*శంబల - 22*
💮
*రచన : శ్రీ శార్వరి*
*బై బై శంబల -2
ప్రశ్న: "మాస్టర్! నిజంగా శంబల ఉందా? మీరు దర్శించారా? నిజం చెప్పండి." [తాషీలామా కళ్లు మూసుకుని చాలాసేపు ఆలోచించాడు].
"అసలు శంబల సప్తసాగరాల అవతల ఎక్కడ ఉందో నాకు తెలియదు. ఎవరికీ తెలియదు. మేం చెప్పేది శంబల నమూనా గురించి. అదొక స్వప్న లోకం. అదొక స్వర్గసీమ. నిజం చెబుతున్నాను శంబల భూగోళం మీద ఎక్కడా లేదు. శంబల మన నేల పైన కనిపించదు. అయినా మనవారికి దాని పైన అంత ఇష్టం ఎందుకో అర్థంకాదు. ఉత్తరాన చాలా దూరంగా, పర్వతాల నడుమ శంబల ప్రతిబింబం కనిపిస్తుంది. అక్కడ శంబలకు చెందిన జ్ఞాన కిరణాలు ప్రసరిస్తుంటాయి. అది నిజం."
ప్రశ్న : "స్వర్గం ఎక్కడ ఉంటుందో, ఎట్లా ఉంటుందో? స్వర్గాన్ని వర్ణిస్తాం, ఆశిస్తాం, నమ్ముతాం. అలాగే మీరు లేని శంబలను ఊహించి నమ్మకం పెంచుకోవడం అనుకో వచ్చునా? ఉన్నట్లు లోకాల్ని నమ్మిస్తున్నారు కదూ."
లామా : "మేము ఎవర్నీ రమ్మని పిలవ లేదు. అందని స్వర్గాన్ని అరచేతికి అందించే ప్రయత్నం అసలు చేయం. శంబలను ఎవరికీ చూపించింది లేదు. కనుక శంబల గురించి ఎట్లా చెప్పగలను?"
ప్రశ్న : "శంబల గొప్పదనం గురించి, వైశిష్ట్యం గురించి మేము విన్నాం. అది
ఉన్నదని మా విశ్వాసం. భూమి పైన నకిలీ స్వర్గం ఉండవచ్చు గదా. మీవంటి గొప్ప లామాలు, ప్రాజ్ఞులైనవారు లోగడ శంబల దర్శించిన కథలు, గాధలు ఉన్నాయి. మాస్టర్ మైత్రేయ, మాస్టర్ మోర్య, కుత్తమి, జ్వాల్ కూల్, సెయింట్ జర్మనీ పేర్లు వింటున్నాం. వీరంతా శంబలకు చెందిన పరమ గురువులే కదా! వారు బాహ్య ప్రపంచంలో కొందరితో సంబంధం పెట్టుకున్నారు. అది నిజం కాదా? మేము హిందూ దేవుళ్లకంటే, సప్తర్షులకంటే హిమాలయ గురువుల్ని, శంబల మాస్టర్లను ఎక్కువ అభిమానిస్తాం గౌరవిస్తాం."
భార్గవ : "లామా! ఐర్యత్ లామా అనే వ్యక్తి ఒక రహస్య సొరంగం ద్వారా శంబల వెళ్లాడని విన్నాం. శంబల చుట్టూ మూడు అభేద్యమైన కోట గోడల్లాంటి పర్వత శ్రేణులు, అగడ్తలు ఉన్నాయంటారు. మీరేమో శంబల 'అందని స్వర్గం' అని ఆకాశం కేసి చూపిస్తున్నారు. ఆకాశంలోని స్వర్గానికి సమానం భూగోళం పైనున్న శంబల కావచ్చు కదా! శంబల ఉందని మా నమ్మకం. ఆ రహస్యం మీరు చెప్పడం లేదు. ఇష్టం లేకనా?"
(లామా గారికి కాస్త కోపం వచ్చింది. అయినా తమాయించుకున్నాడు].
