Sunday, May 10, 2026

 విశ్వంలో ప్రకృతి తనని తాను గమనించుకుంటుందా లేక గమనించబడుతుందా?
సోదరా, ప్రశ్న అదిరింది. "విశ్వంలో ప్రకృతి తనని తాను గమనించుకుంటుందా, లేక గమనించబడుతుందా" అని. అడిగినోడి బుర్రకి నా దండం. లోతైన మాట.

సోదరా, నువ్వు అద్దం ముందు నిలబడి నిన్ను నువ్వు చూసుకుంటావ్ కదా. అప్పుడు చూసేవాడు ఎవడు. నువ్వే. కనిపించేవాడు ఎవడు. నువ్వే. మరి ఇద్దరా. కాదు కదా. ఒక్కడివే.

అలాగే ప్రకృతి. చెట్టు నిన్ను చూస్తోంది అనుకున్నావా. కాదు.

నీ కళ్ళతో చెట్టుని చూసేది కూడా ప్రకృతే. నీ కళ్ళు ప్రకృతి. చెట్టు ప్రకృతి. చూసే జ్ఞానం కూడా ప్రకృతే. అంటే ప్రకృతి తనని తానే చూసుకుంటోంది.

సైంటిస్ట్ ఒక మాట అంటాడు సోదరా. "Observer effect" అని. అణువుని చూసేవరకు అది అలలాగా ఉంటుంది. చూశాక కణంలా మారిపోతుంది. మరి చూసేదెవరు. మనిషి. మనిషి ఎవరు. ప్రకృతిలో భాగమే కదా. అంటే ప్రకృతి తనలోని ఒక భాగంతో, తనలోని ఇంకో భాగాన్ని చూసుకుంటోంది.

నీ ఎడమ చెయ్యి కుడి చేతిని గోకినట్టు. రెండూ నీవే కదా. విశ్వం మొత్తం ఒకే శరీరం. నీ కన్ను, నా కన్ను, అన్నీ దాని కళ్ళే. కాబట్టి గమనించేది ప్రకృతి, గమనించబడేది ప్రకృతి. రెండూ ఒక్కటే.

ఉపనిషత్తులు తిరగేస్తే ఒక మాట దొరుకుతుంది సోదరా. "ప్రజ్ఞానం బ్రహ్మ" అని. అంటే తెలుసుకునేదే దేవుడు. మరి ఎవరు తెలుసుకుంటున్నారు. నువ్వు. నేను. కుక్క. పిల్లి. చెట్టు. అన్నీ తెలుసుకుంటున్నాయి కదా. ఆకలేస్తే తిండి కోసం వెతుకుతాయి. అంటే ప్రకృతి అంతా ఎరుకతోనే ఉంది. కళ్ళు మూసుకున్నా నీ గుండె కొట్టుకుంటుంది కదా. ఎవరు నడిపిస్తున్నారు. అదే ప్రకృతి తనని తాను గమనించుకోవడం.

నీకే తెలియకుండా నీ జుట్టు పెరుగుతుంది. అది ఎవరు చూస్తున్నారు. ప్రకృతే.

సోదరా, సముద్రంలో అల చూడు. "నేను సముద్రాన్ని కాదు, నేను అలని" అంటుంది. కానీ అల విడిగా ఉందా. లేదు కదా. సముద్రమే లేచి పడుతోంది. అలాగే నువ్వు, నేను. "నేను వేరు, ప్రకృతి వేరు" అనుకుంటాం. కానీ మనం ప్రకృతి నుంచి వచ్చిన అలలం. ఊపిరి తీసుకుంటున్నాం అంటే గాలి లోపలికి వస్తోంది. అది నీదా. కాదు కదా. నీళ్ళు తాగుతున్నావ్. అవి నీవా. కాదు కదా. మరి "నేను" అనేది ఎక్కడ ఉంది. అది కూడా ప్రకృతి ఆలోచనే.

సోదరా, "గమనించేవాడు" లేకపోతే "గమనించబడేది" ఉందని ఎలా తెలుస్తుంది.

అడవిలో చెట్టు కూలింది. ఎవరూ చూడలేదు. అప్పుడు శబ్దం వచ్చిందా. రాలేదా. శబ్దం అనేది చెవిలో పడితేనే కదా. చెవి ఎవరిది. ప్రకృతిదే. అంటే గమనించేవాడు లేకపోతే ప్రపంచమే లేదు. కానీ గమనించేవాడు కూడా ప్రకృతిలో భాగమే కదా.

అంటే కథ మొదటికే వచ్చింది. ప్రకృతి తన నాటకాన్ని తానే చూసుకుంటోంది.

నువ్వు సినిమా తీసి, థియేటర్లో కూర్చుని నువ్వే చూసినట్టు.

ప్రకృతి వేరు, విశ్వం వేరు అనుకోవడం మన భ్రమ సోదరా.

పాలు వేరు, పెరుగు వేరు అంటావా. పాలు తోడుకొని పెరుగు అయ్యింది కదా.

అలాగే విశ్వం అనే పాలు గడ్డకట్టి ప్రకృతి అనే పెరుగు అయ్యింది.

మరి పెరుగుని ఎవరు తింటున్నారు. మనమే. మనం ఎవరు. ప్రకృతే. అంటే పెరుగు తనని తానే తింటోంది. చిత్రంగా ఉందా. కానీ నిజం ఇదే.

సోదరా, కళ్ళు మూసుకో. నీ శ్వాస విను. గుండె చప్పుడు విను.

ఎవరు వింటున్నారు. నువ్వే. ఆ "నువ్వు" ఎవరు. ప్రకృతే. అంటే ప్రకృతి కళ్ళు మూసుకుని తన గుండె చప్పుడు తానే వింటోంది. అదే గమనించుకోవడం. బయటికి చూస్తే "ప్రపంచం" అంటాం. లోపలికి చూస్తే "నేను" అంటాం.

రెండు కళ్ళు ప్రకృతివే సోదరా.

అర్థం అయ్యిందా. లేదంటే చెరువు గట్టు మీద కూర్చుని నీ నీడను నువ్వే చూడు.
సమాధానం దొరుకుతుంది.✍️TMS RAO

No comments:

Post a Comment