☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
6. *సం గచ్ఛధ్వం సం వదధ్వమ్*
కలసి నడుద్దాం, కలసి మాట్లాడుదాం.
సహజీవనంపై వేదం ప్రత్యేక దృష్టిని చూపించింది. సృష్టితో సామరస్యం సాధించడమే వ్యక్తి ఔన్నత్యానికి నిదర్శనం. ఈ 'సహా'నుభూతి అనేది మనుషుల మధ్యనే కాదు -సమస్త విశ్వంతోనూ మనిషి సాధించాలి. ఆ ఐక్యత ప్రధానం.
కలసి సాగించే జీవన గమనం ప్రగతికి, పురోగతికి చాలా అవసరం. ఒక వ్యక్తి
జీవనం ఇతర ప్రకృతిని నశింపజేసేదిగా ఉండకూడదు. ఒకరుదుఃఖపడుతూంటే, ఒకరు సుఖపడడం అనేది ధర్మవిరుద్ధం. స్నేహశీలత, సహకార భావన - అనేది భారతీయ జీవన విధానంలో ఉంది. ఇటువంటి వేదవాక్యాలే దీనికి
ప్రమాణం. మనస్సునీ, మాటనీ స్నేహపూర్వకంగా సమన్వయపరచుకో గలిగిప్పుడు శాంతి సులభసాధ్యం.
'కలసి నడుద్దాం' - అనేది జీవనగమనాన్ని తెలియజేస్తే, ‘కలసి మాట్లాడుదాం’
అనేది వ్యక్తీకరణని తెలియజేస్తుంది. మనందరి ప్రవర్తన, అభిప్రాయం వ్యక్తీకరణం
ఏకమవ్వాలి. అవి 'విశ్వశ్రేయస్సు' అనే లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని సాగాలి.
లక్ష్యపరమైన ఈ ఐక్యతే హృదయాలనీ, గమనాలనీ సమన్వయపరుస్తుంది.
వేర్పాటు వాదాలనీ, విడదీసి చూడడానిని వేదసంస్కృతి ఏనాడూ సమర్థించలేదు.
సృష్టిలో చెట్టుతో, పుట్టతో, మానుతో, వాగుతో..ప్రతి అణువుతో సామరస్యం
సాధించి, విశ్వమయత సిద్ధింపజేసుకోవడానికి తగ్గ సాధనాలనే వేదం బోధించింది.
ప్రకృతిలో 'క్షేమం' అనేది 'పరస్పర స్నేహం' అనే ఏకసూత్రం మీద సాధ్యమౌతుంది.
ఈ ఐక్యత లేనప్పుడు విభేదాలు ఎక్కువౌతాయి. కలిసి బ్రతకాల్సిన వారంతా ఈ వేదవాక్యాన్ని మంత్రంగా మననం చేసుకోవాల్సిందే. ఓ ఇద్దరి మధ్య హృదయం,
మాట... ఈ రెండూ ఒక్కటే అయినప్పుడు, ఇద్దరి నడత, పలుకు ఒకే అభిప్రాయాన్ని
తెలియజేస్తాయి. అటువంటప్పుడు ఇద్దరి ప్రయత్నాలూ, కృషి ఏకోన్ముఖమై విశేష
ఫలాన్నిస్తాయి.
ఒక కుటుంబం, స్నేహితులు, ఒక సంఘం, ఒక సమాజం ... అంతా ఈ
సూత్రాన్ని మనస్సులో ఉంచుకొని, ఆ సామరస్యం కోసం చిత్తశుద్ధిగా పాటుపడితే
క్షేమానికీ, సౌఖ్యానికీ కొదవేముంటుంది?
No comments:
Post a Comment