Vedantha panchadasi:
గూఢం చైతన్యముత్ర్పేక్ష్య జడబోధ స్వరూపతామ్ ౹
ఆత్మనో బ్రువతే భాట్టాశ్చదుత్ర్పేక్షోత్థిత స్మృతేః౹౹95౹౹
95. భాట్ట మీమాంసకులు ఆత్మయందు చైతన్యము గూఢమై ఉన్నదనీ స్వరూపమున అది చేతనము,అచేతనము కూడా అనీ అందురు. మేలుకొనిన పురుషుడు తన గాఢనిద్రను స్మరించుటను బట్టి వీరిట్లు నిశ్చయింతురు.
జడో భూత్వా తదాఽ స్వాప్సమితి జాడ్యస్మృతిస్తదా ౹
వినా జాడ్యాను భూతిం న కథఞ్చిదుపద్యతే ౹౹96౹౹
96. "జడుని వలె నిద్రించితిని"అనే స్మరణ అట్టి జడత్వపు అనుభవము ఉండుట చేతనే సంభవము.కాని ఒక చైతన్యాంశము లేనిదే ఇట్టి అచేతనా అనుభవపు స్మరణ సిద్ధింపదు.కనుక ఆత్మ చేతనము అచేతనము కూడా.
ద్రష్టుర్దృ ష్టేరలోపశ్చ శ్రుతః సుప్తౌ తతస్త్వయమ్ ౹
అప్రకాశ ప్రకాశాభ్యామాత్మా ఖద్యోతవద్యుతః ౹౹97౹౹
97. నిద్రయందు ద్రష్ట గాని దృష్టి గాని లోపింపవు.(బృహదారణ్యక ఉప.4.3.23)అనే శ్రుతివాక్యమును చూపుచు వారు మిణుగురు పురుగు వలె ఆత్మ ప్రకాశము అప్రకాశము కూడా అని చెప్పుదురు.
నిరంశ స్యోభయాత్మాత్వం న కథఞ్చిద్ఘటిష్యతే ౹
తేన చిద్రూప ఏవాత్మేత్యాహుః సాంఖ్యవివేకినః ౹౹98౹౹
98. నిరవయవమగు ఆత్మ రెండూ,చేతనము అచేతనము కూడా,అగుట ఏ విధముగనైనను సంభవింపదు.ఆత్మ చిద్రూపము మాత్రమే అని సాంఖ్యులు వాదింతురు.
వ్యాఖ్య: షడ్దర్శనములలో అయిదవదగు పూర్వ మీమాంసయందు రెండు సంప్రదాయములు గలవు.
ప్రభాకర సంప్రదాయము,
కుమారిల భట్టు సంప్రదాయము. వీరినే సంగ్రహముగ భాట్టులని వ్యవహరింతురు.
ఆరవదగు ఉత్తర మీమాంసయే వేదాంతము.
కొన్ని స్థితులయందు చైతన్యము ఆవృతమై ఉండునని భాట్టుల నిర్ణయము.
ఆత్మ విజ్ఞానఘనమని శ్రుతి వాక్యము.
అందు అచేెతనమునకు స్థానము లేదు.నిద్రయందలి జడత్వమును స్మరించుట, జడమగు విషయమును,మాయను,
అనుభవించుట చేత.
ఆత్మ యొక్క జడత్వమును అనుభవించి కాదు.
కనుక భాట్టుల వాదము సమీచీనము కాదు.
ఆదిత్యుని కిరణములు చంద్రుని యందు ప్రతిఫలించి వెన్నెల కాంతి ద్వారా రాత్రుల యందలి చీకటిని పోగొట్టును.ఆ కిరణములే గృహము నందలి కంచు పాత్రపై బడి గృహమును గూడా వెలుగుతో నింపును.
అలాగే ఆత్మ చైతన్యము బుద్ధియందు ప్రతిఫలించి తద్వారా ఇంద్రియములను,ఇంద్రియముల ద్వారా బాహ్య వస్తువులను ప్రకాశింపజేయుచున్నది.
కావున జగత్తునందలి సమస్త పదార్థములను చైతన్య స్వరూపమైన ఆత్మ ప్రకాశింప జేయుట వలన ఆత్మ చిద్రూపంబని చెప్పబడుచున్నది.
అట్లే ఆత్మయైన తాను జాగ్రత్స్వప్న సుషుప్తు లనెడు త్రివిధావస్థల నెరుగు చుండుటచే తానే చిద్రూపాత్మయై యున్నాడు. జాగ్రత్స్వప్నములలో తప్ప సుషుప్తియందు ఆత్మ దేనినీ గూడ తెలిసికొనదుగాన జడమని నిశ్చయించగూడదు.
సుషుప్తి యందు ఏ వస్తువును గూడా తెలిసికొనలేదు అని తెలుపు జ్ఞానమైనను అచ్చట ఉన్నది కదా!
లేనిచో సుషుప్తి యందు ఏమియు తెలియలేదు అని తెలిసికొనిన
దెవరు?
వెలుగు చున్న దీపమును ఆకాశము వైపు తిప్పినప్పుడు అచ్చట ప్రకాశింపజేయుటకు రెండవ వస్తువు లేనప్పటికిని దీపము తనంతట తాను ప్రకాశించుచునే యుండునట్లు, సుషుప్తి యందు తెలిసికొనుటకు రెండవ పదార్థము లేకున్నను తాను మాత్రము కేవల చైతన్య స్వరుపుడై యున్నాడు. సుషుప్తియందు ఆత్మయైన తాను ప్రకాశరూపుడై యుండుటచేత అప్రకాశమైన అజ్ఞానము(తెలియని తనం) లేనే లేదు.
జ్యోతి స్వరూపుడగుటచే సూర్యునికి అంధకారములేనియట్లు,నిత్య బోధ స్వరూపుడైన ఆత్మకు అజ్ఞానము సర్వదా లేదు.
కావున అవస్థలు ఉన్నప్పుడు ఉన్నవని,లేనప్పుడు లేవని తెలియుతాను చిద్రూపుడై యున్నాడు.
అట్లే బాల్య యౌవ్వన వార్థక్యములను ప్రాతర్మధ్యాహ్న సాయంకాలములను,పగలు రాత్రి సంధ్యాకాలములను,వార పక్ష మాస బుతు సంవత్సరయుగ మన్వంతర కల్పములను,ఇంతకు ముందు ఇప్పటి రాబోవు దేహాలను,భూత భవిష్యత్ వర్తమాన కాలములను ఈ సర్వమును ఒకే రీతిలో ఎట్టి మార్పును లేక ఆత్మ అయిన తాను తెలియు చుండుట వలన చిద్రూపుడై యున్నాడు.
కావున శ్రుతియందు
"ప్రజ్ఞానం బ్రహ్మ"
(ఐతరేయ-ఉప-3-3)మని చెప్పంబడినది.
No comments:
Post a Comment