Wednesday, May 6, 2026

 పూర్వజన్మ సుకృతం సరైన భార్య దొరకడం?


దీనో వా రాజ్యహీనో వా
యో మే భర్తా స మే గురుః
తం నిత్యమనురక్తాస్మి
యథా సూర్యం సువర్చలా
- సుందరకాండ 24:09

" నా భర్త దీనుడే అయినా రాజ్యభ్రష్టుడే అయినా ఆయనే నాకు ఘనుడు, ఆరాధనీయుడు. సూర్యుని యందు సువర్చల అనురాగవతియై ఉన్నట్లే నేను నా భర్త పట్లే అచంచలమైన అనురాగవతినై ఉంటూనే జీవిస్తాను " అని.

సూర్యుడు వెలుగు ఎలా ఒకటో రాముడు నేను ఒకటే అంటారు సీతమ్మ రావణుడితో.

రావణుడు సీతమ్మతో " నా సంపదలు, యశస్సు చూసావు కదా. ఇటువంటి భోగాలు విడిచి నారబట్టలు కట్టే రాముని గురించి బాధపడతావెందుకు. రాముడికి సంపదలేదు, విజయకాంక్ష లేదు, అరణ్యవాసం, కటిక నేల మీద పడక, అన్నింటినీ మించి అతను అసలు బ్రతికి ఉన్నాడో లేడో తెలియదు, నిన్ను చూడడం రాముడికి సాధ్యమే కాదు అసలు " అన్నప్పుడు సీతమ్మ పైవిధంగా అంటారు.

రాముడు తనతో అరణ్యవాసానికి రావద్దని సీతమ్మను అనునయించినప్పుడు సీతమ్మ భారతజాతికి ఒక ధర్మసూక్ష్మం తెలియచేసింది - తల్లిదండ్రులు, తోబుట్టువులు, సంతానం ఎవరికయినా ఎవరి భాగ్యం వారిదే, ఎవరి కష్టాలు వారివే. కాని ఒక్క భార్యాభర్తలదే ఒకరి భాగ్యం ఇంకొకరిది. సుఖాలలోనే కాదు, కష్టాలలో కూడా ఒకరికి ఒకరు తోడు.

ఋణానుబంధ రూపేణ
పశుపత్నిసుతాలయాః,
ఋణక్షయే క్షయం యాంతి
తత్ర కా పరివేదన "

" గత జన్మ ఋణానుబంధము ఉన్నంతవరకే భార్య, సంతానం, ఇల్లు, పశువులు ఉంటాయి. ఆ బంధం తీరగానే ఇవన్నీ నశించిపోతాయి. అందుకు వ్యథ చెందడ మెందుకు " అని.

పూర్వజన్మ సుకృతం కారణం వలననే అనుకూలమైన భార్య, సంతానం లభిస్తారు.
నాస్తి సంశయం.
శుభమస్తు

No comments:

Post a Comment