Tuesday, October 8, 2024

 *ఆత్రేయగీత*

మొదటి భాగం

అధ్యాయము - 6

“కర్మ - జ్ఞానము”

జీవుడు దేహంతో, వాక్కుతో, మనస్సుతో నిర్వర్తించే క్రియలను కర్మ అంటారు. కర్మనాచరింపక ఎవ్వరునూ ఒక్క క్షణమైనా వుండలేరన్నది నిజము.

కర్మలను మూడురకాలుగా విభజించేరు పెద్దలు, అవి నిత్యకర్మలు (తప్పకుండా నిత్యం చేయవలసిన కర్మలు), నైమిత్తిక కర్మలు (ఒక నిమిత్తాన్ని పురస్కరించుకొని చేసే కర్మలు), కామ్య కర్మలు (ఒక ప్రయోజనాన్ని ఆశించి చేసే
కర్మలు).

కర్మలు శాశ్వతము కావు, ఎందుచేతనంటే
కాలానుగుణంగా కర్మలు మారుతూవుంటాయి. కాబట్టీ వాటి ఫలితాలు కూడా తాత్కాలికములే.

వీటి నుండీ తప్పించుకొనుట ఎవ్వరికీ సాధ్యపడదు. అందుచేత వాటిని ఆచరిస్తూ జీవించాలి.

అయితే దేహం చేసే కర్మలను నేను చేస్తున్నానని చెప్పుకుంటాము కదా, అసలు చిక్కంతా ఇక్కడే వస్తుంది.

అదేంటంటే కర్మ జడం కాబట్టీ అది మనల్ని బంధించదు, నేను చేస్తున్నాను అన్న భావమే బంధాన్ని కలుగజేస్తుంది.

ఈ కర్తృత్యం వుంటేనే కర్మల ప్రభావం మనపై వుంటుంది, కర్తృత్వం లేకపోతే ఏ ప్రభావం వుండదు.

ప్రతివ్యక్తి కర్మలనే ఇష్టపడతాడు, కారణం తన ప్రాబల్యాన్ని చాటేవి అవే కాబట్టీ! ప్రాబల్యం పెంచుకుంటూ తన జ్ఞానస్వరూపాన్ని విస్మరిస్తాడు మనుజుడు! కర్మలన్నీ
బంధహేతుకమన్న సత్యాన్ని గ్రహించడు! ఫలితం, జననమరణ చట్రంలో ఇరుక్కుంటాడు!

కర్మలు ఆచరించే అధికారం మనకు వుంది, కానీ ఆ కర్మఫలితాలు మన చేతుల్లో వుండవు! దాన్ని గ్రహించినవాడే జ్ఞాని! ఆ ప్రకారము నడుచుకున్నవాడే యోగి! అతడు మాత్రమే యోగాన్ని అనుభవించగలడు!

నేను చేస్తున్నానని భావించి (కర్తృత్యము), ఫలితముల యందు ఆసక్తితో కర్మలను చేసి, వాటి ఫలితాన్ని అనుభవించుటకు ఈ జన్మ చాలకపోతే ఇంకొన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుంది. దానినే ప్రారబ్ధకర్మ అంటారు.

ఈ కర్తృత్యమును మానవుడు అనవసరంగా తన నెత్తినవేసుకొని బాధపడుతున్నాడు. తను తెచ్చింది లేదు, వెంట తీసుకుపోతున్నది లేదు.

మనం పుట్టక మునుపు, మరణము పిమ్మట ఇది ఎవరిదో? అది ఎవరో తెలుసుకొనుటకు సాధనచేయాలి. అప్పుడు బ్రహ్మాండమును నడుపువాడు దైవమని తెలుస్తుంది.

అతని అంశయే ఈ చరాచర జగత్తు. మానవుడు కేవలం నిమిత్తమాత్రుడు. మనతో పనులు చేయుంచునదియు అతడే. అతడే సూత్రధారి. అనంత కాలమును, అనంత సృష్టిని అతడే నడుపుతున్నాడు.

