Vedantha panchadasi:
ఏవం సతి మహావాక్యా త్పరోక్షజ్ఞాన మిర్యతే ౹
యైస్తేషాం శాస్త్రసిద్ధాంత విజ్ఞానం శోభతేతరామ్ ౹౹79౹౹
79. ఇట్లుండగా మహావాక్యముల వలన బ్రహ్మము గూర్చిన పరోక్షజ్ఞానమే లభించునను వారు తమ అద్భుతమైన శాస్త్రసిద్ధాంత వి(అ)జ్ఞానమును ప్రకటింతురు.
ఆస్తాం శాస్త్రస్య సిద్ధాన్తో యుక్త్యా వాక్యాత్పరోక్షధీ ః ౹
స్వర్గాది వాక్యవన్నైవం దశమే వ్యభిచారతః ౹౹80౹౹
80. యుక్తితో తార్కికముగ సాధించిన శాస్త్రి సిద్ధాంతములు అట్లుండనిమ్ము.శాస్త్ర వాక్యముల వలన కలుగునది స్వర్గాదుల వలె బ్రహ్మము గూర్చి పరోక్షజ్ఞానమే కదా అనినచో,అట్లుకాదు దశమజ్ఞానములా మహావాక్యము వలన అపరోక్షజ్ఞానము కలుగును.
స్వతోఽ పరోక్ష జీవస్య బ్రహ్మత్వ మభివాఞ్ఛతః ౹
నశ్యే త్సిద్ధాపరోక్షత్వమితి యుక్తిర్మహత్యహో ౹౹81౹౹
81.బ్రహ్మ స్వరూపాకాంక్ష కలిగి ఉండేటటువంటి స్వభావ సిద్ధంగానే అపరోక్షజ్ఞానము తో కూడినట్టి జీవునియొక్క అపరోక్షత్వం నష్టమౌతుందనే మీ యుక్తి చాలా గొప్పది !
వృద్ధిమిష్టవతో మూలమపి నష్టమితీదృశమ్ ౹
లౌకికం వచనం సార్థం సంపన్నం త్వత్ర్పసాదతః ౹౹82౹౹
82. వడ్డీమీది లోభంవల్ల అసలుకే మోసం వచ్చిందనే లోకంలోని సామెత తమలాంటి వ్యక్తుల దయవల్లనే సార్థకమౌతోంది.
వ్యాఖ్య:- ఇంత జరిగినప్పటికీ -
మహావాక్యాలవల్ల అపరోక్షజ్ఞానం సిద్ధించినప్పటికీ, కొంతమంది 'తత్త్వమసి'ఇత్యాది వాక్యాలద్వారా పరోక్షజ్ఞానం మాత్రమే కలుగుతుందని వల్లిస్తూ తమ అద్భుతమైన శాస్త్రసిద్ధాంత వి(అ)జ్ఞానమును ప్రకటిస్తూ ఉంటారు.
అటువంటి పండితుల శాస్త్ర సిద్ధాంతజ్ఞానం అందమైనదే అనుకోవాలి.
వారికి శాస్త్ర సిద్ధాంతజ్ఞానం లేదని భావం.
"శాస్త్ర సిద్ధాంతాలను వదిలివెయ్యి !
'తత్త్వమసి' ఇత్యాది మహా వాక్యాలవల్ల పరోక్షజ్ఞానమే కలుగుతుందని -
స్వర్గాదులను ప్రతిపాదించే వాక్యాల్లాగా!
ఇది యుక్తిపూర్వకంగా - అనుమానంతో తెలుస్తుంది" అని అనవచ్చు.ఇందుకు సమాధానమేమిటంటే -
నీవు పదవవాడవు అనే వాక్యం ఉంది,దీనివల్ల ఆ పదవ వానికి అపరోక్షజ్ఞానం పదవ వాని గూర్చి కలుగుతున్నట్లు తెలుస్తోంది గదా ! కాబట్టి, అన్ని వాక్యాల్నీ పరోక్షజ్ఞానం కలిగించేవిగానే భావించరాదు'అని.
ఇతర శ్రుతి వాక్యముల వలన బ్రహ్మమును గూర్చిన పరోక్షజ్ఞానమును,
మహావాక్య ముల వలన అపరోక్షజ్ఞానమును బుద్ధియందు కలుగును.
రెండూ ప్రతిబంధకములు తొలగినపుడే కలుగును.
