Tuesday, October 14, 2025

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ🙏

    ముక్తి మన సహజ స్వరూపం. ఎప్పుడూ మనం ముక్తులమై ఉంటూనే ముక్తి కోసం ఎన్నెన్నో విధాల ప్రయత్నాలు చేస్తూ ఎంతో కష్టపడుతూ ఉంటాం.

   ఆ లక్ష్యాన్ని చేరుకున్న తరువాతనే ఈ సంగతి అర్థమవుతుంది. మనం ఎప్పుడూ ఉన్న దాని కొరకే ఎందుకు ఇంత వెర్రిగా ప్రయత్నిస్తున్నామో అని అప్పుడు ఆశ్చర్యపడతాం.
   
     దీనికి ఒక ఉదాహరణ : ఈ ఆశ్రమ హాలులో ఒకరు నిద్రపోతారు. కలలో వారు ప్రపంచయాత్ర చేస్తూ కొండలు, లోయలు, అడవులు, పల్లెలు, సముద్రాలు, ఎడారులు ఎన్నెన్నో దేశాలు తిరిగి తిరిగి ఎన్నో ఏళ్ల తరబడి అత్యంత ప్రయాసతో కూడిన ప్రయాణాల తరువాత మళ్లీ ఈ దేశానికి వచ్చి తిరువణ్ణామలై (అరుణాచలం) చేరి ఈ ఆశ్రమ హాలులోకి అడుగు పెడతారు.

   ఆ క్షణంలో వారికి మెలకువ వచ్చి తాను అక్కడ నుంచి ఒక అంగుళమైనా కదలలేదనీ, అంతసేపూ తాను అక్కడే పడుకొని ఉన్నాననీ తెలుసుకుంటారు. వారు ఈ ఆశ్రమ హాలు చేరడానికి ఏమీ ప్రయాసపడలేదు. ఇక్కడే అంతసేపూ ఈ హాలులోనే ఉన్నారు. 

     సరిగ్గా అదే మాదిరి "మనం ముక్తులమై ఉండీ, బద్దులమని ఎందుకు అనుకున్నాం?" అనే ప్రశ్న వస్తే దానికి సమాధానం ఇంతే. ఆశ్రమ హాలులోనే ఉండి ప్రపంచమంతా ఎందుకు సాహసయాత్ర చేసినట్లు ఊహించావు? అదంతా 'మనసు' ఆడే ఆట, మాయ.

No comments:

Post a Comment