Wednesday, May 6, 2026

 *మహాలయపక్ష శార్ధ విధానం ఎలా ఏర్పడింది?*

మహాలయ పక్షంలో నిర్వహించే శ్రార్ధకర్మలయొక్క ప్రాధాన్యతను వివరించే ఒక కధ, మహాభారత గ్రంధంలో కనిపిస్తుంది. అది ఏమిటంటే....

కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన వారిలో మహాదాత అయిన కర్ణుడు కూడా ఉన్నాడు. ఈ కర్ణుడు తాను జీవించి ఉన్న కాలంలో తన శక్తికి మించి దానాలుచేసి “దానవీరుడు” అనే బిరుదు కూడాపొందాడు. అనగా, ఇతడు మహా పుణ్యాత్ముడు అని గుర్తించాలి. సరే, వీర మరణం పొందాడు కనుక కర్ణుడియొక్క ఆత్మ, నేరుగా స్వర్గానికి వెళ్లింది. స్వర్గంలో ఆ కర్ణుడి ఆత్మకు ఆహారంగా బంగారు బిళ్ళల్లి ఇచ్చారు. వాటిని చూసి ఆశ్చర్యపోయిన కర్ణుడు ఆ బంగారు బిళ్ళల్ని తెచ్చిన దేవ సేవకుడితో ఇలా అన్నాడు. "నేను మానవ లోకానికి చెందిన ఆత్మని, అందువల్ల నాకు ఆహారం కావాలి. కానీ, నీవు బంగారాన్ని తెచ్చావు. దాంతో నా ఆకలి ఎలా తీరుతుంది?". అప్పుడు ఇంద్రుడు అక్కడ ప్రత్యక్షం అయి ఆపై కర్ణుడితో “ఓ కర్ణా! నువ్వు బ్రతికి ఉన్నంతకాలం, అవసరం ఉన్న అందరికీ బంగారాన్ని దానం చేసావు. అది మహా పుణ్యమే. కానీ, నీవు బ్రతికి ఉన్న సమయంలో కారణం ఏదైనప్పటికీ నీ పితృదేవతలకు ఒక్కరోజు కూడా శ్రార్ధకర్మ చెయ్యలేదు. అనగా, పితృదేవతలకు ఆహారం పెట్టలేదు. అంతేకాదు నీ గృహంలో ఏనాడూ నీ పితృదేవతల దినంనాడు అన్నదానాలు చెయ్యలేదు. ఆ కారణంగానే ఇప్పుడు నీకు ఆహారం బదులు, బంగారం ఆహారంగా ఇవ్వబడింది అని గ్రహించు" అన్నాడు. అప్పుడు కర్ణుడు, విచారం నిండిన స్వరంతో ఇంద్రుడితో "ప్రభూ! నా తల్లిదండ్రులు ఎవరో నాకు అసలు తెలియదు. ఆ కారణంగానే నేను నా పితృదేవతలకు శ్రార్ధములు పెట్టలేదు. నేను, కావాలని పితృ కర్మలను మానలేదని గ్రహించు. నాకు ఈ బంగారాన్ని తినే దుర్గతిని తప్పించు" అన్నాడు. అప్పుడు ఇంద్రుడు, కర్ణుడి మీద సానుభూతిని చూపిస్తూ కర్ణుడితో “నాయనా! నీకు 15 రోజుల వ్యవధి ఇస్తున్నాను. ఈ పక్షం రోజుల్లో నీవు భూలోకానికి మానవ రూపంలో వెళ్ళి, ఆపై ఏదైనా పవిత్ర నదీతీరంలో నీ పితృదేవతలకు శ్రాద్ధకర్మలుచేసి, ఆపై, వారి ఆత్మశాంతికోసం అన్నదానం, జలదానం లాంటి దానాలు చెయ్యి. ఆ తరువాత స్వర్గానికి తిరిగిరా. 

అప్పటి నుండి నీకు ఈ స్వర్గలోకంలో
మనుషులు తినే ఆహారమే ఇవ్వబడుతుంది" అన్నాడు. ఆ తరువాత కర్ణుడు మానవ దేహంతో భూలోకానికి వచ్చి 15 రోజులపాటు ఇక్కడ తన పితృదేవతలకు శ్రార్ధకర్మలు చేసాడు మరియు వారి జ్ఞాపకార్ధం వందలాదిమంది బ్రాహ్మణులకు విందు భోజనాలుపెట్టి, భారీ పరిమాణంలో విలువైన దానాలు చేసాడు. కర్ణుడు, భూలోకంలో ఆ 15 రోజులపాటు పితృకర్మలు చేసిన కాలాన్ని ఆ తరువాత కాలంలో "పితృపక్షం” అనే పేరుతో పిలవటం ప్రారంభించారు.

No comments:

Post a Comment