Vedantha panchadasi:
బుద్ధతత్త్వేన ధీదోషశూన్యేనైకాంతవాసినా ౹
దీర్ఘుం ప్రణవ ముచ్చార్య మనోరాజ్యం విజీయతే ౹౹62౹౹
62. బ్రహ్మాత్మైక్య లక్షణమగు తత్త్వమును అవగతము చేసికొనిన పురుషుడు కామాది బుద్ధి దోషములను పరిత్యజించి ఏకాంతమున నివసించుచు దీర్ఘకాలము ప్రణవ (ఓంకార) జపమును అభ్యసించినచో మనో రాజ్యము జయింపగలడు. అష్టాంగయోగసాధన లేని వారికి మార్గము చెప్పబడినది.
జితే తస్మిన్ వృత్తిశూన్యం మనస్తిష్ఠతి మూకవత్ ౹
ఏతత్పదం వసిష్ఠేన రామాయ బహుధేరితమ్ ౹౹63౹౹
63.మనోరాజ్యమును జయించినచో ఏ ఊహలు లేకపోవుటచే మనస్సు ఎట్టి వృత్తులకును లోనుగాక మూగవానివలె నిశ్శబ్దముగ ఉండును.ఈ పద్ధతి అనేక విధములుగ వశిష్ఠమహర్షి
శ్రీ రామచంద్రునకు చెప్పెను.
దృశ్యం నాస్తీతి బోధేన మనసో దృశ్యమార్జనమ్ ౹
సంపన్న చేత్తదుత్పన్నా పరా నిర్వాణ నిర్వృతిః ౹౹64౹౹
64. "నేహ నాసక్తి కించ" బృహదారణ్యక ఉప.4.4.19;కఠ ఉప.4.11మొదలగు శ్రుతివాక్యములు బోధించునట్లు అద్వితీయ బ్రహ్మము తప్ప దృశ్య జగత్తు మిథ్యయను బోధచే మనస్సునందలి ద్వైతమును తొలగింప గలిగినచో నిరతిశయ మోక్షసుఖము సిద్ధించును. యోగవాశిష్ఠము వైరాగ్యప్రకరణము 3.6
నిత్యము పరబ్రహ్మధ్యాన మనన్యచింతతో జేయనివానికి బ్రహ్మపద మందదు.కావున జిజ్ఞాసువు మోక్షసుఖము కొఱకు సర్వదా,సర్వవస్థలయందు,
పరబ్రహ్మధ్యాన నిష్ఠయందుండవలయును.
తత్త్వమస్యాది మహావాక్య శ్రవణ,మనన,నిదిధ్యాసనముల జేయవలయును.
ఈ విధముగా జేసిన వారి హృదయము దూదివలె పవిత్రమై యుండును.మాయా మయమైన బహుజన్మ సమస్తవిషయ వాసనలు యోగధ్యాన తపములచే నశించును.
వీరికి శీఘ్రముగా ఆత్మసిద్ధి గలుగును.అగ్ని ప్రవేశించినప్పుడు దూది యేలాగున భస్మమగుచున్నదో,
ఆలాగుననే గురూపదేశ సమయమందు హృదయగ్రంథులు నశించి స్వరూపసిద్ధి గలుగును.
యోగసాధన లేనివారు కొంతకాలము జనబాహుళ్యము లేని నిర్మలస్థలమందుండి ప్రణవ (ఓంకార)మంత్రమును మాత్రము ఆత్మనుసంధానముగా ధ్యానము జేయవలయును.
అనగా నేను పంచకోశవిలక్షణుడను, అవస్థాత్రయ సాక్షిని, దేహత్రయాతీతుడను,
నిత్య శుద్ధ బుద్ధ ముక్తుడై,ఓంకార వాచ్యుడైన పరమాత్మ శుద్ధ శివస్వరూపుడ నేనని ధ్యానించునప్పుడు మల,అజ్ఞాన,విక్షేపములను హృదయగ్రంథులు భిన్నమై మేఘము వదలిన సూర్యునివలె స్వయముగా స్వస్వరూపస్థితి గలుగును.
శివస్వరూపమైన పరమాత్మ వేరు,జీవుడనైన నేను వేరు అను భావమును విడిచి యేయొక్క శివస్వరూప ముండునో,అది నేనను అద్వైతచింత జేయవలయును.
పిచ్చివాడు అద్దములో ప్రతిఫలించినపండ్లను ఆస్వాదించుటవలె ఈ ప్రపంచము లోని సుఖములన్నియు భ్రాంతి మూలకములె.
మనస్సును ఇంద్రియములను జయించి దైర్యముతోనుండవలెను.
బ్రహ్మము,ప్రపంచము తుల్యములు కావు,భిన్నములు కూడ కావు.ఇది అంతయు తత్త్వము యొక్క ప్రతిబింబమే.బ్రహ్మము తప్ప వేరేదియులేదు.
'నేను దీనికికకంటె భిన్నముగానున్నాను' అన్న ఊహను వదిలి వేయవలెను.
ఏకైకమగు ఆత్మ తనను అపరిచ్చిన్న చైతన్యముగా తనలో దర్శించును.అందువలన దుఃఖముగానీ,భ్రాంతిగానీ,
జన్మ (సృష్టి)గానీ ప్రాణిగానీ లేదు.ఉన్నదేదో అదే ఉన్నది.
దుఃఖరహితుడుగా,ద్వైతరహితుడుగా ఆత్మనిష్ఠుడవై వుండవలెను.
అద్వితీయ బ్రహ్మము తప్ప దృశ్య జగత్తు మిథ్యయను బోధచే మనస్సునందలి ద్వైతమును తొలగింప గలిగినచో నిరతిశయ మోక్షసుఖము సిద్ధించును.
No comments:
Post a Comment