*విశిష్ట చారిత్రక తెలుగు మహిళలు - 40*
*కళల్లోనూ, క్రీడల్లోనూ మేటి టి.జి. కమలాదేవి*
తెలుగు రంగ స్థలం మీద పేరు ప్రఖ్యాతులు సంపాదించి సినిమా రంగానికి వచ్చిన వారెందరో ఉన్నా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించినవారు తక్కువ.
పౌరాణిక, చారిత్రక సాంఘిక నాటకాల అత్యుత్తమ రంగస్థల నటీమణిగా, మధుర గాయకురాలిగా, సినీ నటిగా, గ్రామఫోన్ రికార్డిస్టుగా, రేడియో కళాకారిణిగా, బిలియర్డ్స్ చాంపియన్ గా బహుముఖ ప్రతిభా శాలిని అయిన తెలుగు మహిళ టి.జి. కమలాదేవి.
తోట కమలాదేవి 1928 డిసెంబర్ 29న చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో జన్మించింది. తల్లిదండ్రులు లక్ష్మమ్మ, కృష్ణస్వామినాయుడు. ఏడో ఏటనే తల్లి ప్రోత్సాహంతో శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించడం ప్రారంభించింది. నాలుగేళ్లు సంగీతం నేర్చుకుంది. పాఠశాల విద్యార్థినిగా ఉన్నప్పుడే నాటకాల్లో *జ్ఞానసుందరి, భూపుత్రి అయిదు పువ్వుల రాణి* పాత్రలు ధరించింది.
తన 11వ ఏటనే లవకుశ చిత్రంలో సి. హెచ్.బి. వెంకటాచలంతో కలిసి మొదటిసారిగా రికార్డు ఇచ్చింది.
తమిళంలో జీవరత్నమ్మ పాడిన పాటను *కళ లేని జీవితమూ'* అనే పాటను రికార్డు ఇచ్చింది. ఆరోజుల్లో రికార్డులివ్వడమే ఘనం. కమలాదేవి అంత చిన్న వయసులోనే రికార్డు లిచ్చి
ప్రశంసలు పొందడం చిన్న విషయం కాదు. అప్పట్లో రికార్డుల మీద ఈమె పేరు *గోవిందమ్మ'* అని ఉండేది. ఆమెను బాల్యంలో 'గోవిందమ్మ' అని పిలిచేవారు.
కార్వేటి నగరంలో వ్యాపారం దెబ్బ తినడం వల్ల కమల తండ్రి పుత్తూరు మకాం మార్చారు. అక్కడ *వందేమాతరం*' చిత్రంలో నటించిన నాగయ్యగారికి సమ్మానం జరిగింది. ఆ సందర్భంలో కమలాదేవిని ఆయన చూడడం, ఆమె గురించి తెలుసుకోవడం జరిగింది. ఆ పరిచయంతో ఆమె మద్రాసు వచ్చి రాజా శాండోతో నిర్మించిన *చూడామణి'* చిత్రంలో సి. ఎస్. ఆర్ చెల్లెలి పాత్రను ధరించింది. అదే సమయంలో తమిళంలో *చెల్లని డబ్బు*' అనే చిత్రంలో కూడా వేషం వేసింది. 1941లో హెమ్.ఎమ్. రెడ్డి గారు *తెనాలి రామకృష్ణ*' లో ఎల్.వి.ప్రసాద్కు భార్య వేషం ఇచ్చారు. అదే ఏడాది *దక్షయజ్ఞం, పార్వతీ కళ్యాణం* చిత్రాల్లోనూ నటించింది. గూడవల్లి రామబ్రహ్మం గారి *'మాయాలోకం'* లోనూ ఘంటసాల బలరామయ్య గారి చిత్రాల్లోనూ నటించింది. నాగేశ్వరరావు నటించిన తొలిచిత్రం *సీతారామ జననం* లో అహల్యగా నటించి *నేధన్యనైతిని రామా*' అనే పాట పాడారు.
ప్రతిభా వారి *ముగ్గురు మరాఠీలు'* చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు మూడో మరాఠీ, టి.జి.కమల ఆయన జోడీగా నటించింది. ఆ చిత్రం షూటింగుల్లో గోవిందరాజుల సుబ్బారావు, కన్నాంబ వంటి అప్పటి పెద్ద తారలకి భోజనాలు పెద్ద హోటళ్ల నుంచి తెప్పించేవారట. నాగేశ్వరరావు, కమల వంటి జూనియర్లకు ఏవో టిఫిన్ పాకెట్లు ఇచ్చేవారట. అక్కినేని సైకిల్ మీద మౌంట్ రోడ్డు వరకూ వెళ్లి తనకూ, ఆమెకు ఏవో ఫలహారాలు పట్టుకొచ్చేవారట. ఎఎన్నార్ ఎప్పుడూ ఈమెను ఆత్మీయంగా గోవిందమ్మ అనే పిలిచేవారు.
