6️⃣7️⃣
*🛕🔔భగవద్గీత🔔🛕*
_(సరళమైన తెలుగులో)_
*మూడవ అధ్యాయము*
*కర్మయోగము.*
*17. యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవ:l*
*ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతేll*
*18. నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చనl*
*న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయll*
ఎవరైతే తనలో తాను అంటే తన ఆత్మలో తాను రమిస్తూ ఉంటాడో, దొరికిన దానితో తృప్తి చెందుతుంటాడో, అతడు నిత్యము సంతుష్ఠిగా ఉంటాడు. అటువంటి సాధకుడికి చేయవలసిన కర్మ అంటూ ఏదీ ఉండదు. అటువంటి వారికి ఈ ప్రపంచములో కర్మలు చేయడం వలన కానీ, చేయకుండా ఉండటం వలన గానీ, ఎటువంటి ప్రయోజనము లేదు. అటువంటి సాధకుడికి స్వార్ధబుద్ధి కానీ, బాహ్య ప్రపంచముతో సంబంధము కానీ ఉండదు.
పై శ్లోకములలో అందరూ కర్మలు చేయాలి. కర్మ చేయకుండా ఎవరూ తప్పించుకో లేరు అని చెప్పి ఈ శ్లోకంలో జీవన్ముక్తుల గురించి చెబుతున్నాడు. తమ మనస్సును పరమాత్మ యందు చక్కగా ఉంచిన వారు, మనస్సును ఆత్మయందు కలిపి రమించేవారు, తమలో తాము ఆత్మానందాన్ని అనుభవించేవారు, ఉన్నదానితో తృప్తిగా జీవించేవారు, సాంఖ్యులు, జ్ఞానులు. అంటే ఆత్మజ్ఞానము కలవారు బయట ప్రపంచంలో తిరుగుతున్నా ప్రాపంచిక విషయములచేత ప్రభావితం కాని వారు, ఇంద్రియములను మనసును నిగ్రహించిన వారు, అటువంటి వారు జీవన్ముక్తులు. ఒకసారి ఆత్మసాక్షాత్కారము కలిగిన తరువాత అటువంటి వారికి ఈ ప్రపంచంలో చేయవలసినపని అంటూ ఏమీ ఉండదు. అటువంటి వారు కర్మలు చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే. చేయడం వలన ప్రయోజనం కానీ, చేయక పోవడం వలన నష్టం కానీ ఏమీ ఉండవు. అటువంటి జీవన్ముక్తుడు నిర్వికారంగా ఉంటాడు. ఎందుకంటే అతడు ఆత్మయందే తృప్తిని పొందుతున్నాడు. అతడికి కావలసింది అంటూ ఏమీ లేదు. కొత్తగా సాధించేది ఏమీ లేదు. లోకోపకారార్ధం కర్మలు చేస్తాడు లేకపోతే లేదు. అతడికి కర్మలు చేయాలి అన్న నిబంధన ఏమీ లేదు. అటువంటి వాడు ఈ ప్రపంచములో ఎవరినీ ఆశ్రయించడు. ఎవరి ఆశ్రయమూ అతడికి అక్కరలేదు. అతడు ఎవరి మీదా ఆధారపడడు.