'త్వమ్' అనే పదానికి అర్థమైన జీవాత్మకు అపరోక్షత్వం ఉండకపోతుందేమోనని మహావాక్యాన్ని పరోక్షజ్ఞాన జనకంగా అంగీకరించారా ? అని అంటే,
బ్రహ్మ స్వరూపకాంక్ష కలిగి ఉండేటటువంటి,
స్వభావ సిద్ధంగానే అపరోక్షజ్ఞానముతో కూడినట్టి
జీవుడు స్వయముగనే ఎల్లరకును అపరోక్షముగ తెలియును.
ఆ జీవుడే బ్రహ్మము అని మహావాక్యములు చెప్పగా,
ఉన్న అపరోక్షత్వము నశించి పరోక్షమగుననట ఏమి అద్భుతమైన యుక్తి !
బొత్తిగా అసంగతమైన విషయమని భావము.
వడ్డీ వచ్చునని ఆశింపగా అసలుకే (మూలధనానికే) ముప్పువచ్చెననే సామెత
మీ (ప్రతివాదుల) అనుగ్రహము వలన సార్థకమైనది.
'తత్త్వమసి' మొదలగు మహావాక్యములందు 'త్వం' పదమునకర్థమైన జీవునియందు అపరోక్షత్వము ఉండనే ఉన్నది.
ఆ అపరోక్షత్వమే 'తత్' పదమైన బ్రహ్మమునకును సిద్ధించునని వేదాంతులు, చెప్పుచుండగా బ్రహ్మమునకు
ప్రస్తుతమున్న పరోక్షత్వమే మహావాక్యముల వలన జీవునకు కలిగి అతని అపరోక్షత్వమే నశించునని ప్రతివాదులనుట హాస్యాస్పదము గదా!
"మహావాక్యముల వలన బ్రహ్మము గూర్చిన అపరోక్షజ్ఞానము కలుగును".
"శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులయిన గురుదేవుల" చేత సర్వోపనిషత్తుల సారమైన "తత్త్వమసి" - యనెడు మహావాక్యమును అనగా
"ఆ బ్రహ్మమే నీవైయున్నావని" విషయమును అర్థసహితంగా శ్రవణంజేసి, విచారణ పద్ధతిలో మననము,నిదిధ్యాసనము గావించిన పురుషునికి
"అహం బ్రహ్మస్మి" - నేనే బ్రహ్మమునైయున్నాననెడి అపరోక్ష బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానము గల్గుచున్నది.
అంతఃకరణ సంభిన్న బోధో జీవోఽ పరోక్షతామ్ ౹
అర్హత్యుపాధి సద్భావాన్న తు బ్రహ్మానుపాధితః ౹౹83౹౹
83. (ఆక్షేపము) జీవుడు అంతఃకరణమనే ఉపాధి గలవాడగుటచే అపరోక్షజ్ఞానమునకు విషయము కాగలడు. బ్రహ్మమునకు అట్టి ఉపాధి ఏమీ లేదు.కనుక నిరుపాధికమైన బ్రహ్మము అపరోక్షజ్ఞానమునకు విషయము కాజాలదు.
నైనం బ్రహ్మత్వ బోధస్య సోపాధి విషయత్వతః ౹
యావద్విదేహ కైవల్య ముపాధేరనివారణాత్ ౹౹84౹౹
84. (సమాధానము) విదేహముక్తి కలిగే వరకు ఉపాధి పూర్తిగా నివారింపబడదు. అందుచేత బ్రహ్మత్వబోధ కూడా సోపాధికమే అగును.
అంతఃకరణ సాహిత్య రాహిత్యాభ్యాం విశిష్యతే ౹
ఉపాధిర్జీవభావస్య బ్రహ్మతాయాశ్చ నాన్యథా ౹౹85౹౹
85.అంతఃకరణము ఉండుట జీవునకు ఉపాధి. అతఃకరణము లేకపోవుట బ్రహ్మమునకు ఉపాధి. వేరు భేదము లేదు.
యథా విధిరుపాధిః స్యాత్ర్పతిషేధస్తథా న కిమ్ ౹
సువర్ణ లోహభేదేన శృఖలాత్వం న భిద్యతే ౹౹86౹౹
86.విధియుపాధియైనట్లు ప్రతిషేధము మాత్రము ఏల ఉపాధి కాజాలదు ?బంగారువైనను ఇనుపవైనను సంకెలలు సంకెలలే గదా !
వ్యాఖ్య:- అంతఃకరణం ఉపాధిగా కలిగిన జీవునియొక్క అపరోక్షత్వం అనేది యుక్తి యుక్తంగానే ఉంటుంది.కానీ, బ్రహ్మము ఉపాధిలేనట్టిది - నిరుపాధికం.
అటువంటి బ్రహ్మానికి సంబంధించిన అపరోక్షత్వజ్ఞానం ఎట్లా సంభవమౌతుంది ? అని శంక.
బ్రహ్మము నిరుపాధికం అనటం విరుద్ధం అంటూ ఇందుకు సమాధానంగా -
జీవాత్మకుండే పరబ్రహ్మ రూపత్వజ్ఞానం కూడా ఉపాధితోకూడిన వస్తువు లాగానే ఉంటుంది.
అంటే ఉపాధిని విషయం చేసుకొనేదిగా ఉంటుంది.
కాబట్టి,అతని జ్ఞానానికి విషయమైనట్టి బ్రహ్మముకూడా సోపాధికమనే అనాలి. సోపాధికం కాకపోతే జ్ఞేయానికి సంబంధించిన జ్ఞానం అసంభవం,
విదేహముక్తి కలిగేటంత వరకు ఉపాధియొక్క నివృత్తి జరగదు - ఉపాధి ఉంటుంది.అందుచేత బ్రహ్మత్వబోధ కూడా సోపాధికమే అగును.
జ్ఞానము సోపాధికమైనపుడు జ్ఞేయము సోపాధికము కాక తప్పదు కదా!
అపరోక్షజ్ఞానము కలిగిన పిమ్మట ప్రారబ్ధము ఏమగుననుటలో భేదాప్రయములున్నవి.
ఆ ప్రారబ్ధము వలన అపరోక్షమైన బ్రహ్మజ్ఞానము,బ్రహ్మము కూడా సోపాధికములని ప్రస్తుత ప్రతిపాదనము.
మరి ఆ బ్రహ్మమునకు గల ఉపాధి ఏది ?
అయితే,
జీవుని ఉపాధి,బ్రహ్మ యొక్క ఉపాధి అని రెండు ఉపాధులు ఉంటాయా ? అని సందేహం,
సమాధానం -
జీవత్వ బ్రహ్మత్వ ఉపాధులు అంతఃకరణ సహితంగాను, అంతఃకరణ రహితంగానూ ఉంటాయి.
అంతఃకరణమనే ఉపాధితో కూడి ఉన్న వానిని జీవుడని,
అంతఃకరణ మనే ఉపాధి లేనివానిని బ్రహ్మమని అంటారు.
వేరుభేదము లేదు.
అద్దము ఉండిననే ప్రతిబింబము అందు కన్పించును.అద్దము పోయిన ప్రతిబింబము కూడా పోవును.
బింబము ఎప్పుడును ఉండునదే కదా !
అట్టి అద్దమే అంతఃకరణము,
అజ్ఞానవికారము.
ఉపాధి యొక్క
ఉద్దేశము, కార్యము ఏమి ?
భేదము కల్పించుట మాత్రమే.
ఉపాధిరూపమేమి అది వేరుగ ఉన్నదా లేదా అనే ప్రశ్నలు అనావశ్యకములు.
అంతఃకరణము ఉండుట జీవునకు ఉపాధి.అది లేకపోవుటయే బ్రహ్మమునకు ఉపాధి.
కుండకు పటమునకు భేదముగలదు.అయినచో కుండకు ఈ భేదమునకు భేదము గలదా ?మరలా ఈ రెండు భేదములకు భేదము గలదా అని తర్కింపుము.
భేదము తెలియుటతో ఆ భేేదము తీరినది.
అట్లే ఉపాధి యొక్క పని కూడా జీవునకు బ్రహ్మమునకు భేదము కల్పించుట.
ఆ పని ఉండుటయు చేయవచ్చును.లేకపోవుటయు చేయవచ్చును.
విధి(భావరూపమైన అంతఃకరణము)అనేది సంబంధరూపమైన ఉపాధి అయినట్లే
ప్రతిషేధం(అభావరూపమైన అంతఃకరణం)అనేది వియోగరూపమైన ఉపాధి ఎందుకు కాకూడదు ?
భావ అభావ రూపమైన భేదం చాలా స్వల్పమైనది.
బంగారుగొలుసు,ఇనపగొలుసుల్లో ఉన్న భేదమల్లా లోహానికి సంబంధించినదే !
గొలుసు అనేది రెంటిలోనూ ఒకటే అయినట్లు.
బంగారువైనను,ఇనుపవైనను సంకెలలు సంకలలే కదా!
బంధించుటకు సమర్థములే గదా!
No comments:
Post a Comment