లామా : “అవునా! కావచ్చు. ఒకనాడు ఇండియా నుండి బౌద్ధం టిబెట్ కి వలస వచ్చింది. ఇప్పుడు తిరిగి ఇండియా చేరుతోంది. అది టిబెట్ బౌద్ధుల నిర్వాకం వల్ల. అన్ని దేశాల్లో బౌద్ధ ధర్మం ఆదరించ బడుతోంది. కాస్త ఆచరణలో భేదాలు ఉన్నా బౌద్ధం ధర్మమే గదా! ప్రపంచంలో చాలా మార్పులు వస్తున్నాయి. మత మౌఢ్యం తగ్గిపోయి, ధర్మం ఆదరించబడు తోంది. మనుషులందరి ధర్మం ఒక్కటే. ప్రపంచంలో చాలా మంచి మార్పులు వస్తున్నాయి. ప్రాక్పశ్చిమ సంస్కృతులు కలిసిపోతున్నాయి. సౌభ్రాతృత్వం, విశ్వమానవత, విశ్వశాంతి అందరి ధ్యేయం. మాకంటే మీకే శంబల గురించి తెలుసు. అంటే రిగ్డెన్ జెయ్పే (మైత్రేయ ప్రజ్ఞ అందరిలో పనిచేస్తోందని అనిపిస్తుంది). శంబల కిరణాలు దశ దిశలా వ్యాపిస్తున్నాయి. రిగ్డెన్ అందరినీ గమనిస్తూ మానవత్వానికి మెరుగులు దిద్దుతున్నాడు. అది మైత్రేయం. ప్రపంచంలో ఎక్కడ ఏ మార్పు వచ్చినా అది శంబలలో నమోదవుతుంది.
'మైత్రేయ' అన్నది ఒక భావన. ఎవరైనా అందుకోవచ్చు. యోగ్యులైన వారందరికీ మైత్రేయ సహాయం అందుతుంది. మైత్రేయ నుండి ప్రసరించే కాంతి అజ్ఞానాన్ని తొలగిస్తుంది. సన్మార్గంలో పయనించే వారికి అన్ని సదుపాయాలు కలుగుతుంటాయి. నష్టం, కష్టం ఉండవు. మైత్రేయ మనుషుల కర్మలను సైతం రహితం చేస్తాడు.
ప్రశ్న: “మహాత్మా! మీరు మైత్రేయ పక్షాన ఆయన ప్రొమోటర్ మాట్లాడుతున్నారు.
లామా : “ఇక్కడ ఎవరి పేరు ఉచ్చరించ కూడదు. పేర్లు ముఖ్యం కాదు. శంబల ఎంత రహస్యమో కాలచక్రం అంతే రహస్యం. పరమ గురువుల విషయాలు అంతే రహస్యం. తెలిసినా ఎవరు ఏమీ చెప్పరు. ఇక్కడ భావన ముఖ్యం. ఇది భావనా ప్రపంచం. భావ వ్యక్తీకరణకు శబ్దం అనవసరం. శబ్దం ద్వారా మీ భావాలు గాలిలో సంచరిస్తాయి. శబ్ద కాలుష్యం లేకుండా శబ్దాలు నిశ్శబ్దంలో ప్రసరిస్తాయి. భావాలు నిశ్శబ్దంగా శూన్యంలో ప్రసారం అవుతుంటాయి.
మీకు రిగ్డెన్ జయ్ - మైత్రేయ ఒక్కరేనన్న అభిప్రాయం ఉంది. దానిని అలాగే ఉండనీయండి. నేను అవునని చెప్పను కాదని చెప్పను.
శంబలలో ఎంతమంది ఉంటారంటే ఏం చెప్పను? అసంఖ్యాకం, అగణితం. ఇక్కడ జనాభా లెక్కలుండవు. తపస్సు పండినవారు వచ్చిపోతుంటారు. మానవ పరిణామానికి, వికాసానికి అవసరమైన అనేక పథకాలు ఇక్కడ రచిస్తుంటారు. అవి ప్రపంచానికి అందుతుంటాయి.
