Friday, January 31, 2025

 *కర్మాచరణ... జ్ఞానం.....*

ఈ జీవితము, ఈ అనుభవాలు ఇవన్నీ నిజమేనా.. కలా.. మాయా.. ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు జిజ్ఞ్యాసులను సతమత పరుస్తుంటాయి. కొన్ని భౌతికమైనటు వంటి సంశయాలు అయితే మరికొన్ని ఆధ్యాత్మిక మైన సంశయాలు ఏర్పడుతుంటాయి. ఏదైనా కూడా వాటిని తొలగించుకొని ముందుకి వెళ్లడం అనేది మనకి అవసరం. అయితే సంశయం అనేది మానవుని కర్తవ్యంలోంచి వెనక్కి లాగుతూ వుంటుంది.

సంశయం అంటే ఇదా.. అదా.. ఇలానా.. అలానా.. ఇప్పుడా.. అప్పుడా.. నిశ్చయం ఏర్పడదన్నమాట. అది ఇటు అటు రెండు వైపులా మానవులని లాగుతుండే టటువంటి స్థితిని మనం సంశయం అని అంటాం. అలా కలిగినప్పుడు ఏదో ఒకటి చేయడము  అనేది ఎప్పుడూ జరగదు. నిశ్చయం ఏర్పడితేనే మంచైనా, చెడైనా చేయగలుగుతాడు. సంశయంలో ఉండి, ఊగిసలాడుతూన్నంత వరకు మంచీ చేయలేడు, చెడూ చేయలేడు.

మన సమాజానికి మనకి కూడా మంచి చేస్కోవాలి అనుకుంటున్న వ్యక్తులం కనక మంచి గురించి మనకి ఒక నిశ్చయం ఏర్పడాలి. ఐతే మన అనుభవం , మనకుండేటటు వంటి జీవితం చాలా తక్కువ కనక అనుభవించినటు వంటి పెద్దల యొక్క ఉపదేశం మన ఆసరాగా తీస్కున్నట్టైతే త్వరగా ముందుకి సాగగలుగుతాం. అనుభవించి నటువంటి వ్యక్తులు ఎవరు.. ఏం చెప్పాలి వాళ్ళు మనకి, ఎట్లా చెప్తారు.

లోకంలో ఉండేటటు వంటి వ్యక్తులు ఒక్కొక్కరూ ఒక్కొక్క మార్గం మనకి చూపిస్తుంటారు, నలుగురిని ఆశ్రయించి మనం వినేటప్పటికి అస్సలు ఏది తగునో ఏది తగదో నిర్ణయించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతుంటాము. అందుకే భగవంతుడు తానే నేరుగ భాద్యత తీసుకొని, ఏది తగునో దాన్ని నిర్ణయించి చెప్పడానికి, ఏది తగదో దాన్ని మానమని చెప్పడానికి ఈ లోకం లోకి దిగివచ్చాడు శ్రీకృష్ణుడై అవతరించాడు.

అర్జునుడికి 3వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఎంతో ఉపదేశం చేసాడు, నాయినా నువ్వు తగినటువంటి భాద్యతని నెరవేర్చు కర్మని ఆచరించు, ఆ కర్మ ఒకవేళ తప్పుగ కనిపించిన బెంగ పడకు, దానిని సవ్యంగా చేసుకుంటూ వెళ్ళు, అలా చేసినట్టైతే అది మంచి పనే అవుతుంది, నీకు అది ఈశ్వర ఆరాధన తో సమానమవుతుంది, వైద్యుడు శరీరాన్ని కోస్తాడు కాని దాన్ని మనం హింస అని అనటంలేదు కదా.. అది కోయకపోతే తప్పు వాడికి అది అవసరం. రోగికి అది అవసరం వైద్యుడు దాన్ని చేయాలి, అందుచేత చేసే పనిలో తప్పు ఉన్నా ఫరవాలేదు ఐతే చేసేటప్పుడు భావం వెనకాతల ఎలా ఉండి చేయాలో తెలుసుకొమ్మని చెప్పాడు.

ఎలా ఉండి చేయాలి.. వెనకాతల ఉండే భావం అంటే ఏమిటి.. ఒక జ్ఞానం. ఆ జ్ఞానం ఎట్లా ఉండాలి.. నేను చేసేది కేవలం నా స్వార్ధం కోసం కాదు, వాడి హితం కోసం నా లాభం కోసం కాదు, వాడి శ్రేయస్సు కోసం, ఇది ప్రపంచ వ్యవస్థకి అవసరం, భగవంతుడు ఏర్పరిచింది, కనుక నేను అట్లా ప్రవర్తించాలి, అది నేను చేసే తీరాలి అని జ్ఞానం కలిగి చేయాలి, జ్ఞానం చాలా ప్రధానం సుమా.. అని చెప్పారు...

No comments:

Post a Comment