కర్మరాహిత్య స్థితి అనేది వుండదు. జీవించినన్నాళ్లు కర్మ అనివార్యము. అందుకే జీవుడు చేసే అన్ని కర్మలను నిష్కామంగా చెయ్యాలి (కర్మలో అకర్మ), నిష్కామకర్మనే కర్మగా భావించాలి (అకర్మలో కర్మ)! దాన్నే కర్మయోగము అంటారు. యోగులు చేసేది అదే!

జీవునిలో నెలకున్న పరమాత్మను అనుభూతి పొందడానికి, జీవుల ముందున్న ఏకైక మార్గం ఇదే! సంసారికైనా, సన్యాసికైనా ఈ నిష్కామకర్మే పునాది!

ఆసక్తితో, కోరికలతో, ఫలాపేక్షతో, అహమనే భావముతో చేసినది కేవలం కర్మ. ఇది బంధాన్ని కలుగజేస్తుంది. అనాసక్తితో, ఫలాపేక్ష లేకుండా, ఎటువంటి కోరికలేక, అహమనే భావమును విడచి చేయు కర్మ, కర్మయోగంగా మారిపోతుంది.

జీవుడు కర్మ చేయడం, చేయకపోవడం ముఖ్యంకాదు. హృదయమందు, మనస్సునందు మాలిన్యము అంతరించడమే
ప్రధానము.

తాము చేస్తున్న కర్మలవలన జీవుల గుణము బయటపడుతుంది. వ్యక్తిలో దాగివున్న సత్వ, రజో, తమో గుణములు కర్మలరూపంలో తేటతెల్లమవుతాయి. ఎంత కపటాన్ని ప్రదర్శించినా కూడా అవి ఒకానాకప్పుడు బయటపడితీరుతాయి.

జ్ఞానము అంటే శుద్ధ ఎరుక జ్ఞానం అంటే, ఏదైనా ఒక విషయముపై సంపూర్ణమైన అవగాహన కలిగివుండుట.

జ్ఞానం రెండు రకాలు - భౌతిక జ్ఞానం! ఆధ్యాత్మిక జ్ఞానం!

భౌతిక జ్ఞానం - "పదార్ధము”తో కూడినది!

ఆధ్యాత్మిక జ్ఞానం - "పదార్దము”తో చేరినది!

పదార్ధం యొక్క లక్షణాలు (PHYSICAL PROPERTIES) తెలిపేది భౌతిక జ్ఞానం!

పదార్ధము యొక్క చైతన్యాన్ని (Quintessence) తెలుసుకొనేది.

జ్ఞానములేని కర్మాచరణము, ఆచరణలేని జ్ఞానమువలన ఉపయోగములేదు. పండితులు ఈ రెండింటికి భేదకల్పన చేసి వాదనలతో వృధాగా కాలయాపన చేస్తుంటారు.

సన్యాసమునకు కూడా నిష్కామకర్మయే పునాది. ఈ పునాది దృఢంగా ఉంటే భౌతికంగా సన్యసింప అవసరము లేకుండా పరబ్రహ్మమును తెలుసుకోగలడు.

జ్ఞానముతో చేయుకర్మే యజ్ఞము. యజ్ఞము చేయువాడు, హెూమమొనర్చు ద్రవ్యములు, హుతమొనర్చు అగ్ని శ్రాద్ధక్రియ ఫలితమూ బ్రహ్మార్పణమే.

జీవితమందలి సర్వకర్మలను యజ్ఞదృష్టితో చేయడాన్నే "బ్రహ్మకర్మసమాధినిష్ఠ” అంటారు. ఈ నిష్ఠ గలవాడు పరబ్రహ్మస్థితిని పొందుతాడు.

ద్రవ్యం, ధనం వలన సాధించబడే యజ్ఞంకంటే, జ్ఞానయజ్ఞము శ్రేష్టమైనది. ఎందుకంటే సమస్తకర్మలు జ్ఞానంతోనే పరిసమాప్తం అవుతాయి కాబట్టీ!

కొంతమంది దానధర్మాలే యజ్ఞంగా, తపస్సే యజ్ఞంగా, యోగసాధనే యజ్ఞంగా, వేదాధ్యయనమే యజ్ఞంగా భావించి జ్ఞానయజ్ఞము చేస్తారు. కొందరు ప్రాణాయామపరులు వాయుగతులను నిరోధించి అపానంలో ప్రాణము, ప్రాణంలో
అపానము హెూమం చేస్తారు.

