Sunday, October 20, 2024

****అహింస.....హింస ఏ రంగానికీ అతీతం కాకుండా పోయింది.

 శ్లో॥ అహింసా సత్య మక్రోధః  
త్యాగః శాంతి రపై శునం।  
దయా భూతేష్వ లోలుప్త్వం  
మార్దవం హ్రీర చాపలం॥

తా॥ అహింస, సత్యం, కోపం లేకుండుట, త్యాగం, శాంతి, చాడీలు చెప్పకుండుట, భూతదయ, విషయలోలత్వం లేకుండుట, మృదుస్వభావం, సిగ్గు, చపలత్వం లేకుండుట - (దైవీసంపద) 

అహింస.....

హింస చేయకుండా ఉండటమే అహింస. హింస అంటే కొట్టటం, నరకటం, చంపటం మాత్రమే కాదు; తిట్టటం, దుష్ప్రచారం చేయటం, నిందలు వేయటం, ఇతరులను తమ చర్యల ద్వారా బాధించటం కూడా హింసయే. శరీరంతోగాని, వాక్కుతోగాని, మనస్సుతోగాని, సాధ్యమైనంత వరకు ఇతరులకు బాధ కలిగించకుండా ఉండటమే అహింస, ఒక్కొక్కప్పుడు ఏది హింసయో, ఏది అహింసయో చెప్పటం కూడా కష్టమే. కాయకూరలు తరిగేటప్పుడు, చిమ్మేటప్పుడు, వంట చేసేటప్పుడు, నడిచేటప్పుడు ఎన్నో సూక్ష్మజీవులు చనిపోతాయి. హింస చేసినట్లేనా? నేను ఉపన్యాసం చేస్తుంటే మాటల ఉరవడికి వేడి పుడుతుంది. ఆ వేడిలో కొన్ని సూక్ష్మజీవులు చనిపోతాయి. హింస చేసినట్లేనా? డాక్టరు సూదితో ఇంజెక్షన్ చేసేటప్పుడు, కత్తులతో ఆపరేషన్ చేసేటప్పుడు ఎంతో బాధ. హింస చేసినట్లేనా? తల్లిదండ్రులు బిడ్డలను తిట్టి, కొట్టి మంచి మార్గంలో పెట్టాలనుకుంటారు. హింస చేసినట్లేనా? ఇదంతా హింస క్రిందకు రాదు. అలాగే యజ్ఞాలలో పశుహింస, యుద్ధాలలో శత్రునాశనం హింస క్రిందకు రాదు. "స్వార్థంతో చేసే హింసయే హింస". సొమ్ముల కోసం దొంగలు గొంతుపిసికి చంపితే హింస అవుతుంది. మత కల్లోలాలు రెచ్చగొట్టి రాజకీయ నాయకులు చేసేది హింస అవుతుంది. ఉగ్రవాదులు బాంబులుపెట్టి అమాయకులను చంపితే హింస అవుతుంది. అందుకే ఇళ్ళు తగలబెట్టిన వారిని ఆతతాయినులు అంటారు. మరి హనుమంతుడు ఒకటీ రెండు కాదు మొత్తం లంకా నగరాన్నే తగులబెట్టాడు. ఆయనను దేవుడుగా పూజిస్తున్నాం.  

ఒకడు ఎవరినైనా హత్యచేస్తే ఉరిశిక్ష పడుతుంది. అదే యుద్ధంలో శత్రుసేనలను చీల్చిచండాడిన వాడికి పరమవీర చక్ర బిరుదు నిచ్చి సత్కరిస్తాం. 18 రోజులలో 18 అక్షౌహిణుల సైన్యాన్ని సర్వనాశనం గావించిన శ్రీకృష్ణుని భగవంతునిగా పూజిస్తాం. మరి ఆయన అహింసామూర్తి ఎలా అయ్యాడు ? ఈ జగత్తంతా విరాట్ పురుషుని శరీరం. ఆ శరీరంలో కౌరవులనే ఒక అంగం కుళ్ళి చెడిపోయింది. అది సంధులు, రాయబారాలు, రాజీలు అనే మందులతో తగ్గే జబ్బుకాదు. ఆపరేషన్ చేయాల్సివచ్సింది. మంచి కాంపౌండరు కావాల్సి వచ్చింది. అందుకు అర్జునుడే తగిన వాడని నిశ్చయించి జగద్ వైద్యుడైన శ్రీకృష్ణుడు చక్కగా ఆపరేషన్ నిర్వహించాడు. చెడిపోయిన - కుళ్ళిపోయిన అంగాన్ని తీసివేసి మిగిలిన దేహాన్ని ఆరోగ్యంగా ఉంచాడు. అందుకే శ్రీకృష్ణుడు అహింసావాది అయ్యాడు.

భయంకరమైన అంగుళీమాలుడనే రాక్షసుడు ఎదురుపడినా, నిర్భయంగా నిలిచి తన ప్రశాంత వదనంతో అతడిలో మార్పు తెచ్చిన మహాత్ముడు బుద్ధుడు. అహింసయే పరమ ధర్మమని బోధించిన మహాత్ముడు.

ఈనాడు ఎక్కడ చూచినా హింసా ప్రవృత్తియే. రాజకీయం అంతా హింసామయం. వినోదాన్నందించే సినిమాలు హింసామయం. ఇప్పుడు టి.వి. లలో ప్రసారమయ్యే సీరియల్స్ అన్నీ కుట్రలు - కుతంత్రాలు - మోసాలు - హింసలతో నిండిపోయాయి. ఇక ఆధ్యాత్మిక ముసుగులో దొంగ బాబాలు, సన్యాసులు, స్వామీజీలు ధనకాంక్షతో హింసాప్రవృత్తిని పెంచి పోషిస్తున్నారు. కొందరు స్వామీజీలు ఉపన్యాసాలతో జనాన్ని హింసిస్తారు. కొందరు శిష్యులు గురువులపై చాటుగా నిందలువేస్తూ హింసిస్తారు అంతా హింసామయం. హింస ఏ రంగానికీ అతీతం కాకుండా పోయింది.  

దైవానికి దగ్గర కావాలంటే అహింసా మార్గంలో ప్రయాణించాలి. సంపాదించుకున్న పుణ్యఫలం వ్యర్థం కాకుండా ఉండాలంటే అహింసయే పరమధర్మం.        

No comments:

Post a Comment