Saturday, April 12, 2025

 భారత ప్రథమ సామాజికతత్వవేత్త, సమన్యాయ సత్యశోధకుడు, ఉద్యమకారుడు, సంఘసేవకుడెైన జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే గారి జన్మదిన జ్ఞాపకం !

    🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿

సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడెైన జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే మహారాష్ట్ర లోని సతారా జిల్లాలోని మాలి కులానికి చెందిన కుటుంబంలో 1827 ఏప్రిల్‌ 11న జన్మించారు.
.....
భారతదేశంలోని శూద్రాతి శూద్రులు (దళిత బహుజన, ఆదివాసీ గిరిజన, ముస్లిం మైనార్టీలు) బ్రాహ్మణీయ కుల వ్యవస్థలో బానిసలుగా ఉన్నారనీ, వీరు అమెరికాలోని నల్లజాతి బానిసల్లాగా ఉన్నారని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఫూలే. అందుకే బ్రాహ్మణీయ కుల వ్యవస్థలోని బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడడమొక్కటే మన ముందున్న ప్రథమ కర్తవ్యంగా ఫూలే ప్రకటించారు.
......
బడుగులు బానిసలుగా ఉండడానికి బ్రాహ్మణీయ దోపిడీ, అణచివేత, వివక్షలను అర్థం చేసుకోకపోవడం, అందుకు చదువు లేకపోవడమే మూలమని ఫూలే గ్రహించాడు. 1834-38 కాలంలో ఫూలే మరాఠీ పాఠశాలలో చేరి విద్యాభ్యాసం ప్రారంభించారు. శూద్రులు, అగ్రవర్ణాలకు సేవలు చేయాలేగానీ విద్య నేర్చుకోకూడదని బ్రాహ్మణులు ఆయన తండ్రి గోవిందరావును బెదిరించి ఫూలే చదువు (బడి) మానిపించారు. బ్రాహ్మణుల కుటిలోపాయాల్ని గ్రహించిన ఫూలే తన తండ్రి స్నేహితులైన ముస్లిం, క్రిస్టియన్ మతస్థులైన వారి ద్వారా లహుజీబువామాంగ్ వద్ద క్రిస్టియన్ మిషనరీ (ఇంగ్లీష్) పాఠశాలలో మళ్లీ విద్యాభ్యాసం ప్రారంభించి బ్రాహ్మణ విద్యార్థుల కన్నా ప్రతిభా
వంతుడయ్యాడు.
......
తరగతి గదిలో స్నేహం ఏర్పడ్డ ఓ బ్రాహ్మణ విద్యార్థి ఫూలేను తన వివాహానికి ఆహ్వానిస్తాడు. ఆ వివాహానికి హాజరైన ఫూలేను బ్రాహ్మణులు, తోటమాలి కులస్తుడని తెలుసుకొని బ్రాహ్మణులతో పెళ్ళిలో సమానంగా నడవడమా? అంటూ, శూద్రుడంటూ ఫూలే ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారు. అలా అవమానించిన బ్రాహ్మణుల దోపిడీ, అణిచివేతల్ని బహిర్గతపర్చాలని కంకణం కట్టుకొని 1848లో పుణేలో మొట్టమొదటగా దళిత (అస్పృశ్యులకు) బాలికలకు పాఠశాల నెలకొల్పారు. ఆ తదనంతరం 1851లో మరో రెండు పాఠశాలల్ని నెలకొల్పారు. శ్రామిక ప్రజల కోసం 1855లో 'రాత్రి బడి'ని స్థాపించారు. ఇలా బ్రాహ్మణ వ్యతిరేకతతో శూద్ర వర్గంలోని అతిశూద్రులకు విద్యావ్యాప్తి చేయడంతో బెంబేలెత్తిన బ్రాహ్మణులు 1849లో ఫూలేను ఆయన తండ్రి చేత కుటుంబం నుంచి బహిష్కరింపజేశారు. అయినా ఫూలే కలత చెందక మొక్కవోని ధైర్యంతో, పట్టుదలతో మరింత ముందుకు పోయాడు. జీవిత భాగస్వామి సావిత్రీభాయి సహకారంతో బ్రాహ్మణ వ్యతిరేక సాంస్కృతిక పోరాటాల్ని నిర్మించారు ఫూలే.