భగవంతుని ఆరాధన విషయంలో కర్మలవలన ఒక ఫలితం, జ్ఞానంవలన ఒక ఫలితం లభిస్తాయి! అయితే కర్మజ్ఞానములు రెండింటినీ సమన్వయ పరుచుకొని భగవత్తత్వాన్ని తెలుసుకున్నవాడు ముక్తిని పొందగలడు!!

యోగులు బ్రహ్మమనే అగ్నితో, ఆత్మచేత తమ ఆత్మనే ఆహుతి చేస్తారు. వారిని వినయవిధేయతలతో నమస్కరించి,
సర్వస్యశరణాగతి నొంది, వారిని సేవిస్తూ, సమయం సందర్భం చూసి ప్రశ్నించి తెలుసుకోవాలి.

జ్ఞానమనే అగ్ని సర్వకర్మలను భస్మం చేస్తుంది. జ్ఞానంతో సరితూగే పవిత్రమైన వస్తువు ప్రపంచంలో ఇంకొకటి లేదు. జ్ఞానము కలిగిన వెంటనే పరమశాంతి లభిస్తుంది.

జ్ఞానంలేని కర్మాచరణ, ఆచరణలేని జ్ఞానం వలన ఉపయోగం లేదు! సన్యాసానికి కూడా ఇదే పునాది!

అందుకే తప్పక ఆచరించాల్సిన కర్మలను జ్ఞానంతో ఆచరించు! ఎటువంటి భావన లేకుండా ఆచరించు! భావన లేదు కాబట్టీ, తప్పకా దాన్ని ఈశ్వరుడు స్వీకరించవలసిందే! అప్పుడది కర్మయోగంగా మారిపోతుంది!

పరమాత్మ అనుగ్రహం పొందడానికి జీవుల ముందున్న ఏకైక మార్గం ఇదే! సంసారికైనా, సన్యాసికైనా ఆత్మానుభూతికి ఈ నిష్కామకర్మే పునాది!

కొందరు కర్మలతో, కొందరు జ్ఞానంతో, కొందరు ధ్యానంతో, కొందరు వైరాగ్యంతో "ఆత్మానందాన్ని” పొందుతారు! మార్గమేదైనా చిత్తశుద్ధి తప్పనిసరి!

ఆత్మజ్ఞానానికి, చిత్తశుద్ధి ప్రధానం! చిత్తమాలిన్యంతో అరణ్యవాసం ఉపయోగంలేదు! చిత్తశుద్ధితో జనవాసం ఆటంకంలేదు!

అందరూ బ్రతకాలి కర్మమార్గం! అందర్నీ బ్రతికిస్తూ, తాను బ్రతికి,సత్యాన్ని గ్రహించాలి - జ్ఞానమార్గం!

కర్మలను జ్ఞానంగా, జ్ఞానాన్ని సత్యంగా పరిశోధించు! అసలు సత్యం త్వరలోనే తెలుస్తుంది!

రామకృష్ణ పరమహంస అనన్యభక్తితో, స్వామి వివేకానంద అమోఘ జ్ఞానంతో, రమణ మహర్షి ఆత్మశోధనతో, వేదాంత ప్రభుపాదులు నామజపంతో, పరమహంస యోగానంద క్రియాయోగంతో, దయానంద సరస్వతి సంఘసేవతో "బ్రహ్మమును” పొందేరు! వారి దారులు వేరైనా “గమ్యం” ఒక్కటే!

జీవుడు శుద్ధత్వంతో జన్మిస్తాడు కాబట్టి శుద్ధత్వంతో శరీరత్యాగం చెయ్యాలి! అందుకు తగిన జ్ఞానం జీవునికి పరమాత్మ ప్రసాదించేడు!

జ్ఞానంతో ఆలోచిస్తే సృష్టి మధురం, జన్మ మధురం, కర్మ మధురం, జ్ఞానం మధురం, ధ్యానం మధురం, యోగం మధురం, అనుభూతి మధురం. అదే బ్రహ్మానందం! ఆత్మానందం!     

No comments:

Post a Comment