Wednesday, November 6, 2024

 ఆత్మీయ మిత్రులందరికీ శుభోదయం వందనాలు🌲🪴🌷🌻🌱🌾

    🍁మానవ సంబంధాల పట్టాల మీదనే మనిషి జీవితం ముందుకు సాగుతుంది. సాటి మనిషితో సఖ్యంగా ఉండాలి. బంధాలను ఏర్పరచుకోవాలి. మనిషితో మనిషి ఏర్పరచుకునే ఆత్మీయతానుబంధాలే- బలం, బలగం.

   🍁ఏ వ్యక్తీ చెడ్డగానో, మంచిగానో పుట్టడు. పెరిగిన వాతావరణం, కుటుంబ నేపథ్యాలు మనిషి వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతాయి. 

    🍁ప్రతి వ్యక్తిలోనూ బొమ్మబొరుసులుగా మంచిచెడులు ఉంటాయి. వ్యక్తి ప్రవర్తన పరిస్థితులకు తగ్గట్లు మారవచ్చు. కానీ, వ్యక్తిత్వం మాత్రం క్షణక్షణానికి మారకూడదు. అలా మారితే అది వ్యక్తిత్వం కాదు... స్వార్థం అవుతుంది.

    🍁ఓ రోజు గౌతమ బుద్ధుడు ధ్యానం ముగించుకుని కళ్లు తెరిచాడు. ఒక రాజు ఆయన ముందు మోకరిల్లి 'మహానుభావా! మీ వదనంలో నిరంతర ప్రశాంతతను గమనిస్తున్నాను. అది ఎలా సాధ్యపడుతోంది మీకు?' అని ప్రశ్నించాడు.

    🍁దానికి బుద్ధుడు 'రాజా! నేనూ నీలాంటి మానవుడినే. నా ప్రశాంతతకు కారణం జీవనతత్వం. 

   🍁నాలో ఉన్న ప్రేమ కారణరహితమైనది. ఎలాంటి బంధా లకు బంధనాలకు కట్టుబడనిది. స్వ పర భేదాలు లేకుండా సృష్టిలో సకల ప్రాణులను సమానంగా ప్రేమిస్తాను. కారణరహిత ప్రేమనే పంచుతాను. ఇదే నా ప్రశాంతతకు కారణమని అనుకుంటున్నాను' అన్నాడు. 

    🍁జీవించి ఉన్నప్పుడే సాటి మనుషులతో సత్సంబంధాల్ని ఏర్పరచుకోవాలి. అలా ఏర్పరచుకోగలిగినవారే కాలా తీతంగా కారణరహిత ప్రేమను పంచగలుగుతారు. 

    🍁మన
పెద్దలు అందించిన సంబంధాలను రాబోయే తరాలకు అందించడంలో మనం చిన్న పాత్రనైనా పోషించాలి. మన దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు పంచాలి. మన వద్ద లేనిదాన్ని ఇతరుల నుంచి పొందాలి. ఈ రెంటినీ సమతులం
చేసుకోగలిగిన వారు ఎటువంటి బంధంలోనైనా ఇమిడిపోగలరు.
దీన్నే స్వామి వివేకానంద సామాజిక జ్ఞానం అన్నారు. 

    🍁మహిమాన్వితమైన మానవ సంబంధాలు ఎంతో సున్నితంగా ఉంటాయి. సన్నజాజి పూలు కోస్తున్నప్పుడు కొమ్మలు విరిగిపోయినట్టు మానవ సంబంధాలూ అంతే సున్నితాలు మరి.

    🍁మానవ సంబంధాలు మసకబారిపోతున్న కలుషిత వాతావరణంలో నేటితరం బతుకుతోంది. 

   🍁స్వార్థంతో కూడుకున్న నేను అన్నింటా ముందుంటోంది. కుటుంబ సభ్యులూ మనసులు విప్పి మాట్లాడుకోలేని పరిస్థితులు కల్పిస్తున్నాయి నేడు సామాజిక మాధ్యమాలు. 

  🍁మనిషికి తోడు మనిషే యంత్రాలు కావు. ఈ వాస్తవాన్ని రేపటి తరానికి తెలియజెప్పాల్సిన బాధ్యత ఈతరంవారిదే.

    🍁ఇంటి తరవాత మనిషి వ్యక్తిత్వం రూపుదిద్దుకొనే దేవాలయం విద్యాలయమే. అక్కడ స్నేహం దొరుకుతుంది. శిక్షణ, క్రమశిక్షణ, తప్పొప్పుల విశ్లేషణ, చదువు, సంస్కారం, మనోవికాసం కలుగుతాయి. మానవ సంబంధాలకు గట్టి పునాది ఏర్పడుతుంది. గురుశిష్య బంధం అంతర్జాలంలో దొరికే మాయాజాలం కాదు. ఆ బంధాన్ని ప్రత్యక్షంగా ద్రోణుడు అర్జునుడిలా అనుభూతి పొందాల్సిందే.

   🍁మానవ సంబంధాలు పటిష్ఠంగా ఉన్న సమాజంలోనే ఐక్యత వర్ధిల్లుతుంది.
 అప్పుడే ,

      🍁భావోద్వేగాలు, ఆత్మీయతలు, విలువలు, ఆధ్యాత్మికత సమపాళ్లలో ఉండే మానవ సంబంధాలు నిరంతర స్రవంతిలా తరానికి తరానికి మధ్య వారధిలా కొనసాగుతాయి.

🌹🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment