*మనస్సు నియంత్రణ.....*
మనస్సు అణుచటకు విచారణ తప్ప వేరే మంచి ఉపాయాలు లేవు. ఒక వేళ ఇతర ఉపాయాల చేత అణగినా, మనస్సు కాసేపు మాత్రమే అణగినట్లుండి, తిరిగి లేస్తుంది. ప్రాణాయామం చేత కూడా మనస్సు అణుగుతుంది. అయితే ప్రాణం నిరోధమై ఉండే వరకు మనస్సు కూడా అణగి ఉండి, ప్రాణము మరల బయటకు కదిలేటప్పటికి మనస్సు కూడా బయటకు వచ్చి వాసనల వశం చేత అలసిపోతుంది. మనస్సుకు, ప్రాణానికి పుట్టు చోటు ఒక్కటే. తలపే మనస్సు స్వరూపం. 'నేను' అనే తలపే మనస్సు యొక్క తొలి తలపు, అదే అహంకారము.
అహంకారం ఎక్కడ పుడుతుందో అక్కడి నుండే శ్వాస(ప్రాణము) బయలుదేరుతుంది. అందుచేత మనస్సు అణిగితే ప్రాణం, ప్రాణం అణిగితే మనస్సు పరస్పరంగా అణగుతుంటాయి. అయితే సుషుప్తిలో(నిద్ర) మనస్సు అణగినా ప్రాణం అణగుటలేదు. దేహరక్షణ కోసం, దేహం ఉన్నదో మరణించినదో అనే సందేహం కలగకుండా ఈశ్వరుని చేత ఈ విధంగా ఏర్పడినది.
జాగ్రత్తు లోను, సమాధిలోను మనస్సు అణిగినప్పుడు ప్రాణము కూడా అణుగుతోంది. ప్రాణం అనేది మనస్సుయొక్క స్థూలరూపం. మరణకాలం దాకా మనస్సు ప్రాణాన్ని శరీరంలో నిలుపుకుని ఉండి, దేహం మరణించే సమయంలో దానిని కబళించుకుని(ఇముడ్చుకుని) పోవుచున్నది. కాబట్టి, ప్రాణాయామం మనస్సు లోబడుటకు సహకరిస్తుందే గానీ నశింపచెయ్యదు.
ప్రాణాయామం లాగే మూర్తి (రూప) ధ్యానము, మంత్ర జపము, ఆహారనియమము మొదలైనవి మనస్సును లొంగదీసేందుకు సహకారులే. మూర్తి ధ్యానం చేత, మంత్ర జపం చేత మనస్సు ఏకాగ్రతను చెందుచున్నది. ఎల్లప్పుడూ చలిస్తూ ఉండే ఏనుగు తొండానికి ఒక ఇనుప గొలుసును అందిస్తే ఆ ఏనుగు వేరొకదానికై చూడక దానినే పట్టుకుని ఏవిధంగా ఉండి పోతుందో, అదే విధంగా సదా సంచలించే మనస్సును ఏదో ఒక నామం లోనో, రూపం లోనో అలవాటు చేసినచో దానిని గ్రహించి ఉంటుంది.
మనస్సు అంతులేని తలపులుగా విస్తరించుట చేత ఒక్కొక్క తలపు అతి బలహీన మవుతుంది. తలపులు ఉడిగి క్షీణిస్తూ క్షీణిస్తూ, ఏకాగ్రస్థితిని పొందుట ద్వారా మనకు శక్తివంతమై ఆత్మవిచారణ సులువుగా సిద్దిస్తుంది. నియమాలన్నింటిలోనూ శ్రేష్టమైన మిత సాత్విక ఆహార నియతి చేత మనస్సు యొక్క సత్వగుణము పెంపొంది ఆత్మవిచారానికి సాయ పడుతుంది...
No comments:
Post a Comment