Wednesday, May 6, 2026

#అన్ని జన్మలలోను మానవజన్మ మాత్రమే ఉత్తమమైనది, దుర్లభమైనది... అసలు జన్మలు 3 రకాలు..!

#అన్ని జన్మలలోను మానవజన్మ మాత్రమే ఉత్తమమైనది, దుర్లభమైనది...
అసలు జన్మలు 3 రకాలు..!

1) దేవజన్మ 2) మానవజన్మ 3) జంతుజన్మ.

జన్మలు ఎలా వస్తాయి? వాటి ప్రత్యేకతలేమిటి?

మానవుడు తన జీవితకాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు. ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి. వాటినే కర్మఫలాలు అంటారు.

అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి. అందులో అన్నీ పుణ్య కర్మలఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు దేవలోకాలలో దేవజన్మ నెత్తుతాడు.

అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు. అది భోగభూమి. కనుక అక్కడ అతడికి ఏ కర్మలూ చేసే అధికారం లేదు.

అందువల్ల పరమాత్మనందుకోవటానికి తగిన కర్మలాచరించే అవకాశం అక్కడ లేదు. తన కర్మఫలాలననుసరించి భోగాలనుభవించి, 
ఆ కర్మఫలాలు క్షయంకాగానే...

“క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి” అన్నట్లు 
ఈ మర్త్యలోకాన్ని... మానవ లోకాన్ని చేరుకోవలసిందే!

మరల మరల మానవ జన్మనో, జంతు జన్మనో ఎత్తవలసిందే!

ఈ దేవజన్మలో కేవలం మనోబుద్ధులుంటాయి గాని కర్మజేయుటకు సాధనమైన స్థూలశరీరం ఉండదు. కనుక భగవత్సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మకాదు దేవజన్మ.

ఇక అన్నీ పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు మొదలైన జంతువులుగా నీచయోనులందు జన్మిస్తాడు.

ఆ జన్మలలో ఆ కర్మ ఫలాల కారణంగా అనేక బాధలు, దుఃఖాలు అనుభవిస్తాడు, హింసించబడతాడు. జంతుజన్మలలో కర్మలు చేస్తున్నట్లు కన్పించినా, ఆ కర్మలన్నీ బుద్ధిపరంగా ఆలోచించి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని చేసేవి కావు.

కేవలం ప్రకృతి ప్రేరణలతో పరతంత్రంగా చేస్తాయి. కారణం ఈ జంతుజన్మలలో శరీరం - మనస్సు ఉన్నాయి గాని బుద్ధి మాత్రం లేదు. కనుక ఈ జన్మలలో కూడా కేవలం కర్మఫలాలు అనుభవించుటయే గాని పరమాత్మనందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు. 

కనుక భగవత్సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడా ఉపయోగపడదు!

ఇక పుణ్యపాప కర్మలఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవ జన్మనెత్తటం జరుగుతుంది.ఆదిత్యయోగీ.ఈ జన్మలలో పుణ్య కర్మఫలాల కారణంగా సుఖాలు, భోగాలు, ఆనందం అనుభవిస్తాడు.

పాపకర్మఫలాలకారణంగా దుఃఖాలు, బాధలు అనుభవిస్తాడు. అయితే ఇలా కర్మఫలాలనుభవించటం మాత్రమే గాక, కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మానవజన్మలోనే ఉన్నది.

ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధితో ఆలోచించి శరీరంతో కర్మలు చేయటానికి వీలుగా శరీరం, మనస్సు, బుద్ధి అనే 3 సాధనాలు ఉన్న జన్మ ఇది. 

కనుక పరమాత్మనందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారం, జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్న ఈ మానవ జన్మను ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది అన్నారు. 

84 లక్షల జీవరాసులలో పుట్టి గిట్టిన తర్వాత లభించే అపురూప జన్మ గనుకనే ఈ మానవ జన్మను..“జంతూనాం నరజన్మ దుర్లభం” అని ఆచార్య శంకరులు “వివేక చూడామణి” గ్రంధంలో తెలియజేయటం జరిగింది. 

ఇట్టి ఈ అపురూపమైన, దుర్లభమైన, ఉత్తమోత్తమమైన మానవజన్మను పొందిన ప్రతి ఒక్కరు దీనిని సార్ధకం చేసుకోవాలి..*
.

    ద్వైత భావన ఉన్నంతకాలం గురువు అవసరమే. ద్వైత భావనకు కారణం తనకుతానుగా ఆత్మకు ఆరోపించిన పరిమితియే.

అర్చితుడైన దైవం, భక్తికి దారి చూపిస్తాడు. అది శరణాగతికి దారి తీస్తుంది. శరణాగతుడైన భక్తునకు, దైవం గురురూపంలో కరుణిస్తాడు.

ఆ గురుదైవం భక్తునికి సరియైన త్రోవ చూపుతూ “గురువు, ఆత్మగా నీలోనే ఉన్నాడు" అని బోధిస్తాడు. అది మనస్సును అంతర్ముఖం చేసి చివరకు ఆత్మప్రాప్తి కలిగిస్తుంది.....*
.

No comments:

Post a Comment