ఒకరిని తెలివితక్కువవాడు, అజ్ఞాని, మూర్ఖుడు లేదా వెర్రివాడు అని పిలవడం సానుభూతి వ్యతిరేక పదాలు అని మీకు తెలుసా? కాబట్టి, మీరు ఎవరినైనా ఆ రకమైన పేర్లతో పిలువడం కొనసాగిస్తే, మీరు వారిని పిలిచే వ్యక్తి నుండి మీ హృదయం దూరం అవుతుంది.
విష్ణుసహస్రనామాలలో అవిజ్ఞాతా అని ఒక అద్భుత నామం ఉంది. తెలుసుకోలేనివాడు అని భాష్యం చెప్పారు. ఆయనను ఎవరు తెలుసుకోగలరు కనుక.
అవి + జ్ఞాతా - అవి అంటే రక్షణ - జ్ఞాతా అంటే తెలిసినవాడు. జీవులను అందరినీ ఎలా రక్షించాలో తెలిసిన నైపుణ్యం గలవాడు అని కూడా భాష్యం చెప్పారు. ఆయన రక్షణే కదా మనకు శ్రీరామరక్ష.
కాని నేరుగా చూస్తే " అ+విజ్ఞాతా ( న+విజ్ఞాతా ) " అంటే తెలివిలేని వాడు అని కదా అర్ధం. వెర్రిబాగులవాడు అని. ఇదీ నిజమేనుట.
కూరత్తాళ్వార్ అనే విష్ణు భక్తుడు " నువ్వు వెర్రిబాగులవాడివయ్యా స్వామి. ఎన్ని తప్పులు చేసినా, నేరాలు చేసినా శరణాగతి తండ్రీ అంటే చాలు రక్షించేస్తావు " అన్నారు.
ఓ వేదపండితుడు ఉంటారు. లేకపోతే ఓ పెద్ద ప్రొఫెసర్ ఉంటారు. కల్లాకపటం తెలియదు. ఆయన్ని ఏమని పిలుస్తాం. వెర్రిబాగులవాడు అనే కదా.
అంటే కల్లాకపటం తెలియక, తనకు హాని చేసేవారికయినా సహాయం చేసేవారిని వెర్రిబాగులవాడు, తెలివితక్కువ వాడు, అజ్ఞాని, మూర్ఖుడు అనే కదా పిలుస్తాం.
వేదాంతంలో కూడా ఓ అద్భుత విషయం ఉంది.
కేనోపనిషత్తు " అజ్ఞాని " నిర్వచనం వేరుగా నేరుగా చెప్పింది ఇలా:
యస్యామతం తస్య మతం
మతం యస్య న వేద సః,
అవిజ్ఞాతం విజానతాం
విజ్ఞాతమవిజానతామ్ " (2,3)
" ఎవరైతే తనకు ( భగవంతుని గురించి ) ఏమీ తెలియదని చెబుతాడో అతను జ్ఞాని అంది. భగవంతుని గురించి తెలుసా అని అడిగితే తెలియదు అన్నవాడు జ్ఞాని అంది. నిజమే కదా భగవంతుని గురించి ఎవరు మాత్రం తెలుసుకోగలరు/చెప్పగలరు. అదే నాకు భగవంతుని గురించి తెలుసు అన్నవాడు అబద్ధం చెబుతూన్నట్లే కదా. అంటే అతను అజ్ఞాని అని తెలిసిపోతూంది. ఇదీ కేనోపనిషత్తు తెలియచేసినది.
అందుకని వెర్రిబాగులవాడు/ అజ్ఞాని/ మూర్ఖుడు అంటే తిట్టో లేక చెడ్డమాటో కాదు. మంచివాడు, " మనందరిలా " కల్లాకపటం తెలియనివాడు అని అర్ధం. స్థాయిని పెంచే మాట.
శుభమస్తు
No comments:
Post a Comment