Bharathi kode
నేను సినిమాలు చాలా ఎక్కువగా చూస్తాను. కానీ వాటి గురించి మాట్లాడేది, రాసేది చాలా తక్కువ. కానీ ఈ సినిమా చూసాక రాయకుండా ఉండలేని పరిస్థితి. మన చుట్టూ ఎంతో మంది పవున్ తాయమ్మలు (pronunciation కరెక్టే అనుకుంటున్నా) ఉంటారేమో కానీ ఈ పవున్ తాయమ్మని తెర మీద చూసేసరికి అసలైన హీరో అంటే ఈమె కదా అనిపించింది. వడ్డీలకు అప్పులు ఇచ్చి వాళ్ళ ముక్కు పిండి మరీ వసూలు చేసే పవున్ తాయమ్మ అంటే ఊరంతటికీ భయం. ఆమె చచ్చిపోవాలని ప్రతి ఒక్కరూ ఎదురుచూసేవాళ్ళే. చిన్నచిన్న వాళ్లందరినీ తీసుకుపోతున్నావు కానీ పవున్ తాయమ్మ కి ఏమైనా పదహారేళ్లే అనుకుంటున్నావా, దానిని తీసుకుపోవే అని దేవుడిని నిలదీసే వాళ్ళు కూడా ఉన్నారు.
ఎవరు ఏమనుకుంటే ఏంటి, తనని తిట్టుకుంటే ఏంటి తన జీవితాన్ని తన రూల్స్ ప్రకారం జీవించింది పవున్ తాయమ్మ. ఎందుకింతగా ఈ పవున్ తాయమ్మ నచ్చింది, తన నుండి నేను, నువ్వు, ప్రతి స్త్రీ నేర్చుకోవాల్సింది ఏమిటి అని ఆలోచిస్తే ఇదిగో ఇలా అనిపించింది
పొదుపు: మన దగ్గర ఉన్నది కొంచెమే అయినా సరే అందులోనుండే ఐదో, పదో పొదుపు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఏదో ఒకరోజు అనుకోకుండా ఏమీ లేకుండా ఒంటరిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తే ఒకరి ముందు తల దించకుండా, ఒకరి మీద ఆధారపడకుండా ఆ దాచుకున్న సొమ్మే అక్కరకు వస్తుంది. Save small, stand tall — financial independence is your real power.
నైపుణ్యం: సంపాదించాల్సిన అవసరం ఉన్నా లేకున్నా ప్రతి స్త్రీకి తప్పనిసరిగా ఏదో ఒక నైపుణ్యం ఉండాలి. అనుకోని పరిస్థితి వస్తే తనంతట తాను బతకగలిగి ఉండాలి. ఒకవేళ మనకి ఏ జీవనోపాధికి సంపాదించిన నైపుణ్యాలు లేవని అనిపిస్తే, ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. భర్తని వదిలి వచ్చిన తన కూతురిని కుట్టుపని నేర్చుకోమని ప్రోత్సహించి ఆ అమ్మాయి తన బతుకేదో తాను బతకగలను అనే ధైర్యాన్ని నింపిన పవున్ తాయమ్మకి సెల్యూట్. బస్సులో పోయేటప్పుడు ముందు సీట్ లో కూర్చుని గుసగుసలాడుకుంటున్న బడి ఈడు అబ్బాయిని, అమ్మాయిని చూసి ఆ అమ్మాయి తలమీద ఒక మొట్టికాయ ఇచ్చి అమ్మ, బాబు చదువుకోమని పంపితే ఇక్కడ కూర్చుని పాటలు పాడుతున్నావా, చదువుకో అని గదమాయించి ఆ కుర్రోడిని నువ్వు పోయి ఆ పక్క సీట్ లో కూర్చోరా అని ఆ పిల్లోడిని తరిమేటప్పుడు నవ్వు వస్తుంది కానీ చదువు, జీవన నైపుణ్యాల విలువ తెలిసిన మనిషి పవున్ తాయమ్మ. It’s never too late to learn something new — one skill can change how you live your life.
ధైర్యం: రెండో పెళ్లి చేసుకుంటున్న కూతురు తాళికట్టేటప్పుడు తల దించుకుంటే తలెత్తుకుని కట్టించుకోవే అంటుంది పవున్ తాయమ్మ. చిన్న మాటే కానీ ఆడపిల్ల ఏ సందర్భంలో అయినా ధైర్యంగా తలెత్తుకు బతకాలి అని చెప్పకుండానే చెబుతుంది. Walk with your head high — your story deserves that strength.
