Thursday, January 30, 2025

 Vedantha panchadasi:
ఆలంబనతయా భాతి యోఽ స్మత్ ప్రత్యయ శబ్దయోః ౹
అన్తకరణ సంభిన్నబోధః 
స త్వం పదాభిధః ౹౹71౹౹

71.'త్వం'  'నీవు'  అనే పదములచే సూచింపబడునది అంతఃకరణము ఉపాధిగా గల చైతన్యము, చిదాత్మ.
అదే 'నేను' అనే జ్ఞానమునకు 'నేను' అనే పదమునకు విషయమగుచున్నది.

మాయోపాధిర్జగద్యోనిః సర్వజ్ఞత్వాది లక్షణః ౹
పారోక్ష్యంశబలః సత్యాద్యాత్మక స్తత్పదాభిధః ౹౹72౹౹

72. మాయ ఉపాధిగా గలది, సర్వజ్ఞత్వ లక్షణము కలిగి పరోక్షముగ తెలియబడు సత్యజ్ఞానమైనది తత్ అను పదముచే సూచింపబడుచున్నది.

ప్రత్యక్పరోక్షతైకస్య సద్వితీయత్వ పూర్ణతా ౹
విరుధ్యేతే యతస్తస్మాల్లక్షణా సంప్రవర్తతే ౹౹73౹౹

73. వాచ్యార్థము ననుసరించి నేరుగా తెలియబడునది అనేకములలో ఒకటైనది అయినవిషయమే పరోక్షముగ తెలియబడుచున్నది.
ఇట్లు చెప్పుట విరుద్ధము కనుక
లక్షణార్థమును అనుసరింపవలెను.

వ్యాఖ్య:-వాక్యవృత్తిలో జరిగిన అపరోక్షజ్ఞాన విచారణము:
అంతఃకరణమును ఉపాధిగా కలిగినట్టి ఏ చిదాత్మ(జీవాత్మ)
'అహం' అనే జ్ఞానానికి,
'అహం' అనే శబ్దానికి విషయరూపంలో భాసిస్తూ ఉంటుందో అదే 'త్వం' అనే పదానికి వాచ్యార్థం.

మాయ అనే ఉపాధితో కూడి ఉండి, జగత్తుకు కారణమై
సర్వజ్ఞత్వాది లక్షణాలు కలిగినట్టి,
పరోక్ష ధర్మ విశిష్టమైన సత్యజ్ఞానానంతరూపమైన బ్రహ్మము అని 'తత్' అనే పదానికి వాచ్యార్థం.

త్వం, తత్ అనే పదములకు వాచ్యార్థము,అనగా పైకి తోచుచున్న అర్థము చెప్పబడినది.
ఇట్టి లక్షణములుగల 
తత్, త్వం అనేవి ఒకటే అగుట
తత్త్వమసి అనుట అసంగతము కదా.కనుక వాచ్యార్థమునందు ఐక్యత ఉద్దేశింపబడలేదు.
ఉద్దేశింపబడిన అర్థమే లక్షణార్థము.అది ఇప్పుడు వివరింపబడుచున్నది.
ఈ శ్లోకములో 
ఈశ్వర బ్రహ్మములకు అభేదము కూడా ప్రతిష్ఠింపబడినది.

ఒకే పదార్థము 
ప్రత్యక్షము, పరోక్షము కూడా అవటంతోబాటు 
పరిచ్చిన్నము, పరిపూర్ణమూ కూడా అయినప్పుడు రెండూ విరుద్ధధర్మాలు కాబట్టి వాక్యార్థబోధ కోసం - 
వాక్యజ్ఞానం కలగటంకోసం -
లక్షణావృత్తిని ఆశ్రయించాల్సి వస్తుంది.

తత్త్వమసి అనే వాక్యముచే జీవ ఈశ్వరులకు అభేదము చెప్పబడినది.
అనేక జీవులలో ఒకడు నేరుగా తెలియబడువాడు అగు జీవుడే సంపూర్ణుడు,అద్వితీయుడు,
శ్రుతివాక్యములచే తెలియబడువాడు అగు ఈశ్వరుడగుట అసంగతము.

కనుక జీవ ఈశ్వరులందు,
ఇరువురియందూ గల లక్షణములను స్వీకరించి విరోధించు లక్షణములను ఉపేక్షించించో ఐక్యత సిద్ధించును.

ఇట్లు కొన్ని లక్షణములను స్వీకరించి కొన్ని లక్షణములను వదలి అర్థము చెప్పుటను భాగత్యాగ లక్షణార్థమందురు.
దీనికే జహదజహల్లక్షణార్థ మనీ పేరు.

"దేవదత్తుడు సింహము" అనినచో దేవదత్తునకు జూలును, కోరలును, తోక ఉన్నవని అర్థము కాక దేవదత్తుడు సింహమునకు గల 
ధైర్యము,బలము,పరాక్రమము
మొదలగు గుణములు కలవాడని అర్థము.

