Sunday, September 27, 2026

 ఎవరు చెప్పారు 
ఏటికి పల్లం వైపు 
ఆగకుండా 
ప్రవహించమని?

ఎవరు నేర్పారు తేటికి 
ప్రతి పువ్వులో 
వెదకి వెదకి మకరందం 
సేకరించమని?

ఎవరు నేర్పారు తీగకు 
రెమ్మకో పువ్వుని 
పూయించి పరిమళం 
పంచమని?

ఎవరు నేర్పారు కోయిలకు 
కొత్త చిగురులు తిని 
అదే పనిగా 
పాట పాడమని?

ఎవరు పంపారు గాలిని 
ఊపిరై అందరికీ 
ఆత్మ బంధువుగా 
ఉండమని?

ఎవరు పంపారు కిరణాన్ని 
పచ్చనాకులకు  వెచ్చనైన 
ఆహారమై పసరురంగు 
అలదమని?

సహజంగా జరిగే 
ప్రతి విషయం అద్భుతమే!
వెనుక ఉన్న శక్తి ఏదో 
తెలియకపోవడం అద్భుతమే!

వేకువలో వెలుగులు 
అద్భుతం 
వెలుగుల్లో జగతి 
అద్భుతం 
ఊరించే ఆశలు నింపే 
ప్రతి ఉదయం 
మనకు  అద్భుతమే!

🌸🌸సుప్రభాతం 🌸🌸

బృంద 🙏

No comments:

Post a Comment