Thursday, January 30, 2025

 *ఆవరణం....*

మానవునికి ఎల్లప్పుడు తాను ఉన్నాననే అతనికి తెలుసు. కానీ తాను ఎవరనేది మాత్రమే తెలియదు. ఎందుకు అంటే ఆవరణ జీవుణ్ణి కప్పివేస్తుంది. అతడు ప్రపంచాన్ని చూస్తాడు. కాని, అది ఒక బ్రహ్మమేనని గ్రహించడు. అతనిది చీకట్లో వెలుతురుని నెతుక్కునే.. అజ్ఞానంలోని జ్ఞానం.

సినిమా ప్రదర్శనలో హాలును మొదట చీకటి చేసి పిమ్మట కృతకమైన వెలుతురు ప్రవేశ పెట్టి బొమ్మలు చూపిస్తారు. భేదజ్ఞానానికి ప్రతిబింబితమైన వెలుతురు అవసరం. నిద్ర అనే చీకటి, లేక అజ్ఞానంలో నిద్రించేవాడు కలలో దృశ్యాలు చూస్తాడు. అదే రీతిగా అజ్ఞానమనే చీకట్లోనే ప్రపంచ దృశ్యజ్ఞానం అనుభవిస్తూ ఆనందిస్తుంటాడు.

అజ్ఞానంలోంచి మేల్కోనడం నిద్రలో దుస్స్వప్నంలోంచి మేల్కొనడంతో పోల్చారు. చిత్తానికి ఆవరణం, విక్షేపం అనే రెండు దోషాలున్నాయి. వీటిలో ఆవరణమే చెడ్డది. విక్షేపం చెడ్డది కాదు. నిద్రావరణం ఉన్నంతవరకూ దుస్స్వప్నం ఉంటుంది. మేల్కొనగానే ఈ ఆవరణం పోతుంది. ఇక ఏ భయం ఉండదు. విక్షేపం సుఖానికి ప్రతిబంధకం కాదు. ప్రపంచం వలన కలిగిన విక్షేపం తొలగించుకోడానికి..

దైవారాధన,
గురుసన్నిధి,
శాస్త్రాభ్యాసం,

..మొదలైన ప్రవృత్తులను అవలంబిస్తే అది అజ్ఞానావరణ లోంచి మేల్కొనడానికి దారి తీస్తుంది...

No comments:

Post a Comment