Sunday, November 3, 2024

****ఆప్తవాక్యాలు

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️

29. అయం మే హస్తో భగవాన్... శివాభిమర్శనః

ఈ నా హస్తం భాగ్యవంతమైనది... పవిత్ర స్పర్శగలది (అథర్వవేదం)

మన చేతిలో దాగిన శక్తులు ఎన్నో!

మన భావచైతన్యమంతా మన శరీరంలో వివిధ అవయవాల ద్వారా
ప్రసరించబడుతూంటుంది. అందులో ప్రధానమైనది చెయ్యి. ఈ చేయి ఆచరణ శక్తికి స్థానం. దేనిని స్పర్శించినా, ఆచరించినా ఈ చేతులతోనే కదా!

కొందరి చేతులు తగిలితే చాలు మనలో దాగిన దుష్టశక్తుల్ని సైతం బైటపడవేస్తాయి.ఇంకొందరి హస్తస్పర్శ దుష్టభావాల్ని మనలో ప్రసరింపజేయవచ్చు. అది ఆయా
వ్యక్తుల ఉత్తమ, అధమ సంస్కారాల స్థాయిని బట్టి ఉంటుంది.

మన భావనాశక్తిని కేంద్రీకరించి ప్రసరింపజేస్తే శరీరమంతా అది చేతనత్వం పొందుతుంది. ప్రత్యేకించి హస్తాలలో.

దీని రహస్యం తెలిసే భారతీయ సనాతన విజ్ఞానంలో కరస్పర్శకి సంబంధించి కొన్ని సంప్రదాయాలను నిక్షిప్తం చేశారు.

మంత్రజపం, పూజ వంటివి చేసేటప్పుడు కరన్యాసం, అంగన్యాసం చేస్తాం. అంటే మంత్రశక్తిని శరీరంలో ప్రసరింపజేయడానికి ముందుగా, చేతిలో ఉన్న ప్రతి వ్రేలిలోనూ, కరతలం (అరచేతులలోనూ ముందు శక్తిని 'న్యాసం' (ఉంచడం) చేస్తాం.ఆ చేతిలో స్పర్శతో శరీరమంతా మంత్రశక్తిని న్యాసం చేస్తాం. అంటే ముందుగా శక్తిని ప్రసరింపజేసుకొనే సాధనం హస్తమే.

ఈ హస్తం ద్వారానే దేవతాదులకు తర్పణం చేస్తాం. దేవతర్పణం, పితృతర్పణం,ఋషి తర్పణం - హస్తం ద్వారా జరుగుతుంది.

దీవించడం వంటివేకాక, గురువు శిష్యునకు ఇచ్చే దీక్షలలో హస్తస్పర్శ దీక్ష అత్యంత ప్రాముఖ్యమైనది. శిరస్సుపై కరాన్ని ఉంచి మహాత్ములు 'శక్తిపాతం' ద్వారా శిష్యుని
అనుగ్రహిస్తారు.

నిత్యదైవోపాసన ఉన్నవారి దక్షిణ హస్తంలో 'అగ్ని' నిహితమై ఉంటుందనీ, అందుకే వారికి ఏదైనా దానం చేస్తే అగ్నికి అర్పించిన (యజ్ఞం చేసిన) ఫలం లభిస్తుందనీ సంప్రదాయం.

నియమంగా నిత్యం అనుష్ఠించే మంత్రాన్ని మనసా జపిస్తూ, రెండు అరచేతుల్ని రాపిడి చేసి, ఆ మంత్రశక్తిని కరతలంపై ఆవహింపజేసినట్లు భావన చేసి - వేడెక్కిన ఆ అరచేతిని - ఏ వ్యాధిగ్రస్తుని, లేదా అనారోగ్య పీడితుని శరీరానికి తాకించితే
స్వస్థత శీఘ్రంగా చేకూరుతుంది. విభూదిని చేతిలోనుంచుకొని మంత్రించినా, ఈ అరచేతికున్న ‘దివ్యశక్తి గ్రహణ' సామర్థ్యం ద్వారా ఆ విభూది శక్తిమంతమవుతుంది.

విశేషమేమిటంటే - హస్తానికున్న ఐదు వ్రేళ్ళూ పంచభూతాలకి ప్రతీకలుగా, ఆ వేళ్ళతో 'లం పృథ్వీ తత్త్వాత్మనే...' మొదలైన మంత్రాలతో దేవతలకు పంచపూజ చేయడం ఆచారం.

మనలో చక్కని భావాలతో, ప్రేమ పూర్వకమైన ప్రశాంత చిత్తంతో, దైవాన్ని ధ్యానించి దేనిని స్పర్శించినా మన చేయి పవిత్రతను ప్రసాదించగలదు.

భగవత్శక్తి ప్రసరణకు స్థానభూతంగా ఉన్నది కనుక ఈ హస్తాన్నే 'భగవాన్'
అన్నారు. అంతేకాక దాని స్పర్శ 'శివం' కరమౌతుందనీ "శివాభిమర్శనః" అని
వేదవచనం.

ఇటీవల ఈ సనాతన వైదిక భావనే తిరిగి విదేశాలనుండి "Healing Touch" పేరుతో వస్తూ ఉంటే, ఆ నూతన విధానాలవైపు వెళుతున్నాం.

కానీ “పవిత్రస్పర్శ” అనబడే శక్తిసాధన వైదిక సంస్కృతిలో పరిపుష్టంగా ఉంది. ఆ విధానాన్ని మన నిత్య అనుష్టానాలలో అమర్చి అందించారు మన పెద్దలు.

కానీ మన సంప్రదాయాలపై, ధర్మంపై అవగాహన కోల్పోయి మన శక్తిని మనం గ్రహించలేకపోతున్నాం.

'భైషజ్య' వేద' (వైద్య సంబంధమైన అథర్వవేదంలోని ఈ సిద్ధమంత్రం స్పరాప్రధానమైన వైద్యవిధానాన్ని తెలియజేస్తోంది.

No comments:

Post a Comment