భార్గవ : “లామా? మానవతకు కొత్త శక్తులు అందుతాయని మా వేదం చెబుతుంది. నిజమా?”
లామా : “మీ వేదాలు ఘోషించినా, వేదాంతులు వల్లించినా, మా ప్రామాణిక గ్రంధాలు ఉదోషించినా అన్నీ ఆకాశం నుండి వచ్చే భావనలే. అందరికీ మూలం ఒక్కటే. ఇవన్నీ తధాగతుడు ఎప్పుడో కాలచక్రంలో నిక్షిప్తం చేసి ఉంచాడు. రిగ్ డెన్ వారసులు అనేక దేశాలలో జన్మిస్తారు.
ప్రశ్న : “మహాత్మా! అంతమంది మహా యోగులు భూమ్మీద అవతరించి ఆధ్యాత్మికంగా కృషి చేస్తుంటే భూమి పైన శంబల రూపు దాల్చినట్లే కదా!”లామా : ”భూమ్మీది శక్తులు, పరలోకాల శక్తులు కలిసే సత్యాన్ని ఆవిష్కరిస్తాయి. అది ఒక్కరి వల్ల అయ్యేపని కాదు. శంబల ఆరాధకులు ఎక్కువవుతున్నారు. ఇక పైన శంబలను చేరడం ఉండదు.”
భార్గవ : “మహాత్మా! ఇప్పుడు టిబెట్లో మహాత్ములనదగ్గ లామాలు కనిపించడం లేదు. మార్పా, మిలారేపా లాంటి వారు నేడు లేరు. పంటపోయి కలుపు మొక్కలు మిగిలాయి. పరమ గురువులు లేరు. వారి స్థానంలో సాదాసీదా లామాలు మిగిలారనిపిస్తుంది. మీ లామాలు మా దేశంలోని రుషుల కన్న ఏ విధంగా గొప్ప?”
లామా : “కారణాలు చెప్పలేను. కాలచక్ర మహిమ. కొందరు తపోలోకాలకు వెళ్లిపో తుంటారు. కొందరు నక్షత్ర గోళాలలో సెటిలై ఉంటారు. వారు అక్కడ నుండే గైడ్ చేస్తారు. అందరు మానవత్వాన్ని ఉద్దరించాలని అనుకోవాలి. మాస్టర్లయిన వారికి మనిషి మాత్రమే ముఖ్యం కాదు. కొందరికి తిరిగి జన్మించడం ఇష్టం ఉండదు. కనుక మహా యోగ్యులైన లామాలు అసలు అందుబాటులో ఉండరు. బహుశః శంబలలో ఏ మూలనో అజ్ఞాతంగా ఉంటారేమో నాకు తెలియదు.
ప్రపంచంలో అన్ని ప్రాంతాలలో మహా యోగులు ఉన్నారు. అందరూ టిబెట్లో గుంపు కట్టాలని లేదు. ఎక్కడైనా ఉండవచ్చు. ఎక్కడైనా అదృశ్యంగానే ఉంటారు. వారి ఆస్ట్రల్ శరీరాలు పని చేస్తుంటాయి. మీరు శంబలపై ఆసక్తితో వచ్చారు. తిరిగి ఇండియా వెడతారు. మీ పైన శంబల ముద్ర ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో శంబల భావుకత ఉంటుంది. మీ కృషిలో శంబల తొంగి చూస్తుంది. మీ భావనల్లో శంబల ఉండి తీరుతుంది. సత్-యోగం ఎక్కడ ఎవరు చేసినా అది సద్యోగమే 'సత్యయోగం'. ఇప్పుడు చాలామందికి పెంచన్ లామా శంబలకు చెందిన పరమగురువేనని తెలియదు.”
