Vedantha panchadasi:
అధిష్ఠానతయా దేహద్వయావచ్ఛిన్న చేతనః౹ కూటవన్నిర్వికారేణ స్థితః కూటస్థ ఉచ్యతే ౹౹22౹౹
22. ఆధారమైన చైతన్యముపై స్థూల సూక్ష్మదేహములు రెండూ కూడా ఆరోపింపబడుచు చైతన్యమును సీమీతము చేయుచున్నవి.కానీ ఆ చైతన్యము మాత్రము కమ్మరి యొక్క ఇనుపకూటము వలె
ఏ వికారమును పొందక ఉండును.
ఈ నిర్వికారమైన చైతన్యమే కూటస్థము.
కూటస్థే కల్పితా బుద్ధిస్తత్ర చిత్ర్పతిబింబకః ౹
ప్రాణానాం ధారణాజ్జీవః సంసారేణ స యుజ్యతే ౹౹23౹౹
23. కూటస్థ చైతన్యముపై బుద్ధి ఆరోపింపబడుచున్నది.బుద్ధి యందు ప్రతిఫలించిన చైతన్యము ప్రాణములను ధరించుటచే జీవుడనబడు చున్నది.
ఈ జీవుడు జన్మమృత్యురూపమైన సంసారమున బద్ధుడగుచున్నాడు.
వాఖ్య: చైతన్యమునకు ఆద్యంతములు లేవనుట స్పష్టము. కానీ జననమరణములకు లోనగుచున్న చైతన్యమును చూడక మనకు తప్పుట లేదు. కనుక జన్మమృత్యు లక్షణమైన చైతన్యము వాస్తవ చైతన్యము కాదనీ అది చైతన్యాభాసమనీ సిద్ధాంతము చేయబడినది. ప్రాణములతో కూడిన ఈ చైతన్యాభాసకే జీవుడని పేరు.
అభాసవాదమనగా మాయకు అధిష్టానమై,మాయయందు శుద్ధ చైతన్యాభాసము జీవుడు.
నేను జీవుడను దేహము నాది కళత్ర పుత్రాదులు నావారు ఇట్టి అనాత్మపదార్థముల యధ్యాసను భ్రాంతిని మోహమును త్యజించవలెను.ఈ అధ్యాస అభాసరూపమైనది.సత్యము కాదు.
అవిద్యాకార్యమేమన,లేనిదానిని ఉన్నట్లు కల్పించుటయగును. ఇదియే అభాసమగును.ఈ అభాసమెట్టిదనగా,
ఒకానొకడు స్వగ్రామమును వదలి మరియొక గ్రామమునకు వెళ్ళేను.అచ్చట నున్న వస్తు సందోహముచేతను కొంతకాలముండుటచేతనూ జన సంసర్గము చేతను మూఢుడగుటచే తన గ్రామమును మరిచెను.
అందుచే తానెచ్చటనుండి వచ్చినదియు స్మృతికి రాకపోయెను.
తర్వాత అతని గ్రామములో నున్న యొకానొక ఆప్తుడు వచ్చి యా మూఢునికి తనగ్రామమును తన విశ్రాంతి ధామమును గుర్తుపరచెను. తర్వాత స్వగ్రామమును దెలిసికొని వాడు
సుఖి యాయెను.
గ్రామాంతరమనునది మధ్యలో వచ్చినది.ఆలాగున జీవుడను వ్యవహారము మధ్యలో వచ్చినది. ఈ జీవత్వము,నేను జీవుడను అనునది అధ్యాస(కల్పితము).
జీవేశ్వరులనగా మాయాభాసులు.
వారిద్దరిచేతనే జగదుత్పత్తి యాయెను.జీవత్వ ఈశ్వరత్వ వ్యవహారములు కల్పితములు. అభాసమనగా నిజముగా తోచునది,విచారించిన లేనిది.
పరబ్రహ్మము నిర్విషయము, నిర్వికారము కానీ స్థూల సూక్ష్మదేహములు రెండూ కూడా ఆరోపింపబడుచున్నాయి.
స్పష్టమగు దృష్టివలన అవగాహన వలన విచారణ వలన భ్రాంతితో గూడిన అవగాహన అదృశ్యమగును.
నిర్వికారమైన చైతన్యమే కూటస్థము.
పట్టువిడువని ఆలోచనవలన సూక్ష్మశరీరము స్థూలభౌతిక శరీరమగును.
దృఢమయిన జ్ఞానాభ్యాసముచేత
పదార్థము-మనస్సు,
స్థూలము-సూక్ష్మము
ఒకే అపరిచ్ఛిన్న చైతన్యమని చక్కగా అవగతమగునంతవరకు వివేకవంతుడగు సాధకుడు వానిని నిర్మలముగావించుటకు గట్టిగా ప్రయత్నింపవలెను.
దృశ్యము శుద్ధ(కేవల) చైతన్యముగా కనిపించునప్పుడు, అది స్వప్నముతో సమానమగును. అగ్నిలో వేయబడిన సమస్తము ఒకే బూడిదయగునట్లు సర్వదశలు ప్రపంచ దృశ్యముగూడ జ్ఞానాగ్నివలన ఒక్కటిగా కుదింపబడును.
చైతన్యమే ఈ స్థూలప్రపంచముగా అగుపించుచున్నది.దీనిని అవగతము గావించుకొన్నప్పుడు పదార్థమున్నదను నమ్మకము తొలగును.
అట్టి జ్ఞాని సంసారమును దాటి సర్వకర్మలను అంతమొందించుకొనును.
No comments:
Post a Comment