దేవదత్తుడు వాచ్యార్థమున సింహమగుట అసంభవము కనుక గుణములే ఉద్దేశింపబడినవని గ్రహింతుము.

అట్లే , జీవేశ్వరులు వారివారి ఉపాధులతో కూడి ఒకటియగుట అసంభవము గనుక వారి స్వరూపమును,ఉపాధిరహితమైన దానిని గ్రహింపవలెను.

తత్త్వమస్యాదివాక్యేషు లక్షణా భాగలక్షణా ౹
సోఽ య మిత్యాదివాక్యస్థపదయజరివ నాపరా ౹౹74౹౹

74. తత్త్వమసి మొదలగు వాక్యములందు,
'అతడే ఇతడు' మొదలగు వాక్యములందలి పదములందు వలె, అన్వయింపవలసిన లక్షణార్థము భాగలక్షణార్థము 
(భాగత్యాగలోణార్థము).
ఇతరము కాదు.

74. "తత్త్వమసి" మహావాక్యమునందు తత్,త్వం అను రెండు విరుద్ధాంశముల ఐక్యతకు వాక్యార్థ బోధ కోసం -
వాక్యజ్ఞానం కలగటం కోసం 
లక్షణావృత్తిని ఆశ్రయించాల్సి వస్తుంది.
ఆ లక్షణావృత్తి ఎటువంటిది ?అంటే -

లక్షణ మూడు విధములు
1) జహల్లక్షణ
2) అజహల్లక్షణ
3) జహదజహల్లక్షణ లేక
    భాగత్యాగ లక్షణయని.

1) జహల్లక్షణయందు పదము యొక్క వాచ్యార్థము పూర్తిగ వదలి మరొక అర్థము స్వీకరింపవలెను.
'గంగయందలి పల్లె' అనగా గంగానది లోనే పల్లె ఉన్నదని గాక గంగానది ఒడ్డున పల్లెయని గ్రహింతుము.
'గంగయందలి' అనే పదమునకు బదులు 'ఒడ్డున'
అనే పదము గ్రహింపబడినది గనుక ఇది జహల్లక్షణము.
ఇది లక్ష్యార్థమై యున్నది.

2) అజహల్లక్షణ మనగా పదమునకున్న అర్థము వదలక విశేషమైన అర్థమును గ్రహించుట.
విందు జరుగుతునపుడు 
'అన్నము రావలెను' అనినచో అన్నమే ఎగిరి రావలెనని కాక అన్నముతో గూడ వడ్డించువాడు రావలెనని అర్థము.ఇచ్చట 'అన్నమును' వదలక వడ్డించువానిని కూడ చేర్చుటచే ఇది అజహల్లక్షణము.

3) భాగత్యాగ లక్షణ లేక జహదహజహల్లక్షణమనగా పదములందలి కొన్ని అంశములను వదలి కొన్ని అంశములను మాత్రము స్వీకరించుట.
'ఆ దేవదత్తుడే ఇతడు' అనునపుడు కొన్ని సంవత్సరముల క్రిందట 
చిన్న బాలుడై చీమిడి ముక్కుతో మూడవ తరగతి యందుండిన ఆ దేవదత్తుడే 
దృఢగాత్రుడు ఆజానుబాహువు శాస్త్రపారంగతుడైన ఇతడు అని అర్థము తెలియును.

"అతడే - ఇతడు" ,అనగా 
ఆ కాలంలో  ఆ ప్రదేశంలో కనిపించిన"అతడూ" -
ఈ కాలంలో ఈ ప్రదేశంలో కనిపించిన "ఇతడూ" ఒకడే.
ఆ దేశకాలాలకు - 
ఈ దేశకాలాలకు ఏకతత్వం కుదరదు.కావున అతడే ఇతడు  
అనే వాచ్యార్థంలో వుండే విరోధాంశములైన ఆ దేశకాలాలను - ఈ దేశ కాలాలను పరిత్యజించి
 "కేవల మనుజుని" గ్రహించి
"అతడే - ఇతడు" అని తెలియుట "భాగత్యాగలక్షణ"
మందురు.

ఈ దేవదత్తులను వివిధ సమయములందు మాత్రమే చూచినవారికి గుర్తుతెలియదు.
కాని సోమదత్తుని పుత్రుడగు సామాన్య లక్షణము వలన, దేవదత్తులయందులి విరుద్ధాంశములను లక్షణములను వదలి ఓహో 
"ఈ దేవదత్తులు" ఒక వ్యక్తియే కదా అని బోధపడును.

అట్లే ఉపాధిగతములైన అల్పజ్ఞత్వము- అంతఃకరణవర్తిత్వము, సర్వజ్ఞత్వము- మాయాధీశ్వరత్వము అనే విరుద్ధ లక్షణములను వదలి చైతన్య స్వరూపమను సామాన్య లక్షణమును గ్రహించినచో జీవేశ్వరుల అభేదము సిద్ధించును.
ఈ లక్షణయే గ్రహింపవలెను.
మొదటి రెండు లక్షణాలను కాదు అని శ్లోకార్థము.    

No comments:

Post a Comment