#పురానీతి *సుందోపసుందులు*
పూర్వం హిరణ్యకశిపుడి వంశంలో నికుంభుడనే రాక్షసుడికి సుందుడు , ఉపసుందుడు అనే కోడుకులు ఉండేవారు . వారిద్దరికీ ముల్లోకాలనూ జయించాలనే కోరిక ఉండేది. అంతటి ఘనకార్యం ఘోర తపస్సుతో తప్ప సాధ్యం కాదని తలచి, అన్నదమ్ములిద్దరూ ఒక కీకారణ్యానికి చేరుకుని తపస్సు ప్రారంభించారు . మండు వేసవిలో పంచాగ్నుల మధ్య నిలిచి, వణికించే శీతకాలంలో జలాశయాల్లో మునిగి ఏళ్ల తరబడి ఘోర తపస్సు సాగించారు . వారి తపస్సు తీవ్రతకు ప్రకృతి గతి తప్పింది. ముల్లోకాలలో సంక్షోభాలు తలెత్తాయి. ఆ పరిస్థితికి దేవతలు సైతం బెంబేలెత్తిపోయారు . వారి తపస్సును విరమించేలా చేయాలంటూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి మొరపేట్టుకున్నారు .
దేవతల గోడు విన్న బ్రహ్మదేవుడు తపస్సు చేసుకుంటున్న సుందోపసుందుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు . వరాలు కోరుకోమన్నాడు . కామరూపం , కామగమనం వంటి సకల మాయావిద్యలను అనుగ్రహించాలని , తమకు ఇతరుల వల్ల మరణం రాకుండా ఉండేలా వరమివ్వాలని , అమరత్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు . అమరత్యం తప్ప వారు కోరుకున్న మిగిలిన వరాలనన్నింటిని ప్రసాదించాడు బ్రహ్మదేవుడు.
అసలే రాక్షసులు , ఆపై బ్రహ్మదేవుడి వరాలు కూడా పొందినవారు . ఇక ఆగుతారా ...? వరగర్వంతో నానా అకృత్యాలు ప్రారంభించారు . మునులు తలపెట్టిన యజ్ఞయాగాలు భంగం కలిగించసాగారు . కామరూప విద్యతో క్రూరమృగాల రూపం ధరించి , ఊళ్లపై పడి అమాయక ప్రజలను పీడించసాగారు . వారి దాష్టికాలకు లోకమంతా హాహాకారాలు మిన్నుముట్టసాగాయి . సుందోపసుందులను ఎలా నియంత్రించాలో అర్ధంకాక మునులందరూ బ్రహ్మదేవుడి వద్దకే వెళ్లి మొరపెట్టుకున్నారు . "దేవా " నీవిచ్చిన వరాల ప్రభావంతో సుందోపసుందుల చెలరేగిపోతున్నారు.ఆదిత్యయోగీ.
లోకులను నానా రకాలుగా పీడిస్తున్నారు . వారి పీడ విరగడయ్యే పరిస్కారం నువ్వే చూడాలి అంటూ గోడు వెళ్లబోసుకున్నారు . "వారికి నేను అన్ని వరాలూ ఇచ్చానే గాని అమరత్వాన్ని ప్రసాదించలేదు . నేనిచ్చిన వరం వల్ల ఇతరుల చేతుల్లో వారి మరణం అసంభవం . వారిలో వారికి కలహం వచ్చి , పరస్పర యుద్ధానికి దిగితే తప్ప వారి పీడ విరగడ కావడం సాధ్యం కాదు . " అన్నాడు .బ్రహ్మదేవుడు . అయితే, కలహించుకోవడానికి సుందోపసుందులు పరస్పర శత్రువులేమీ కాదు. ఒకరికపై మరొకరికి అనురాగం గల అన్నదమ్ములు . వాళ్ళ మధ్య కలహం పుట్టించడం ఎలా అన్నదే సమస్య . దీనికి ఏం చేయాలో తోచని బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలందరినీ సమావేశపరచాడు . తానిచ్చిన వరాల వల్ల గర్వాంధులైన సుందోపసుందులు ముల్లోకాలనూ ఎలా పీడిస్తున్నదీ వివరించాడు. వారి పీడవిరగడయ్యే ఉపాయం చెప్పమని కోరాడు
.
అప్పుడు విశ్వకర్మ ముందుకు వచ్చి "అన్నదమ్ముల మధ్య కలహం పుట్టించడానికి ఆడది చాలు . నేను సృష్టించిన అప్పరస తిలోత్తమ ఆ పనిని అవలీలగా సాధించగలడు " అని పలికాడు. విశ్వకర్మ మాటలతో బ్రహ్మదేవుడికి కాస్త ధైర్యం వచ్చింది . ఇంద్రసభలో ఉన్న తిలోత్తమకు కబురు పంపాడు . బ్రహ్మదేవుడి వర్తమానం అందడంతో జగదేక సుందరి అయిన తిలోత్తమ బ్రహ్మ సమక్షానికి వచ్చి నిలుచుంది . "నీ అందచందాలతో లోకాలను పీడిస్తున్న సుందోపసుందులను ఆకర్షించు . చాకచక్యంగా వాళ్ళిద్దరి మధ్య కలహం పుట్టించు " అని ఆదేశించాడు .
బ్రహ్మదేవుడి ఆజ్ఞతో తిలోత్తమ భూలోకానికి చేరుకుంది . సుందోపసుందులకు కనిపించేలా వారు తరచూ సంచరించే వనంలో విహరించసాగింది . వన విహారానికి వచ్చిన సుందోపసుందులిద్దరూ ఒకేసారి ఆమెను చూసారు. ఆమె అందానికి వారి మతులు పోయాయి . "ప్రాణేశ్వరీ" అంటూ సుందుడు ఆమె చెయ్యి పట్టుకున్నాడు . "హృదయేశ్వరీ" అంటూ ఉపసుందుడు ఆమె మరో చేతిని పట్టుకున్నాడు . ఆమె నాదంటే నాదని ఇద్దరూ వాదులాడుకున్నారు . వారి వాదన ఎటూ తేలని స్థితిలో తిలోత్తమ చిరునవ్వులు చిందిస్తూ ...."మీ ఇద్దరికీ నేనొక్కత్తినే ఎలా భార్య కాగలను ? మీరిద్దరిలో ఎవరు వీరులో వారిని నేను తప్పక పెళ్లాడతాను " అని పలికింది.
ఎలాగైనా తిలోత్తమను దక్కించుకోవాలనే పట్టుదలతో సుందోపసుందులు ద్వంద యుద్ధానికి తలపడ్డారు . ఇద్దరూ సమాన బలవంతులే . భీకరంగా పోరాడుకున్నారు . సింహనాదాలు చేస్తూ ఒకరిపై మరొకరు కలబడి ముష్టిఘోతాలు కురిపించుకున్నారు.. చివరకు ఇద్దరూ మరణించారు..*
.
No comments:
Post a Comment