......
ఫూలే కేవలం శూద్ర వర్ణాల్లో అణిచివేతకు గురౌతున్న కులాల ప్రజల పక్షాన పోరాడటమే కాకుండా, అగ్రవర్ణ వితంతువుల పునర్వివాహానికి గొప్ప కృషి చేశారు. 1873లో 'గులాంగిరి', 'సేద్యగాని చర్మకోల' అనే గ్రంథాల్ని రచించారు. 'దీనబంధు' అనే పత్రికను స్థాపించి పురోహితులు చేసే దోపిడీలపై ప్రచారం చేశారు. భావజాల ప్రచారాన్ని కార్యాచరణగా మార్చడానికి 1870లో 'సార్వజనిక్ సభ', 1873 సెప్టెంబరు 24న 'సత్యశోధక సమాజం సంస్థ'ను స్థాపించారు. దీనికన్నా ముందు బ్రిటిష్ వలస వాదులకు '1882లో హంటర్ కమిషన్‌కు' శూద్రాతి శూద్రులకు చదువు చెప్పించాల్సిన అవసరం ఉందని నివేదికలిచ్చి, అస్పృశ్యుల కోసం బ్రిటిష్ వారిచే పాఠశాలల్ని ఏర్పాటు చేయించారు. సామ్రాజ్యవాద కోణంలోనైతే ఇది మనకు వ్యతిరేకమైనది. భారతదేశంలో కులం కోణంలో చూస్తే అస్పృశ్యులు వేల సంవత్సరాలుగా విద్యకు, విజ్ఞానానికి దూరం చేయబడుతున్నారు కనుక అనుకూలమైనది. 1873-75 సంవత్సరాలలో బ్రాహ్మణ పురోహితులు లేకుండా జూన్నార్ పరిసర ప్రాంతాల్లో సుమారు 40 గ్రామాల్లో పెళ్ళిళ్లు నిర్వహించి, ప్రత్యామ్నాయ వివాహ సంస్కృతికి బీజం వేసారు.
......
బ్రాహ్మణీయ కుల వ్యవస్థ వ్యతిరేక కార్యక్రమాలే కాకుండా బ్రిటీష్ వలసవాదులకు వ్యతిరేకంగానూ, శూద్ర వర్గంలోని రైతాంగంపై బ్రాహ్మణ-వైశ్యు (బాట్‌జీ-షేట్‌జీ) ల వడ్డీ దోపిడీ, శ్రమ దోపిడీల రూపాల్ని, వారి బండారాన్ని బయటపెట్టారు. అంతేకాదు, తను ఏర్పాటు చేసిన సత్యశోధక సమాజ్ సంస్థ సారథ్యంలో తన సహచరుడు ఎన్.ఎమ్.లోఖండేతో బొంబాయి నూలు మిల్లులలోని శూద్రాతిశూద్ర కార్మికుల హక్కుల కోసం, 12 గంటల పనిదినం, ఆదివారం సెలవుకై ట్రేడ్ యూనియన్‌ను నెలకొల్పి పోరాటాలు చేశారు. ఫూలేకి కేవలం కుల వ్యవస్థ వ్యతిరేకతే కాదు, సామ్రాజ్యవాద వ్యతిరేకత, కార్మికవర్గ, రైతాంగ పక్షంగా పోరాడే అవగాహన, కార్యాచరణ ఉన్నాయి.
......
1869లో "పౌరోహిత్యం యొక్క బండారం" పుస్తక రచన చేశారు. 1877లో సత్యశోధక సమాజం తరపున ‘దీనబంధు’ వార పత్రిక ప్రారంభించారు. 1880లో భారత ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమ పితామహుడు లోఖాండేతో కలసి రెైతులను, కార్మికులను సంఘటితం చేసేందుకు ప్రయత్నించాడు. 1873లో  ‘గులాంగిరి’ 
(బానిసత్వం) పుస్తకం ప్రచురించారు.

• ఫూలే సామాజిక సంస్కరణోద్యమానికి తెలంగాణ మున్నూరు కాపు వారి పాత్ర ...