ప్రశ్న : “నాకు తెలిసి ప్రపంచ దేశాలలో పెంచన్ లామా, దలైలామా అభిమానులు ఉన్నారు. వారంతా బుద్ధ ధర్మాన్ని అనుసరిస్తున్నారా? బౌద్ధం పైన రాజకీయ ప్రభావం ఉంది గదా! లామాలకు రాజకీయ అధికారాలు అవసరమా? అధికారం ఆధ్యాత్మికానికి ప్రతికూలం గదా?”
లామా : “ఒక కథ ఉంది. పెంచన్ దిన్ పోచ్ ని శత్రువులు ముట్టడించారు. ఆయన తన బృందంతో పారిపోతున్నా డు. ఒక చోట ఆయన బృందానికి శత్రువుల బృందానికి మధ్య మంచు ప్రవాహం ఏర్పడ్డది. శత్రువులు వారిని పట్టుకోలేకపోయారు.
మరొకసారి పెంచన్ లామా పర్వతాల పైన ఒక సరస్సు దగ్గరకు వచ్చాడు. శత్రువులు చాలా దగ్గరగా వస్తున్నారు. ఆయన సరస్సు చుట్టు ఒకసారి ప్రదక్షిణం చేసి ధ్యానంలో కూర్చున్నాడు. శత్రువులు సరస్సు దాటి వారిని చేరలేకపోయారు. సరస్సుపై పొగమంచు క్రమ్మి శత్రువులు దారి తప్పారు.
పెంచన్ లామా ప్రయాణం చేసినంత కాలం ఆయన బృందాన్ని శంబల రక్షించేది. అలాంటి సంఘటనలు అనేకం ఉదహరించవచ్చు.
మీకు ఎక్కడైనా మంచి గంధం వాసన తగిలిందా?" అడిగాడు లామా.
"తగిలింది" అన్నాను.
లామా : “మీకు మంచి గంధం వాసన వేస్తే అది శంబల సంకేతం. శంబల మిమ్మల్ని ఆహ్వానించినట్లు, ఆమోదించినట్లు. మంచి గంధ పరిమళం మీ పవిత్రతకు నిదర్శనం.”
ప్రశ్న: “అదే 'కాలచక్ర' రహస్యమా లామా?”
లామా : “అది ఒక సంకేతం మాత్రమే. 'కాలగీయ' అనే మాట వినిపిస్తే అది సంకేతం. ఆ శబ్దం విన వచ్చిన దిశగా వెళ్లితే శంబల చేరవచ్చు. అక్కడ శంబల ప్రవేశ ద్వారం ఉంటుంది. రిగ్డెన్ మీ వెంట ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. శంబలకు చెందిన పరమ గురువులు మీ బాధ్యతలు తీసుకుంటారు.”
భార్గవ : “మహాశయా! యోగులకు, తాపసులకు శంబల గురువులతో పని ఉండవచ్చు. సామాన్య ప్రజకు శంబలతో ఏం పని? ఏం ఉపయోగం?”
లామా : “సామాన్యులు, అసామాన్యులు అని లేదు స్వామీ. ఈ జన్మలో సామాన్యు లుగా ఉన్నవారు పూర్వజన్మలో గొప్ప యోగులై ఉండవచ్చు. ఇప్పుడు గొప్ప వారుగా చలామణి అయ్యేవారు పూర్వం సామాన్యులై ఉండవచ్చు. ఇది ధర్మ పోరాటం. కష్టాలు అనుభవానికి రావాలి. అందువల్ల అన్ని జన్మలు ఒక్కటిగా ఉండవు.”
భార్గవ : “శంబల గురించి బయటి ప్రపంచానికి తెలియకపోవడమే రహస్యమా? లేక తెలిసినా, శంబల గురించి మీ వంటివారు చెప్పకపోవడం రహస్యమంటారా? ఏది అసలైన రహస్యం?”
లామా : “ఎవరు ఏ పనులు చేస్తున్నా పై వారు గమనిస్తుంటారు. విధి నిర్వహణలో ఏ ఇబ్బంది కలిగినా పైవారు చక్కదిద్దుతారు.
