Vedantha panchadasi:
సదేవేత్యాదివాక్యేన బ్రహ్మసత్త్వం పరోక్షతః ౹
గృహీత్వా తత్త్వమస్యాది వాక్యాద్వ్యక్తిం సముల్లిఖేత్ ౹౹61౹౹
61. 'సృష్టికి పూర్వము బ్రహ్మము ఉండెను' వాక్యములు పరోక్షజ్ఞానము నొసగును.'తత్త్వమసి' మొదలగు వాక్యములు అపరోక్షజ్ఞానమునిచ్చును.
ఛాందోగ్య ఉప:6.2.1; 6.8.7
ఆదిమధ్యావ సానేషు స్వస్య బ్రహ్మత్వధీరియమ్ ౹
నైవ వ్యభిచరేత్తస్మాదాపరోక్ష్యం ప్రతిష్ఠితమ్ ౹౹62౹౹
62.తన బ్రహ్మత్వవిషయకమైన
ఆది మధ్యాంతాల్లో ఎక్కడ ఆత్మభావంతో కూడిన వ్యవహారాన్ని జరిపినా విపరీతంగాని,విరుద్ధంగాకాని కాదు.బుద్ధియొక్క అపరోక్షత్వం సుప్రతిష్ఠితమగుచున్నది.
జన్మాదికారణత్వాఖ్య లక్షణేన భృగుః పురా ౹
పారొక్షేణ గృహీత్వాథ విచారాద్వ్యక్తిమైక్షత ౹౹63౹౹
63.ప్రాచీనకాలమున భృగుమహర్షి జగత్తు యొక్క కారణము బ్రహ్మమేయని పరోక్షముగా తెలిసికొనెను. పిదప పంచకోశముల వివేచన చేసి అపరోక్షజ్ఞానము పొందెను.త్తైత్తిరీయ ఉప.3.1.1
వ్యాఖ్య:-"సదేవ సోమ్యేదమగ్ర ఆసీదేకమేవాద్వితీయమ్" ఛాం.6-2-1.
౼ ఈ నామరూపాత్మకమైన జగత్తు సృష్టికి పూర్వం అద్వితీయరూపంలో సత్పదార్థంగా ఉంది.
కావున సత్తుగా నున్న పరబ్రహ్మమే మొట్టమొదట ఉండెను.రెండవ వస్తువే లేదని తెలిసికొనుము.
ఈ విధమైన వచనాలద్వారా శ్రుతి వాక్యములు బ్రహ్మమును గూర్చిన పరోక్షజ్ఞానము నొసగును.
బ్రహ్మము యొక్క సద్భావాన్ని,ఉనికిని అపరోక్షంగా నిశ్చయించుకొని
"తత్త్వమసి" "అది నీవే" ఇత్యాది వాక్యాలతో అద్వితీయ బ్రహ్మస్వరూపమైన ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి.
మృణ్మయములైన కుండలు మున్నగునవన్నియు మృత్తికయే.నామరూపములు వేరుగానున్నవి.
మృత్తిక మాత్రము సత్యము. లోకములో లోహము యొక్క జ్ఞానముతో అన్ని లోహపదార్థముల జ్ఞానము ఎట్లు కలుగుచున్నదో,
అదే రీతిగా ఇవన్నియు వాచారంభణము మాత్రమే. వికారములగు నామరూపములన్నియు అసత్యములు.
లోహము ఒక్కటే సత్యము.
తానే బ్రహ్మమని తెలిసిన పిదప ఈ జ్ఞానము,పంచకోశములలో దేనితో కూడి వ్యవహరించినా, ఇక చలింపదు.
ఈ విధముగ అపరోక్షత్వము సుప్రతిష్ఠితమగుచున్నది.
ముందుగా కేవలం వాక్యంవల్ల పరోక్షజ్ఞానం కలిగి,తరువాత విమర్శనా పూర్వకమైన అపరోక్షజ్ఞానం కలుగుతుందని ఎట్లా తెలుస్తుంది ? అంటే,
తైత్తరీయకం - భృగువల్లిలో,
"యతో వా ఇమాని భూతాని జాయన్తే,యేన జాతాని జీవన్తి.
యత్ర్పయన్త్యభిసంవిన్తీతి"
తై. 3 -1 అనే శ్రుతి వచనాన్ని బట్టి వరుణపుత్రుడైన భృగువు ముందుగా ఈ జగత్తుయొక్క సృష్టి స్థితి లయాలకు కారణం బ్రహ్మము అనే లక్షణంద్వారా పరోక్ష బ్రహ్మజ్ఞానం పొంది పిమ్మట అన్నమయాది పంచకోశ విచారణచేసి, సాక్షిరూపమైన బ్రహ్మముయొక్క సాక్షాత్కారాన్ని పొందినట్లు చెప్పబడ్డది.
ఈ తన బ్రహ్మత్వవిషయకమైన,ఆది మధ్యాంతాల్లో ఎక్కడ ఆత్మభావంతో కూడిన వ్యవహారాన్ని జరిపినా విపరీతంకాని,విరుద్ధంగా కాని కాదు.కాబట్టి ఈ బుద్ధియొక్క అపరోక్షత్వం నిశ్చితమౌతోంది.
నీటియందు కలిసిపోయిన ఉప్పుగల్లు ఆనీటిరుచి నీటిపైభాగమున,
మధ్యభాగమున,
అడుగుభాగమున ఎక్కడ పరీక్షించినను వేరుకాదు.
అలాగే ఉప్పు నీటియందుండినను ఏవిధముగా చూడలేమో ఆ సద్రూపమగు బ్రహ్మము (చూడలేకయున్నాము)
సర్వత్రా వ్యాపించి యుండును.
ఇది అత్యంత సూక్ష్మము. ఇదంతయు
పరబ్రహ్మ స్వరూపము.