ఫూలే సామాజిక సంస్కరణోద్యమానికి తుదిశ్వాస వరకు చేదోడువాదోడై నిలిచిన జాయా కారాడీ లింగు తెలంగాణం కన్న మున్నూరు కాపు బిడ్డ . నైజాం సంస్థానంలో న్యాయమూర్తి పదవిని కాదనుకొని తండ్రిలా భవన నిర్మాణవృత్తిని చేపట్టారు. పుణే, ముంబైలలో సామాజిక ఉద్యమకారునిగా సుప్రసిద్ధులైన ఆయన పుణే మునిసిపాలిటీకి ఎన్నికై, 12 ఏళ్ళు ప్రజాప్రతినిధిగా పనిచేశారు. కారాడీ లింగువంటి సహచరుడు దొరకడం ఫూలే అదృష్టమని చరిత్రకారులు అంటారు. కారాడి లింగు తండ్రి జాయా ఎల్లప్పలింగు ముంబైలో భవన నిర్మాణ కాంట్రాక్టరు. ఫూలే కొంతకాలం భవన నిర్మాణ కాంట్రాక్టరుగా పనిచేశారు. అప్పుడే ఆయనకు ముంబై తెలుగు ప్రజల పితామహునిగా ప్రసిద్ధులైన కాంట్రాక్టరు రామయ్య వెంకయ్య అయ్యవారితో పరిచయమైంది. వెంకయ్య ఫూలేను ముంబైకి ఆహ్వానించి, తోటి కాంట్రాక్టర్లతో కలిసి సత్యశోధక సమాజాన్ని విస్తరింపజేయడానికి, పాఠశాలలను ఏర్పాటుచేసి నడపడానికి ఆర్థిక, హార్దిక సహాయాలను అందించారు. సత్యశోధక సమాజానికి తెలుగువారి విరాళాలే ప్రధాన ఆర్థిక వనరుగా ఉండేవి.
......
అందులో బొంబాయి నిర్మాణానికి తెలంగాణ నుండి వలస వెళ్ళి ఎదిగిన మున్నూరుకాపులే అధికం.బొంబాయిలో సత్యశోధక్ సమాజ్ శాఖ పుట్టింది సయాజీ నాగు మున్నూరుకాపు ఇంటిలోనే.
......
వెంకయ్య ఇల్లే అనాథ బాలల ఆశ్రమంగా ఉండేది. వారిని గొప్పవిద్యావంతులుగా, సత్యశోధకులుగా చేసిన ఘనత వెంకయ్యదే. ఆయన రచించిన ‘ఈశ్వరునికి ప్రార్థన’ను మరాఠీలోని తొలి వ్యంగ్యరచన గా గుర్తించాలని సాహిత్య చరిత్రకారులు కోరుతున్నారు. ఫూలే ప్రసిద్ధ గ్రంథం ‘గులాంగిరి’ని ఆయనే ప్రచురించారు.
.....
వెంకయ్య కుటుంబ సభ్యులు సావిత్రీబాయి జీవిత చరిత్రను కూర్చి, మూడుమార్లు ప్రచురించారు. సాహు మహారాజ్‌కు ఆంతరంగిక సలహాదారుగా పనిచేసిన భాస్కర్‌రావ్ జాదవ్, రామయ్య తీర్చిదిద్దిన ఆణిముత్యాలలో ఒకరు మాత్రమే. జాదవ్ సత్యశోధక ఉద్యమ నాయకునిగా అన్ని వర్గాల గుర్తింపును పొందారు. ఫూలే ఆలోచనల వ్యాప్తికి, కార్మిక సమస్యలను వెలుగులోకి తేవడానికి కృషిచేసిన ‘దీనబంధు’ పత్రికకు ఆయనే వెన్నెముకై నిలిచారు. ఫూలేకు అడుగడుగుడునా అండదండగా నిలిచి, ఆయన తర్వాత కూడా సత్యశోధక సమాజ ఉద్యమాన్ని కొనసాగించిన వారిలో తెలుగువారి పాత్ర అద్వితీయమైనది. 

మహమ్మద్ గౌస్ 

          🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿

No comments:

Post a Comment