్ఞానముతో కూడిన సమాధి దుర్లభము. శాస్త్రజ్ఞానము లేని సమాధిస్థితి నూఱు పర్యాయములు సంభవించినను ప్రయోజనము లేదు, కావుననే జాగ్రద్దశ మొదలగు వాని యందు క్షణికముగ సంభవించుచున్న సమాధుల వలన ఫలముకలుగుట లేదు. ''ఇది సమాది స్థితి. ఇప్పుడు ఆనందఘనమైన నా స్వరూపమునందున్నాను. ఉపనిషత్తుల యందు నిర్దేశింపఁబడిన బ్రహ్మాత్మ స్థితి యిదియే'' అన్న గుర్తింపు ఉన్నప్పుడే సమాధి - సఫలము అగును. దారిలో పోవుచున్నప్పుడు నిర్విశేషముగా ఎన్నో వస్తువులను చూచుచుందుము. అట్లే చూచుట వలన ఫలమేదియు కలుగుట లేదు. ఒకవస్తువును నామ రూపములతో గుర్తించి ''ఇది మామిడి చెట్టు'' అని తెలిసి కొన్నప్పుడే తప్ప ఆ మామిడి చెట్టును చూచుట వలన ఫలము కలుగుట లేదు. చెట్టు యొక్క పరిజ్ఞానము లేనివాఁడు వనములో ప్రవేశించినచో వానికి చెట్లు అన్నియు నిర్విశేషముగా ఒకటిగానే కన్పించును. ఏ చెట్టు యొక్క పరిజ్ఞానము ఎవనికి ఉండునో వాఁడు ఆ చెట్టును మాత్రమే గుర్తించి దాని యొక్క ఫలమును పొందఁగలడు. కావున నిర్విశేషమైన నిర్వికల్ప జ్ఞాన మాత్రము చేత అజ్ఞానము తొలఁగదు. ''ఇదియే ఆత్మస్వరూపము'' అను జ్ఞానమేర్పడదు. అద్దము వలెనే నిర్వికల్పమైన యాత్మ ఎప్పుడును భాసించుచునే యుండును. ప్రతిబింబముల చేత ఆవరింపఁబడియున్నప్పుడు కూడ అది భాసించుచునే యున్నను భాసింపనట్లే యుండును. ప్రతిబింబములు తొలగి నంతనే అద్దము క్రొత్తగా భాసించుచున్నట్లు ఎట్లు తొఁచునో అట్లే వికల్పజ్ఞానము లన్నియు తొలఁగినప్పుడు సదా భాసించుచున్న యాత్మ క్రొత్తగా భాసించుచున్నట్లు తోఁచును. వికల్ప జ్ఞానములను తొలఁగించుటకు, అవి తొలగిన తరువాత గోచరించునది ఆత్మయో యని గుర్తింపజేయుటకు శాస్త్ర విజ్ఞానము ఆవశ్యకము, వికల్ప జ్ఞానములు తొలఁగుటయే అజ్ఞాన నిర్మూలనము. ఇది సవికల్పమైన శాస్త్ర విజ్ఞానము చేతనే సంభవించును గాని నిర్వికల్ప జ్ఞానము చేత సంభవింపదు. అద్దము ప్రతిబింబములను ఎట్లు నిరోధింపదో అట్లే నిర్వికల్పమైన యాత్మ చైతన్యము కూడ అజ్ఞానము నిరోధింపదు.
ఈ కారణము చేతనే ఆత్మ ఒకప్పుడు జ్ఞాతమని మఱియొకప్పుడు అజ్ఞాత మని చెప్పఁబడుచున్నది. వికల్ప జ్ఞానముల చేత ఆవరింపఁబడినప్పుడు ఆత్మ అజ్ఞాత (Unknown) మని వికల్పములు తొలఁగినప్పుడు అదియే జ్ఞాతమని (Known) చెప్పఁబడుచున్నది. ఇది ఉత్తమమైన యాత్మ విజ్ఞాన క్రమము, ఇప్పుడు నీవు విన్న దాని మరల విచారింపుము. పిమ్మట ఆత్మ తత్త్వమును తెలిసికొని కృతార్ధుఁడవు కాఁగలవు.
ఇట్లు జనకుని చేత ఉపదేశింపఁబడిన యష్టావక్రుఁడు ఆయన చేత పూజితుఁడై సెలవు గైకొని తన యాశ్రమమునకు పోయి మననము నిధి ధ్యాసనము కావించి పరమపదమును తెలిసికొని సకల సందేహములను వీడి కొలఁది కాలముననే జీవన్ముక్తుఁడయ్యెకు.
ఇది జ్ఞానఖండమున సమాధిస్థితివివరణ మన్నది సప్తదశాధ్యాయము.
"సర్వం శివార్పణమస్తు"
No comments:
Post a Comment