Monday, April 27, 2026

 ఓం నమో భగవతే రామకృష్ణాయ

 శ్రీ శారదా మాత సెలవిచ్చిన కథ ...
       
    ఒకసారి సీతాదేవి "ప్రభూ! అందరి కష్టాలనూ, దుఃఖాలనూ మీరు తీర్చరాదా! మీ రాజ్యంలోని ప్రజలందరూ సంతోషంగా ఉండేలా చేయండి. మీరు సంకల్పిస్తే అది సాధ్యమే కదా!" అని శ్రీరామునితో అన్నది.
                        
      అందుకు శ్రీరాముడు "ఏకకాలంలో అందరూ సంతోషంగా ఉండడం అనేది ఎలా సాధ్యం?" అని అన్నారు.
  
      అందుకు సీతాదేవి "ఎందుకు కాదు? మీరు తలచుకుంటే సాధ్యమే. ఎవరికి ఏమి కావాలో వాటిని కోశాగారం నుండి సరఫరా చేసేలా చూడండి!" అని అన్నది.
                                 
   అందుకు శ్రీరాముడు "సరే! నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందని లక్ష్మణుని పిలిచి, ఎవరెవరికి ఏమి కావలసినా వాటిని కోశాగారం నుండి తీసుకోవచ్చు" అని ప్రకటించమని చెప్పారు.
  
     దానితో ప్రజలందరు వెంటనే రాజభవనానికి  వెళ్లి తమ తమ అవసరాలు తెలియజేసి, కోశాగారం నుండి ధనం స్వీకరించారు. అందరూ సుఖంగా జీవించసాగారు. 
                                        
    అప్పుడు శ్రీరాముని మాయా ప్రభావంతో సీతారాములు నివసిస్తున్న భవనం పైకప్పు వాన కారణంగా కారసాగింది. మరమ్మత్తు చేయడానికి మనుషులకై కబురు పంపారు. కాని అందరూ సుఖంగా ఉన్నందున పనిచేయడానికి ఎవరూ రాలేదు.
                                             
      ఇక మరొ మార్గంలేక సీతాదేవి "ప్రభూ! ఇలా తడుస్తూ, తడుస్తూ ఇక  భరించలేను. అన్నిటిని ఇంతకుముందు ఉన్నట్లే యథాతథముగా ఉండేటట్లు చేయండి. అప్పుడే పనులకు మనుషులు లభిస్తారు. ఏకకాలంలో అందరూ సంతోషంగా ఉండడం అనేది అసంభవం" అని అన్నది. 

     అందుకు శ్రీరాముడు "సరే, అలాగే జరుగుగాక!" అని అన్నారు. తర్వాత అన్నీ మునుపటిలా సర్దుకున్నాయి. పనికి మనుషులు లభించసాగారు. అప్పుడు సీతాదేవి "ప్రభూ! ఈ సృష్టియే మీ అద్భుత లీల" అని అన్నది.

No comments:

Post a Comment