ఒకసారి మంగోలియా గోబీలో ఒకరికి ఒక పని అప్పగించారు. ఆ రహస్యం ఎవరికీ చెప్పకూడదని ఆంక్ష విధించారు. అతను ముసలివాడై చావు దగ్గరకు వచ్చింది. తన దగ్గర రహస్యం ఎవరికి చెప్పాలి. దుష్ట శక్తులు వచ్చి ఆవహించాయి. అతను కోమాలోకి వెళ్లాడు.
తన దగ్గరున్న రహస్యం చెప్పదగ్గ యోగ్యుడు కనిపించలేదు. శంబల గురువులు ఎవరో వెళ్లి అతనిని రక్షించారు. తర్వాత యోగ్యుడి కోసం అన్వేషించారు. గురువు తన కొక రహస్యం చెబితే దానిని రక్షించడం తన బాధ్యత. ఎవరి కర్మవారును వారే అనుభవించాలి. మహా గురువులైనా సరే ... ఇతరుల కర్మల్ని వారు తీసుకోరు.”
భార్గవ : “మహాత్మా! టుర్కీస్థానంలో సుదీర్ఘమైన పర్వత గుహలున్నాయి. ఆ గుహల మార్గంలో శంబల చేరవచ్చు అంటారు. ఆ మార్గం ద్వారానే శంబల వాసులు బయటకు వస్తుంటారుట. నిజమా? కాదా?”లామా : “నిజమే! అప్పుడప్పుడు శంబల వాసులు బయటకు వస్తుంటారు. తమ పక్షాన పనిచేస్తున్న వారిని వెళ్లి కలుస్తూ ఉంటారు. మీరు చెప్పే మోర్య, జ్వాల్ కూల్, కుత్ హోమిలు అలా వచ్చిన శంబల వాసులే. వాళ్లు పరమ గురువులు కారు. మాస్టర్స్ అని చెప్పలేం. మాస్టర్స్ మీడియమ్స్ కావచ్చు. లేదా వారి ప్రతినిధులు అయి ఉండవచ్చు. వారు గాలిలో ప్రయాణం చేస్తారు. గాలి లోంచి వస్తువులు సృష్టిస్తారు. మీరు అడిగిన వస్తువులు తెచ్చి అందిస్తారు. రిగ్డెన్ జెయపో అప్పుడప్పుడు భౌతిక శరీరంతో కనిపిస్తారు. పవిత్ర స్థలాలలో, పుష్కరాల లో దర్శనమిస్తాడు. జనసమ్మర్థం ఉన్న చోట్ల సడెన్ గా కనిపించి అంతర్థానమవు తాడు. ఎవరికో ఏదో సందేశం యిచ్చి పోతుంటాడు.
రాత్రి వేళల్లో, సూర్యోదయ సమయాల్లో శంబల గురువులు ఏ దేవాలయ ప్రాంగణంలోనే దర్శనం యిస్తారు. వారు వచ్చినపుడు తలుపులు అవే తెరుచు కుంటాయి. దీపాలు వెలుగుతాయి. పుణ్య పురుషులకు మాత్రమే వారి రాక తెలుస్తుంది. అవసరం కలిగినపుడు వారే వచ్చి కలుస్తారు. వారిది మౌన సందేశం. మానవ సందేశం.
ప్రళయం వస్తుందో, రాదో చెప్పలేం కాని యుగం మారుతోంది. గ్రహాలు కొత్త కార్యక్రమాలు తయారు చేస్తున్నాయి. సత్యయుగం ఆరంభం అవుతోంది. మైత్రేయ అవతరణ జరుగుతుంది. ఫరవాలేదు - ప్రపంచంలో ఆధ్యాత్మిక దృక్పథం బాగా పెరిగింది. రిగ్డెన్ మళ్లీ అవతరిస్తాడు.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment