కుండలినీ సిద్ధ మహా యోగ పథంలో...
ధ్యాన సాధనలో కుండలినీ శక్తి పాత్ర...
📚🖊️ భట్టాచార్య
..."కుండలిని" అనే పదము, "కుండల" అనే సంస్కృత పదము నుండి వచ్చింది. కుండలం అనగా చుట్టలుగా చుట్టబడిన అని అర్ధం. మహా చైతన్య వంతమైన ఈ కుండలినీ శక్తి, మూలాధార చక్రమందు వశిస్తూ యున్నది. ఈ మహా శక్తి, చైతన్యవంతమైతే...మూలాధారము నుండి పయనించే సుషుమ్నా నాడి యందు ప్రవేశించి ఊర్థ్వ గమనము చెందుతుంది.
ఈ కుండలినీ శక్తి అనేక పద్ధతుల ద్వారా చైతన్యం చెందితే, ఈ ప్రయాణంలో మజిలీలుగా ఉన్న అన్ని చక్రాలనూ (శక్తి కేంద్రాలను ) స్పృశిస్తుంది. అలా అన్ని చక్రాలనూ స్పృశిస్తూ, భేదిస్తూ...చివరకి సహస్రారాన్ని చేరుతుంది ఈ మహాశక్తి. ఈ చక్రం ఆత్మ సాక్షాత్కార స్థానం.
అన్ని ఆధ్యాత్మిక శక్తులు ఈ సహస్రారంలో వికసించబడి ఉంటాయి కదా!
వెనుబాము పొడవునా, 7 ప్రధాన శక్తి కేంద్రాలు లేదా 7 ప్రధాన చక్రాలు విస్తరించి ఉంటాయి. ఈ చక్రాలు, మనుజుని యొక్క భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక జీవితానికి ఆధారభూతం. ఈ చక్రాలు మన శరీరమందలి నాడీ కూటముల వద్ద ఉంటాయి. ఈ చక్రాలు నాడుల ద్వారా అనుసంధానించబడతాయి.
కుండలినీ సాధనలో, కుండలినీ శక్తి ఊర్థ్వగమనం చెందుతున్నప్పుడు, మన శరీరం శక్తివంతంగా, సృజనాత్మకంగా, సకల సమన్వయంగా మారుతుంది.
ప్రతి చక్రము కూడా భౌతిక శరీరంలోని ఒక లేదా కొన్ని అంతస్రావీ గ్రంథులతోనూ, కొన్ని శరీర భాగాలతోనూ అనుసంధానంగా ఉంటుంది. ప్రతి చక్రము కూడా...మన శరీరమందలి నాడీ వ్యవస్థతో అనుసంధానించబడి ఉంటుంది. ప్రతీ చక్రానికి కొన్ని లక్షణాలు, కొన్ని గుణాలు ఉంటాయి. ఆయా చక్రాలను చైతన్యవంతం చేయగలిగితే, మన వ్యక్తిత్వం తత్సంబంధ గుణాలు పెంపొందించబడుతాయి.
No comments:
Post a Comment