Thursday, November 21, 2024

 "ఆత్రేయగీత"

నాల్గవ భాగం

"సూక్ష్మజ్ఞానము” - 6వ భాగము.

- శ్రీ శాస్త్రి ఆత్రేయ

జీవునికి, భగవంతుడికి ఉపాధికి సంబంధించిన అనేక భేదములు యున్నప్పటికీ “చైతన్యాంశ” మాత్రము యిరువురుకి సమానమే కావునా జీవేశ్వరులిరువురును ఒకటేయని “అయమాత్మాబ్రహ్మ”, “తత్వమసి" అనెడి మహావాక్యములు బోధిస్తున్నాయి.

ఆకాశమున ఎగురుటకు పక్షులకు ఎలాగైతే
రెండురెక్కలు కావాలో అలాగే మానవులు పరమాత్మను చేరుటకు కర్మ-జ్ఞానములు అవసరము. కర్మ అంటే నిష్కామకర్మ అని భావించాలి. దానివలనే జ్ఞానము ఉదయిస్తుంది.

జ్ఞానము పరిపక్వతజెంది సమాధి స్థితి కలిగినప్పుడు కర్మలతో పనిలేదు. కొందరు లోకకల్యాణం కొరకు కర్మలు చేస్తారు, కొందరు చేయరు. వారు కర్మని అకర్మగా, అకర్మని కర్మగా భావిస్తారు. అంటే వారు చేసే కర్మలు అసంగముగా చేస్తారు కావునా కర్మబంధము యుండదు.

నిష్కామకర్మ ద్వారా చిత్తశుద్ధి కలిగి జ్ఞానోదయమైన పిమ్మట సాధకుడు క్రమముగా ద్వైతమును (రెండుగా భావించుట, జీవాత్మను పరమాత్మను వేరుగా భావించుట) వీడి, అద్వైతమును (అంతా ఒకటే, జీవాత్మ-పరమాత్మను ఒక్కటిగా భావించుట) అవలంబించుట జరుగుతుంది. ఈ విచారణాత్మకమైన సాధన మనుజుని జీవన్ముక్తునిగా (జీవించియుండగా ముక్తిని పొందడం) చేస్తుంది.

మానవుడు సహజంగా పొందిన ఎరుకను,
జ్ఞానముగా మార్చు ప్రక్రియనే జ్ఞానయోగమని, గీత పేర్కొంది. పరబ్రహ్మవస్తువును తెలుసుకోనుటే జ్ఞానము. దీనినే ఆత్మజ్ఞానమని అంటారు. ఈ జ్ఞానాన్ని అందించునదే ఆధ్యాత్మవిద్య. ఇది అన్నివిద్యల కంటే శ్రేష్ఠమైనది. జరామరణాది దుఃఖములనుండి విముక్తిపొందాలంటే ఆత్మజ్ఞానమును పొందితీరవలసినదే. ఇంకొక మార్గములేదు.

అంటే ఎచ్చటనుండి వచ్చామో, అక్కడికి
చేరుకోవడమే. పరమాత్మనుండి విడిపడిన జీవాత్మ (జీవుడు) మళ్ళీ పరమాత్మను చేరుకోవడమే! అలా చేరినప్పుడే వ్యక్తి జీవిత నాటకము సమాప్తమవుతుంది, అంతేకాని జీవుని మరణముతో సమాప్తము కాదు. జీవాత్మ, పరమాత్మతో విలీనం కానంతసేపు జీవునికి జనన మరణాలు తప్పవు. జీవుని పరమాత్మతో చేర్చునదియే జ్ఞానము. ఇది నిష్కామ కర్మాచరణ వలన మాత్రమే సిద్ధిస్తుంది.

జ్ఞానముతో చేయుకర్మను యజ్ఞమని అందురు. యజ్ఞము చేయువాడు, హెూమమొనర్చు ద్రవ్యములు, హుతమొనర్చు అగ్నియు పరబ్రహ్మస్వరూపములే, యజ్ఞఫలితము కూడా బ్రహ్మార్పణమే. అటులనే శ్రాద్ధకాలమందు శ్రాద్ధము చేయువాడు, భోక్తలు, వారు భుజించు అన్నము పరబ్రహ్మస్వరూపమే. ఆ శ్రాద్ధక్రియ ఫలితమూ బ్రహ్మార్పణమే. ఇట్టి భావముతో జీవితమందలి సర్వకర్మలను యజ్ఞ దృష్టితో చేయుటయే బ్రహ్మకర్మ సమాధినిష్ఠ ఇట్టి నిష్ఠ గలవాడు పరబ్రహ్మస్థితిని పొందుతాడు.

ద్రవ్యం, ధనం వలన సాధించబడే యజ్ఞంకంటే, జ్ఞానయజ్ఞము శ్రేష్ఠమైనది. ఎందుకంటే సమస్తకర్మలు జ్ఞానంతోనే పరిసమాప్తం అవుతాయి! కొంతమంది దానధర్మాలే యజ్ఞంగా, తపస్సే యజ్ఞంగా, యోగసాధనే యజ్ఞంగా, వేదాధ్యయనమే యజ్ఞంగా భావిస్తారు. కొందరు ప్రాణాయామపరులు వాయుగతులను నిరోధించి అపానంలో ప్రాణము, ప్రాణంలో అపానము హెూమం చేస్తారు. యోగులు బ్రహ్మమనే అగ్నితో, ఆత్మచేత తమ ఆత్మనే ఆహుతి చేస్తారు. తత్వవేత్తలైన జ్ఞానులు అలాంటి జ్ఞానమునే ఉపదేశిస్తారు. జ్ఞానమనే అగ్ని సర్వకర్మలను భస్మం చేస్తుంది. జ్ఞానంతో సరితూగే పవిత్రమైన వస్తువు ప్రపంచంలో ఇంకొకటి లేదు. జ్ఞానము కలిగిన వెంటనే పరమశాంతి లభిస్తుంది!         

No comments:

Post a Comment