Wednesday, November 20, 2024

 🤝 *చెలిమి... కలిమి!* 🤝

సమాజంలోని వివిధ సంబంధ బాంధవ్యాలను ఒకే పుష్పగుచ్ఛంలోని అనేక రకాల పూలతో పోల్చవచ్చు. ఆయా సంబంధాలు వెదజల్లే ప్రేమ సౌరభాలతో సమాజం నిత్య నూతనంగా పరిమళిస్తుంది. తల్లిదండ్రులు పిల్లల పై వాత్సల్యాన్ని కురిపిస్తారు. రక్తసంబంధీకులు బాధ్యతను ప్రదర్శిస్తారు. బంధువులు ఆప్యాయతను కనబరుస్తారు. అగ్నిసాక్షిగా ఒక్కటైనవారు ప్రేమను పంచుతారు. కుటుంబ సభ్యులందించే ఆప్యాయత ఆదరణలతో పాటుగా ఎప్పటికీ వాడిపోని సంతోష కుసుమాలను పుష్పిస్తుంది స్నేహ పారిజాతం.

చిన్న చిరునవ్వు అపరిచితుల మధ్య స్నేహానికి బీజం వేస్తుంది. ఒక స్వల్ప సాయం స్నేహలత విస్తరించడానికి ఆలంబనగా నిలుస్తుంది. ఇద్దరు మనుషుల మధ్య అలా మొదలైన స్నేహబంధాన్ని బలంగా నిలిపేది నిష్కల్మషత్వం. కల్మష స్వభావం కటిక విషంతో సమానమైనది. స్నేహం చెరుకు గడలా మధురంగా ఉండాలంటే మిత్రుల హృదయాల్లో నిర్మలత్వం నిలువెల్లా ప్రసరించాల్సిందే. జన్మతః మనందరిలో ఉండే స్వార్థం, అసూయ వంటి తామస గుణాలు బలంగా వీస్తున్నప్పుడు స్నేహ దీపాన్ని ఆరకుండా నిలుపుకొనేందుకు స్నేహితులు ప్రయత్నించాలి. 

స్నేహం- రెండు అక్షరాలు. ప్రాణం రెండక్షరాలే. *విచిత్రం ఏంటంటే* *కుటుంబంలోని ఏ ఒక్క బంధాన్ని ప్రాణంతో ముడివేసి పలకలేం. స్నేహితులను మాత్రమే ప్రాణమిత్రులంటాం.* ప్రాణప్రదంగా చూసుకుంటాం. రహస్యాలను పంచుకుంటాం. ఓదార్పును అందుకుంటాం.

 *స్నేహం ఒక విచిత్రమైన సంబంధం. స్నేహితులు ప్రేమను పంచుతూనే మనపై పెత్తనం చెలాయిస్తారు.* వారిది అధికార దర్పం కాదు ఆత్మీయత, మమకారం నిండిన స్నేహ స్వభావం.. లింగ భేదం వయో తారతమ్యం ఎరుగని సంతోష కెరటాలపై ఓలలాడించే కాలప్రవాహం. ప్రాణస్నేహితుల సాహచర్యంలో గడిపే క్షణాలు జీవితంలో ఒక దశ దాటాక తరచుగా నెమరు వేసుకునే తీయని జ్ఞాపకాలుగా మారతాయి.

 మిగతా సమయాలలో కన్నా చిన్ననాటి స్నేహితుల సమక్షంలో ఉన్నప్పుడు వయస్సు తక్కువగా కనిపిస్తుందని ఒక అభిప్రాయం. తరచుగా స్నేహితుల సామీప్యంలో గడపడం వల్ల శారీరక రుగ్మతలు నయమై ఆరోగ్యం సిద్ధిస్తుందని వైద్య నిపుణుల సూచన స్నేహంలోని మధురిమలను ఆస్వాదించడానికి శ్రీమహావిష్ణువంతటివాడు కృష్ణావతారాన్ని అనువుగా చేసుకున్నాడు. బాల్య సఖులతోపాటు తిరిగిరాని బాల్యాన్ని తరిగిపోని అల్లరి చేష్టలతో నింపి గోకులంలో వేడుక చేశాడు.

మనుషుల్ని ఎదుటివారు అంచనా వేయడానికి కొంతవరకూ స్నేహితులు కూడా కొలమానం అవుతారు. *'నీ స్నేహితులెవరో చెబితే నీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పగలను'* అన్నది సుప్రసిద్ధ వాక్యం, బాల్యంలో అల్లరి చేష్టలకు పరిమితమైన స్నేహితులే యవ్వనంలో మార్గనిర్దేశకులుగా మారతారు. మానవ సంబంధాలన్నింటిలోనూ స్నేహం సరళంగా ఇమిడిపోతుంది.

 భార్యాభర్తలిద్దరూ స్వచ్ఛమైన స్నేహితులుగా మసలుకోవాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.. సీతారాముల మధ్య దాంపత్య సంబంధమే కాక ఒకరిని విడిచి మరొకరు ఉండలేని అపరిమితమైన స్నేహం ఉంది. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహంగా ఉండాలని చెబుతారు. చిన్నారులకు మనోవికాసం జరగాలంటే అమూల్యమైన స్నేహ స్వభావాన్ని తరుణ వయస్సు నుంచే అలవాటు చేయాలి. మిత్రత్వం ప్రజల హృదయాల మధ్య వారధిగా నిలిచి మానవతా పతాకాన్ని ఆవిష్కరిస్తుంది.

No comments:

Post a Comment