"ఇలాంటివి నాకే ఎందుకు జరుగుతాయ్!" - చిన్ననాటి ముచ్చట్లు!
అప్పుడు నేను ఆరో తరగతో ఏడో తరగతో అనుకుంటాను. ఆరోజు నేను అన్నం తిననని కరాఖండీగా చెప్పేసేసరికి మా అమ్మ అరచేయి, నా వీపు, రెండు మూడు సెకండ్ల కాలంలో నాలుగైదుసార్లు గబగబా మాట్లాడేసుకున్నాయి. ఆ చర్చల ఫలితంగా నేను అన్నం తినక తప్పింది కాదు. అటువంటి చర్చలు చిన్నప్పటి నుండి అనేకమార్లు జరిగినా, ఆ వేళెందుకో.. “నాకే ఎందుకిలా జరుగుతోందని” దుఃఖం పొంగుకొచ్చింది. కానీ తమాయించుకుని కళ్ళు తుడుచుకున్నాను. లేదంటే.. తిన్న అన్నం ఏడుపువల్ల అరిగిపోయుంటుందని చెప్పి, మళ్ళా ఒక రౌండు చర్చలు జరిపైనా సరే అన్నం పెట్టేస్తుంది మా అమ్మ. ఇక్కడొక విషయం చెప్పుకోవాలి. “అడగందే అమ్మైనా అన్నం పెట్టదు” అన్న సామెత పచ్చి అబద్దం. ఆ సామెత ఎలా పుట్టిందో నాకు తెలియదు? ఒకవేళ తెలుసుకునేందుకు అప్పట్లో పరిశోధన జరిపినా ఫలితం ఉండేది కాదు. ఏమంటే.. ఈలోగా భోజనం టైమ్ అయితే, మళ్ళా మా అమ్మ అన్నం పెట్టేస్తుంది. కాదూ కూడదంటే.. ఇంకో రౌండు చర్చలు జరిపేస్తుంది. అందుకే కిక్కురుమనకుండా తినేసి కోపంతో ముసుగుతన్ని పడుకున్నాను.
ఆ మర్నాడు స్కూల్‌కి వెళ్లగానే.. అప్పట్లో నాకు మూడింతలు బరువుండే నా ప్రాణస్నేహితుడు మురళీ దగ్గరకు వెళ్లాను. వాడితో రహస్యంగా.. “ఏరా! తిండి తినే విషయంలో మీ అమ్మగారు నిన్ను కొడతారా?” అని అడిగా! వాడు నావంక పరమ ఆశ్చర్యంగా చూస్తూ.. “నిన్ననే కొట్టిందిరా మా అమ్మ! అయినా.. ఏ!!” అన్నాడు... ఇంటర్వెల్లో కొనుక్కున్న రేగొడియాన్ని చప్పరిస్తూ. వాడా మాట అనగానే నాకు బలే సంబరమేసింది. “ఆ సంగతి తరువాత చెబుతా కానీ.. ముందు ఎందుకు కొట్టారో చెప్పు?” అన్నా కాసింత ఆనందంగా. దానికి వాడు.. “నిన్న రాత్రి అందరం అన్నాలు తినేసి పడుకున్నాం. అర్ధరాత్రెప్పుడో నాకు మెలకువ వచ్చింది. నిద్ర పట్టడం లేదని, వంటింట్లోకెళితే.. అక్కడ దేవుడి గూడు దగ్గర ఒక కొబ్బరి చెక్క కనిపించింది. మళ్ళా ఎవరైనా లేస్తారేమో అని దానిని చాలా జాగ్రత్తగా నేలమీద నాలుగైదుసార్లు కొట్టి ముక్కలుగా చేశా. కొబ్బరిముక్కను బెల్లంముక్కతో కలిపి తింటే బలేగా బావుంటుంది కదరా! అందుకని ఒకపక్క కొబ్బరిముక్కలు నములుతూనే, పై గూట్లో డబ్బాలన్నీ వెదకి బెల్లం ముక్క కూడా సంపాదించా. ఇంతలో పొరపాటున ఒక డబ్బా పైనుండి క్రింద పడింది. ఏ పిల్లి వచ్చేసిందో అనుకుంటూ మా అమ్మ నిద్దర్లేచి కంగారుగా వంటింట్లోకి వచ్చింది. ఇంకేముంది.. ఒక చేత్తో కొబ్బరిముక్క, ఇంకో చేత్తో పెద్ద బెల్లంముక్క పట్టుకుని, నోట్లో కొబ్బరి నెమరేస్తూ మా అమ్మ కంట పట్టాను. చెయ్యి అడ్డు పెట్టుకోవడానికి కూడా లేదు! “అర్ధరాత్రివేళ ఈ తిళ్ళేమిట్రా నీకు? అరుగుతాయా అసలు!!” అంటూ వీపు విమానం మోత మోగించేసింది” అన్నాడు ఉక్రోషంగా. “ఓ అందుక్కొట్టారా!” అన్నా ఉసూరుమనుకుంటూ. ఏ “మీ అమ్మ నిన్నెందుక్కొట్టారు” అన్నాడు తిరిగి. “ఏం లేదులే!” అని ఊరుకున్నా.
మురళీ వాళ్ళ అమ్మగారిది, మా అమ్మది ఒకటే పంథా. ఎప్పుడూ మా కోసం రకరకాల వంటలు, పిండివంటలు రుచిగా చేసి, కొసరి కొసరి మరీ తినిపించేవారు. ఇద్దరం అమ్మకూచీలమే. కాకపోతే, అసలు తిండి తినడం లేదని నాతో మా అమ్మ, తినడం ఆపడం లేదని వాడితో వాళ్ళమ్మగారు అప్పుడప్పుడూ అలా ఫలప్రదమైన చర్చలు జరుపుతుండేవారు.
ఆవిధంగా, నాకే ఎందుకిలా జరుగుతోందన్న భావన నాకు పుష్కరం వయసున్ననాడే కలిగింది. చరిత్రలో పాతిపెట్టిన తన కొబ్బరిచెక్కను, బెల్లంముక్కను బయటకు తీసి, ఇలా అజగవలో బహిరంగ ప్రదర్శనకు ఉంచడం కనుక మా మురళీ చూస్తే.. “నా ఇమేజ్ అంతా డ్యామేజ్ చేసేశాడు ఈ రాజాగాడు; అసలు ఇలాంటివి నాకే ఎందుకు జరుగుతాయ్!” అని భోంచేస్తూ బాధపడిపోవడం మాత్రం ఖాయం!!
స్వస్తి!
మీ
రాజన్ పి.టి.ఎస్.కె.Sekarana from link - https://m.youtube.com/@Ajagava/posts
Sekarana from
No comments:
Post a Comment