సంతోషం: ప్రతి శుక్రవారం పవున్ తాయమ్మ టౌన్ కి పోయి తనకి ఇష్టమైన సినిమాలు చూసి, ఇష్టమైన తిండి తిని, బట్టలు కొనుక్కుని తనతో తాను ఆనందంగా గడిపి వస్తుంది. ఊరికే జల్సాగా ఖర్చుపెడుతుంది అనిపిస్తుంది కానీ ఆ ఖర్చు పెట్టేదంతా ఆమె కష్టం. తనకు ఇష్టమైన విధంగా తన జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు ఆమె అన్నివిధాలా అర్హురాలు. We don’t need to feel guilty for spending on ourselves — we earn it, we deserve it. We need to learn to enjoy our company.
ఆహారం: మాంసం కొట్టుకువెళ్ళి మొత్తం మేక ని తెచ్చి కూతురితో వండించుకుని పళ్లెం నిండా పెట్టుకుని తింటున్న పవున్ తాయమ్మని మనవడు ఆశ్చర్యంగా చూస్తుంటే ఏందిరా అట్లా చూస్తున్నావు. ఇట్లా తినబట్టే ఏ బిపిలు, షుగర్ లు లేకుండా గట్టిగా ఉన్నా అంటుంది. చాలామంది ఆడవాళ్లు వొళ్ళు వస్తుందనో, మరింకే కారణంతోనో సరిగా తినకపోవడం మనకి తెలిసిందే. పవున్ తాయమ్మని చూస్తే ఇష్టమైనది తిని కష్టపడితే అంతకంటే ఇంకేమి కావాలి అనిపిస్తుంది. Eat what you love, to your heart’s content — and stay strong.
గౌరవం: ఒక సందర్భంలో వడ్డీ డబ్బులు వసూలు చేయడానికి పవున్ తాయమ్మ ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి యజమాని ముసలితల్లి వరండాలో కూర్చుని కోడలు పెట్టిన రుచిలేని గంజి అన్నం తింటూ ఉంటుంది. ఒకరిమీద ఆధారపడితే నీకు నచ్చిన తిండి కూడా తినలేవు. ముసలితనం మీద పడేటప్పటికి మనకంటూ వెనుక కొంత ఆస్తి పోగుచేసుకుని ఒకరి మీద ఆధారపడకుండా ఉండగలిగితేనే మన గౌరవం నిలబడుతుంది. నీ దగ్గర డబ్బు ఉంటేనే నీకు గౌరవం దొరుకుతుంది అంటుంది పవున్ తాయమ్మ. నిజానికి పవున్ తాయమ్మ మంచాన పడితే ఆమె దగ్గర ఉన్న సొమ్ము ఇవ్వకుండానే ఎక్కడ పోతుందో అనే ఆసుపత్రిలో చేర్చి జాగ్రత్తగా చూసుకుంటారు ఆమె కొడుకులు. పది పరక పోగుచేసుకుని ఆమె దాచుకున్న సొమ్మే ఆమె ప్రాణాలు కాపాడింది. If you are not dependent on others for money, health or support, you live with dignity and respect.
ముగ్గురు కొడుకులు, కోడళ్ళు ఉన్నా భర్త లేని పవున్ తాయమ్మ వాళ్ళ పంచన చేరకుండా తన బతుకు తాను గౌరవంగా, నిర్భయంగా బతికింది. భర్త వేధింపులకు గురవుతున్న కూతురిని తీసుకువచ్చి తన కాళ్ళ మీద తాను నిలబడగలిగేలా ఆ పిల్లకి మరొక మంచి జీవితాన్ని అందించింది.
పవున్ తాయమ్మ లాంటి వాళ్లు మన చుట్టూ ఉండొచ్చు, కానీ వాళ్లని మనం గమనించం. ఈ సినిమా చూస్తే మాత్రం ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మన చుట్టూ ఉన్న సాధారణ మనుషుల జీవితాల నుంచే చాలా పెద్ద పాఠాలు నేర్చుకోవచ్చు. కొంచెం ధైర్యం, కొంచెం తెలివి ఉంటే జీవితం ఎటువంటి ఆటుపోటులనైనా తట్టుకుని నిలబడుతుంది.
తాను ధైర్యంగా, గౌరవంగా బతకాలంటే ఆర్ధిక స్వాతంత్రం, పొదుపు చేసుకోవడం ఎంత ముఖ్యమైనవో ఈ సినిమా చూసిన ప్రతి స్త్రీకి అర్ధమవుతుంది.
సినిమా చూసిన మగవారు కూడా ఒకవేళ కాలం అనుకూలించక అకస్మాత్తుగా తనకేమైనా అయితే తన ఇంట్లో స్త్రీలు ఎవరిమీదా ఆధారపడకుండా పౌంతాయమ్మలా నిబ్బరంగా బతకగలుగుతారా అనే ఆలోచనలో పడకుండా ఉండలేరు.
P.S: పవున్ తాయమ్మలా రాధిక గారి ఆహార్యం, నటన అద్భుతం. ఆ పాత్రకి ఆమె ఇచ్చిన జీవం ఈ సినిమాకి ప్రాణం.
No comments:
Post a Comment