సామాన్య మానవులు ప్రాపంచిక విషయములు కావాలని కోరుకుంటూ, వాటి కోసం కర్మలు చేస్తూ, అవి దొరికితే తృప్తిపడుతుంటారు. జీవన్ముక్తులు కేవలం తమలో తాము తృప్తిపడుతుంటారు. ప్రాపంచిక విషయముల యందు ఏ మాత్రము ఆసక్తి చూపరు. అటువంటి స్థితపజ్ఞుడికి జీవన్ముక్తుడికి ఈ ప్రపంచంలో చేయవలసిన పని అంటూ ఏమీ ఉండదు. అటువంటి వారు కోటికి ఒకరు ఉంటారు. మిగిలిన వారందరూ తమకు విధించిన కర్మలు చేయవలసినదే. ఆత్మయందే రమించేవారు. ఆత్మయందు తృప్తి పొందేవారు, ఏ కర్మలను చేసినా చేయనట్లే ఉంటారు. కాని వారిని చూచి సామాన్య జనులు కూడా వారిలా ఉందామని అనుకోవడం చాలా పొరపాటు. ఎలాగంటే, ఒక ఉపాధ్యాయుడు జీవితాంతం విద్యార్థులకు పాఠాలు చెప్పి, వారిని సన్మార్గంలో పెట్టి, ప్రయోజకులను చేస్తాడు. తుదకు వయసు మీదపడగానే రిటయిర్ అవుతాడు. పెన్షన్ తీసుకుంటూ సుఖంగా జీవిస్తాడు. అటువంటి వారిని చూచి, ఆయన ఊరికే పెన్షన్ తీసుకుంటూ హాయిగా ఉన్నాడు. మేము కూడా అలాగే పనీపాటా లేకుండా సుఖపడతాము అని విద్యార్థులు యువకులు అనుకుంటే వారి జీవితం కష్టాలపాలవుతుంది. రిటయిర్ అయిన తరువాత కూడా కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థులకు సాయం చేయాలనే కోరికతో ఉచితంగా విద్యాబోధన చేస్తుంటారు. దాని వలన వారికి ఎటువంటి బంధములు అంటవు.
కాబట్టి అందరూ కర్మలు ఆచరించాలి. కర్మలు వదిలిపెట్టకూడదు. నిష్కామ కర్మలు ఆచరించడం ద్వారా జ్ఞానము సంపాదించి దాని తరువాత మోక్షమునకు అర్హులవుతారు. ఆ స్థితిని పొందిన తరువాత, వారు కర్మలు చేసినా చేయకపోయినా ఒకటే. ఎటువంటి స్వార్థబుద్ధి లేకుండా, లోక కల్యాణం కొరకు వారు చేసే కర్మలను తప్పు పట్టకూడదు. కాని ఈ రోజుల్లో ఎక్కువ మంది ప్రాపంచిక విషయములలోనూ, విషయవాంఛలలోనూ మునిగి తేలుతున్నారు. చేయవలసిన కర్మలను వదిలిపెట్టి చేయకూడని కర్మలు చేస్తున్నారు. తాము చేసిన కర్మలతో కూడా వారు తృప్తి చెందకుండా, ఇంకా ఏదో కావాలని నిరంతరం ఆరాటపడుతుంటారు. దాని వలన వారికి ఏ లాభమూ లేకపోగా బంధనములు వాసనలు చుట్టుకుంటాయి. ఎవరైతే బాహ్య ప్రపంచములో లభించే సుఖములు నిజం కావు నిజమైన సుఖం ఆత్మానందమే అని అనుకుంటారో అప్పుడే వారికి విముక్తి. అప్పటి వరకూ విద్యుక్త కర్మలు ఇతరులకు ఉపయోగించే కర్మలు నిష్కామకర్మలు చేయాల్సిందే.
ఆ కారణం చేతనే కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు. అర్జునా! పైన చెప్పిన ఆత్మారాములు కర్మ చేసినా కర్మ చేయకపోయినా వారికి వచ్చే లాభం కానీ జరిగే నష్టం కానీ ఏమీ లేదు. వారు పూర్ణకాములు అనగా అన్ని కోరికలు తీరినవారు, కోరడానికి ఆ కోరికలు తీరడానికి వారికి ఏమీ మిగలలేదు. వారు కర్మలు చేయకపోయినా నష్టం లేదు. అతనికి అన్నీ సమానమే. నిరంతరము ఆత్మయందు రమించే వాడికి బాహ్మ కర్మల వలన ఏం ప్రయోజనం చేకూరుతుంది. అటువంటి జీవన్ముక్తుడు కావాలంటే కర్మలు చేయగలడు. లేకపోతే మానగలడు. ఇది చేయాలి. అన్న నియమం లేదు. వారు చేసే కర్మలన్నీ లోక క్షేమము కొరకే కానీ వారి స్వార్ధమునకు కాదు. స్వార్ధం కోరి వారు ఏ కర్మాచేయరు. అటువంటివారు ఎవరినీ ఆశ్రయించరు. ఎవరి మీదా ఆధారపడరు. వారికి ఏ భయమూ లేదు. ఎవరి అవసరములేదు. ఎవరికీ భయపడడు.
(సశేషం)
*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*
(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
P170
No comments:
Post a Comment