ఇదే సత్యము.
ఇదే
నీవై యున్నావు (తత్త్వమసి)
అనగా జగత్కారణము బ్రహ్మమని తెలియుట పరోక్షజ్ఞానము పంచకోశములందలి ప్రత్యగాత్మయే బ్రహ్మమని తెలియుట అపరోక్షజ్ఞానము.
యద్యపి త్వమసీత్యత్ర వాక్యం నోచే భృగోః పితా ౹
తథాప్యన్నం ప్రాణమితి విచార్య స్థలముక్తవాన్ ౹౹64౹౹
64. భృగువు యొక్క తండ్రి తత్త్వమసి అనే వాక్యముచే బోధింపకున్నను అన్నము,ప్రాణము అని విచారింపదగిన పంచకోశములను చూపెను..
తైత్తిరీయ ఉప.3.6.1
అన్న ప్రాణాది కోశేషు సువిచార్య పునః పునః ౹
ఆనందవ్యక్తిమీక్షిత్వా బ్రహ్మలక్ష్మాప్యయూయుజత్ ౹౹65౹౹
65.కోశలక్షణములు విచారించి ఆనందమయకోశము గమనించి 'నేనే బ్రహ్మమును'
అని నిశ్చయించెను.
సత్యం జ్ఞానమనన్తం చేత్యేవం బ్రహ్మస్వలక్షణమ్ ౹
ఉక్త్వా గుహాహితత్వేన కోశేష్వేత త్ర్పదర్శితమ్ ౹౹66౹౹
66. శ్రుతి సత్యజ్ఞాన అనంతమైన బ్రహ్మమును మొదట వివరించి పిదప పంచకోశమునందుండిన ప్రత్యగాత్మను వర్ణించును.
వ్యాఖ్య:- భృగువుయొక్క తండ్రి "నీవే బ్రహ్మవు" అని
ఉపదేశించకపోయినప్పటికి అన్నమయ ప్రాణమయాది పంచకోశాల విచారణద్వారా ఆత్మసాక్షాత్కారానికి హేతుభూతమైన విచారణకు అవసరమైన వాటిని నిర్దేశించి చూపాడు.
అన్నమయ ప్రాణమయాది కోశాలను మాటిమాటికి చక్కగా విచారణచేసి ఆనందస్వరూపమైన ఆత్మయొక్క సాక్షాత్కారాన్ని పొందిన మీదట
ఆనందం నుండే ఈ భూతాలన్నింటి ఉత్పత్తు జరుగుతోంది.
"ఆనందాధ్యేవ ఖల్విమాని భూతములు ని జాయన్తే..."
ఇత్యాది వాక్యాల్లో చెప్పబడిన బ్రహ్మలక్షణాన్ని భృగువు తరువాత ప్రత్యగాత్మయందు అన్వయించుకొన్నాడు.
ప్రత్యగాత్మయందు బ్రహ్మలక్షణాన్ని ఆనందరూపంలో అన్వయించుకోవటం కుదరదు.
బ్రహ్మము తటస్థరూపం కలది కాబట్టి ప్రత్యగాత్మకంటె భిన్నమైనది .
"సత్యం జ్ఞానమనన్తం బ్రహ్మ"
తై. 2-1-1
పరబ్రహ్మ సత్యజ్ఞానానంత స్వరూపుడు
సత్యం జ్ఞానమనంతం అనేవి బ్రహ్మము యొక్క స్వరూపలక్షణములు.
సృష్టిస్థితిలయ కారణత్వాదులు తటస్థ లక్షణములు.
స్వరూప లక్షణములకు మార్పు ఉండదు.
తటస్థ లక్షణములు ఒకప్పుడుండవచ్చు,ఒకప్పుడు లేకపోవచ్చు.
కాకి వ్రాలియుండుట ఒకానొక ఇంటికి తటస్థ లక్షణము.
ఇనుప ద్వారము కలిగి ఉండుట స్వరూపలక్షణము.
సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని బ్రహ్మము యొక్క స్వరూపలక్షణములను చెప్పిన శ్రుతి,
"యోవేద విహితం గుహాయాం పరమే వ్యోమన్" తై. 2-1
అని పంచకోశ గుహాంతస్థ్సమైన ఆ బ్రహ్మము యొక్క ప్రత్యగాత్మత్వమును కూడా చెప్పుచున్నది.
పంచకోశ రూపమైన గుహయందున్న వానినిగా ఎవడు తెలుసుకుంటాడో,అనే ఈ శ్రుతి వాక్యాల్లో సత్యజ్ఞానానంత స్వరూపమనేది బ్రహ్మయొక్క స్వరూపలక్షణంగా చెప్పి,
తరువాతి వాక్యంలో పంచకోశాత్మకమైప గుహలో ఉన్నందున ఆ బ్రహ్మమే ప్రత్యగాత్మ అని పేర్కొన్నారు.
ఈ విధంగా ప్రత్యగాత్మకు బ్రహ్మలక్షణాన్ని అంగీకరించటం కుదురుతుంది.
'గుహ' యందు బ్రహ్మము నిహితమై ఉన్నది . పంచకోశముల వివేచన ద్వారా ప్రత్యగాత్మకు అభిన్నమగు బ్రహ్మము బోధపడును.
అధికారియైనవాడు పంచకోశములను బాగా విమర్శించి బ్రహ్మమును తెలుసుకోగలుగుతాడు.ఇట్లు బ్రహ్మమును సాక్షాత్కరించు కొనినవాడు బ్రహ్మమే అగును.
పంచకోశ వివేకముచే బ్రహ్మమును ప్రత్యగభిన్నముగ సాక్షాత్కరించు కొనవలెనని అభిప్రాయము.
No comments:
Post a Comment