*మనం తెలుసుకోవడమే మరిచిపోతున్నామా లేకపోతే తెలుసుకోవాలి అనే ఆలోచననే మర్చిపోయామ..*
*ప్రపంచంలో జరిగే అన్నీ యుద్దాల గురించి.*
*అన్యాయాల గురించి ప్రతిరోజు ఆరా తీస్తూ..*
*మన పక్కనున్న మనుషుల్ని కనీసం పట్టించుకోకుండా పక్కకు తప్పుకుంటున్నాం, కాదు కాదు కావాలని తప్పించుకుంటున్నాం. అయినా ఎవరు ఎం అయినా మనకెందుకు..*
*అమ్మ ను వంట గదిలో వదిలిపెట్టి...*
*అమ్మకైన గాయాలను ఖాతరు చేయకుండా...*
*ఏం కర్రీ చేసావంటూ పైపైకి నవ్వుతూ అడుగుతున్నాం. మన స్వార్ధమే కదా మనకి కావలి...*
*నాన్నను డబ్బులు అడగడమే తప్ప, నాన్న మన కోసం చేస్తున్న అప్పులెన్నీ, కడుతున్న వడ్డీ లెన్నీ, పడుతున్న పాట్లెన్నీ,అడగడం మరిచిపోతున్నాం. మనకెందుకు అవన్నీ, అవసరానికి డబ్బు వస్తుందా లేదా..... అది చాలు...*
*మనకున్న ఎకరాలు ఎన్నో గుర్తుపెట్టుకొని.*
*నాన్న వాటిని కాపాడడానికి పడుతున్న కష్టాలను లోలోపల కార్చుతున్న కన్నీళ్లను గుర్తించలేకపోతున్నాం.*
*బాధ్యతలు బరువులు మోసీ మోసీ కుంగిపోయిన నాన్న వెన్నును,బక్కచిక్కిన అమ్మను కనీసం దగ్గరికి తీసుకోలేకపోతున్నాం. ఎంతకు దిగజారిపోతున్నాం...*
*తల్లిదండ్రులు అవసాన దశలో ఎలాగో పక్కన ఉండము, చివరకు వాళ్ళు చనిపోతే శవాన్ని కుడా మనకోసం ఎదురు చూసే అంత గొప్పగా బిజీ అయ్యి ఎదిగిపోతున్నాం... ఒక్కోసారి వర్క్స్ బిజీ లో అంత్యక్రియలు కూడా చేయలేం.... బిజీ కదా మరీ...*
*వీకెండ్ విందుల్లో విలాసాల్లో*
*మునిగితేలి ప్రపంచాన్ని మరిచిపోవడమే మన ప్రపంచం అనుకుంటున్నాం.*
*ఇక్కడ మందు బాటిళ్లు, చికెన్ ముక్కలు, సిగరెట్ డబ్బాలే కాదు.*
*అంతకన్నా మత్తు నిచ్చే మనుషులు ఉన్నారని మరిచిపోతున్నాం.*
*క్లబ్బులు పబ్బులే కాదు.*
*మనల్ని తిరిగి మనుషుల్ని చేసే పుస్తకాలు ఉన్నాయని,*
*మన స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం వాళ్ళ ప్రాణాలనే పణంగా పెట్టిన పోరాట యోధులు ఉన్నారని మరిచిపోతున్నాం.*
*ఎప్పుడంటే అప్పుడు బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని*
*తినే మనం, కలుషిత ఆహారం తిని*
*విగత జీవులైన విద్యార్థులు ఉన్నారని?*
*తెలుసుకోవడమే మరిచిపోతున్నాం.*
*అర్ధరాత్రి బెనిఫిట్ షోలకు వెళ్లి తిరిగి వచ్చే కొడుకు కోసం,*
*భర్త కోసం,తెల్లవార్లు ఎదురుచూసే తలుపు గడియ తీసే ఉంచే మన అమ్మ , భార్య మన కోసం ఉన్నారని*
*ఎదురుచూస్తుంటారని మరిచిపోతున్నాం.*
*మనకు అలవాటేగా దగ్గర ఉన్నదాన్ని వదిలేసి దూరం గా చూడటం... దేనికోసమో పోరాటం...*
No comments:
Post a Comment