తెనాలి రామకృష్ణ చిత్రంలో ఎల్.వి. ప్రసాద్ సరసన *పంతులమ్మ పాత్రను, దక్ష యజ్ఞంలో రోహిణి* పాత్రను ధరిస్తూ తన పాటలను తానే రమ్యంగా పాడింది. గుణ సుందరి కథలో తన పాటలు తాను పాడు కోవడమేగాక కమల ఆ చిత్రంలోని ఒక యక్షిణికి ప్లేబాక్ పాడింది.
*ఈవనిలోపల కోయిలలై కోయిల పాడే గానములై నా చెవిలో నేనే ధ్వనిస్తా.*
*ప్రేమలేఖలు*' చిత్రంలో నర్గీస్ అక్క వేషం వేసిన తారకు ఆమె నేపథ్య గాయని. *ధర్మచక్రం* లో కధానాయకిగాను, *తులాభారం* లో కృష్ణుడి పాత్రలోను సమర్ధవంతంగా నటించింది.
ఒక ప్రక్క సినిమాల్లో నటిస్తూనే గాయనిగా నేపథ్యగానం అందిస్తూనే ఆమె రంగస్థలానికి సేవ చేసింది. సావిత్రిలో *నారదుడు*, తులాభారంలో *నళినిగా*,
కీచకవధలో *'ఉత్తర'* పాత్రలు ధరించింది. *రోషనార, అలెగ్జాండర్* వంటి చారిత్రక నాటకాల్లోనూ భూమికలు పోషించింది.
చెన్నపురి ఆంధ్ర మహాసభ వారి అనేక నాటకాల్లో నటించడమేగాక ఇతర బృందాల నాటకాలను ప్రదర్శింపజేసింది. బందరు ఆంధ్ర నాటక కళాపరిషత్ వారు ప్రదర్శించిన *'గాలివాన*' నాటకంలో కథానాయిక ఇందిర పాత్రకు పోటీల్లో ఉత్తమనటిగా బహుమతి నందుకున్నారు.
ఆరోజుల్లో పరిషత్తుల్లో ఉత్తమనటి బహుమతి గెల్చుకోవడం గణనీయమైన విషయం. జగ్గయ్య, చలం, పినిశెట్టిలతో కలిసి *'అన్నా చెల్లెలు*' నాటకంలో చెల్లెలు పాత్రను, ఆత్రేయగారి *పరివర్తన'* నాటకంలో రమణారెడ్డి సరసన *శోభ* పాత్రను పోషించారు.
కమలాదేవి ఏ పాత్ర ధరించినా, ఏ పాటపాడినా ఆమె కంఠం మృదుమధురంగా ధ్వనిస్తుంది. పాటల్లో భావయుక్తమైన శ్రావ్యత వినిపిస్తుంది. ఆమె పలికే సంభాషణలు స్పష్టంగా ఉంటాయి. డబ్బింగ్ ఆర్టిస్టుగానూ ఆమె పని చేసింది. మోడరన్ ధియేటర్స్ వారి *'రాణీ రంగమ్మ'* ఎ.వి.యం వారి *'సంపూర్ణ రామాయణం*' చిత్రాల్లో ప్రధాన పాత్రల సంభాషణలు ఈమే చెప్పారు. డబ్బింగ్ సినిమాల్లోనే ఆమెకు అధిక పారితోషికం లభించేదట.
చెన్నపురి ఆంధ్రమహాసభకు చిరకాలం కార్యదర్శిగా పనిచేసి ఎనలేని కళాసేవ చేసిందామె.
కమలాదేవి బహుముఖ ప్రజ్ఞలో మరో విశిష్టమైనకోణం క్రీడారంగం. బిలియర్డ్స్ లో ఆమెది విశేష ప్రతిభ. సౌత్ ఇండియన్ బిలియర్డ్స్ టోర్నమెంట్లో ఛాంపియన్ షిప్ గెల్చుకున్న కమల ఆల్ ఇండియా ఛాంపియన్ సెల్వరాజ్తో క్వార్టర్ ఫైనల్ వరకూ వచ్చింది. బాబ్ మార్షల్ వరల్డ్ అమెచ్యూర్ స్నూకర్ ఛాంపియన్తో తో మైసూరు, బెంగుళూరుల్లోని ఆటల్లో ఆమె పాల్గొన్నది. 1991-92 సంవత్సరానికి ఆమె మహిళల విభాగంలో జాతీయ ఛాంపియన్.
కమలాదేవి బెర్లిన్లో జరిగిన ప్రథమ ప్రపంచ సంగీత సదస్సులో భారత ప్రభుత్వ అధికార ప్రతినిధిగా పాల్గొనడం గర్వకారణం. 1983 లో కర్నూలులో ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడెమి *నాటక కళా ప్రపూర్ణ*' బిరుదంతో సత్కరించింది.
ఇంతటి వైవిధ్య భరితమైన ప్రతిభా సంపత్తి ఉన్న నటి *'నభూతోనభవిష్యతి'.*
*ఓం నమో శ్రీవేంకటేశాయ!!*
(సమాప్తం)
No comments:
Post a Comment